@teamvasundhara
అమ్మలకు, అమ్మాయిలకు ఈ గింజలతో ప్రయోజనాలెన్నో..!
ప్రగతికి నాలుగు నెలల పాప ఉంది. ముందు నుంచీ తన జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేది. కానీ ప్రసవమయ్యాక మాత్రం తన జుట్టు విపరీతంగా రాలుతోంది. బాబు పుట్టాక మధురిమ విపరీతమైన బరువు పెరిగింది. ప్రసవం తర్వాత ఇది సర్వసాధారణమే అయినప్పటికీ.. తానెంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని, అందరూ ‘ఏంటి.. ఇంత లావుగా తయారయ్యావ్!’ అంటూ ఆశ్చర్యపోతున్నారని చెబుతోంది. తల్లయ్యాక ప్రతి మహిళలోనూ ఇలాంటి శారీరక మార్పులు సహజమే. ఈ క్రమంలోనే తమ అందం, అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఒత్తిడి-ఆందోళనలకు గురవుతుంటారు చాలామంది అతివలు. అయితే ఇలాంటి ప్రసవానంతర సమస్యలకు పరిష్కారం చూపే అద్భుత ఔషధం, అందులోని సుగుణాలేంటో ఇటీవలే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. అంతేకాదు.. ఆ పదార్థంపై చాలామందిలో నెలకొన్న సందేహాలకు సోషల్ మీడియా పోస్ట్ రూపంలో బదులిచ్చారు కూడా! మరి, ఇంతకీ ఏంటా ఔషధం? దాని గురించి రుజుత ఏమంటున్నారు? తెలుసుకుందాం రండి.. ఆరోగ్యం, ఫిట్నెస్.. వంటి అంశాల్లో అందరినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఈ క్రమంలోనే కొత్తగా తల్లైన మహిళల కోసం ఇటీవలే ఓ చక్కటి చిట్కాను అందించారామె. ప్రసవానంతరం అధిక బరువు, అందం తగ్గిపోవడం.. వంటి సమస్యలు చాలామంది అతివల్లో సర్వసాధారణమే అని.. అయితే వీటన్నిటికీ అలీవ్ గింజలతో చెక్ పెట్టచ్చంటూ చెప్పుకొచ్చారు రుజుత. అంతేకాదు.. ప్రసవానంతరం తిరిగి కోలుకోవడానికి ఉపయోగించే ఆయుర్వేద పదార్థాల్లో ఇదీ ఒకటంటూ అందులో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి పంచుకున్నారీ న్యూట్రిషనిస్ట్.
చిటికెడు గింజలతో ప్రయోజనాలు బోలెడు!
అలీవ్ గింజల్లో దాగున్న పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరిస్తూ రూపొందించిన వీడియోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు రుజుత. ఇందులో భాగంగా.. * అందం తగ్గిపోవడం, బరువు పెరగడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలు కొత్తగా తల్లైన మహిళల్లో కామన్! మరి, వీటన్నింటి నుంచి బయటపడాలంటే అలీవ్ గింజలు చక్కగా దోహద పడతాయి. అలాగే ప్రసవానంతరం తిరిగి కోలుకోవడానికి తీసుకునే పదార్థాల్లో అలీవ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. * అంతేకాదు.. కొత్తగా తల్లైన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ ఈ గింజలు ముందుంటాయి. * ఐరన్, ఫోలికామ్లం, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘ఇ’, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉన్న ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ దోహదం చేస్తాయి. కాబట్టి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కొవిడ్ బారిన పడిన వారు అలీవ్ గింజలను తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. * సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్లో ఇవీ ఒకటి. * కొత్తగా తల్లైన మహిళలతో పాటు యుక్తవయసుకు చేరువవుతోన్న అమ్మాయిలు, మెనోపాజ్‌కు చేరువైన మహిళలు, అలొపేషియా (మాడుపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి తెల్లటి ప్యాచుల్లా ఏర్పడడం)తో బాధపడే వారు అలీవ్ గింజలను తప్పకుండా తీసుకోవాలి. * క్యాన్సర్ చికిత్స తీసుకునే వాళ్లు అలీవ్ గింజల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీమోథెరపీ వల్ల మంచి కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు. * మనసు బాగోలేనప్పుడు, తీపి తినాలన్న కోరిక కలిగినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది. * పిల్లలో ఏకాగ్రత, సత్తువను పెంచడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి. * ఈ గింజలను కొబ్బరి-నెయ్యితో తీసుకోవడం లేదంటే పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. * అలీవ్ గింజలు తీసుకోవడం అలవాటు లేని వారు చిటికెడు మాత్రమే తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అది కూడా పాలతో, లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి. * పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, సంతానోత్పత్తికి, మానసిక ఒత్తిళ్లు-ఆందోళనల్ని దూరం చేయడానికి అలీవ్ గింజలను మించిన ఆహారం మరొకటి లేదు’ అంటూ ఈ విత్తనాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలను వివరించారు రుజుత.
|
ఎప్పుడు తినచ్చు?!

అంతేకాదు.. ఈ గింజల గురించి పలువురు సోషల్ మీడియా వేదికగా అడిగిన ప్రశ్నలకూ సమాధానాలిచ్చారీ పోషకాహార నిపుణురాలు. అలీవ్ గింజల్ని ఎవరు తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు, యుక్తవయసుకు దగ్గరవుతోన్న అమ్మాయిలు/అబ్బాయిలు, మధ్య వయస్కులు తీసుకోవాలి. అలాగే జుట్టు రాలడం, చర్మం ప్యాచుల్లా మారడం, అలొపేషియా (మాడుపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి తెల్లటి ప్యాచుల్లా ఏర్పడడం)తో బాధపడేవారు తీసుకుంటే ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి కల్పించేందుకూ ఈ గింజలు దోహదం చేస్తాయి. ఫోలికామ్లం, ఐరన్, విటమిన్లు ఎ, ఇ.. వంటి పోషకాలు నిండి ఉన్న ఈ సూపర్ ఫుడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలీవ్ గింజల్ని ఎలా తీసుకోవాలి? అలీవ్ గింజల్ని నెయ్యి, కొబ్బరి, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకొని తీసుకోవచ్చు.. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం సమయంలో తినడం మంచిది. వీటిని పిల్లలకూ అందించచ్చు. రాత్రిపూట చిటికెడు అలీవ్ గింజల్ని పాలల్లో వేసి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత తీసుకోవడం ఉత్తమం. ఎంత తీసుకోవాలి? చిటికెడు అలీవ్ గింజల్ని ఇందాక చెప్పినట్లు పాలల్లో నానబెట్టుకోవడం, లడ్డూలు-ఖీర్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
|
అలీవ్ లడ్డూ ఇలా చేయండి!
 కావాల్సినవి * అలీవ్ గింజలు - ఒక కప్పు * కొబ్బరి తురుము - కప్పు * బెల్లం తురుము - రెండున్నర కప్పులు * నెయ్యి - 2 టీస్పూన్లు * జాజికాయ పొడి - కొద్దిగా * కొబ్బరి నీళ్లు - 1/4 కప్పు తయారీ * ముందుగా కొబ్బరి నీళ్లలో అలీవ్ గింజల్ని గంట పాటు నానబెట్టాలి. * ఆపై బెల్లం తురుము, కొబ్బరి తురుమును ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. * అరగంటయ్యాక ఈ మిశ్రమాన్ని స్టౌ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ క్రమంలో దీనికి నెయ్యి కలుపుకోవాలి. బాగా ఉడికేదాకా కలుపుతూనే ఉండాలి. * ఆపై స్టౌ మీద నుంచి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత జాజికాయ పొడిని ఈ మిశ్రమానికి కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. * ఇవి ఫ్రిజ్‌లో పెడితే 10 రోజులు, గది ఉష్ణోగ్రత వద్ద మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి.
|
గమనిక: అలీవ్ గింజలు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచివే.. అయితే వీటిని చిటికెడుకు మించి తీసుకోకూడదంటున్నారు రుజుత. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని.. ఇంకా ఈ సూపర్ ఫుడ్ గురించి మీకేమైనా సందేహాలుంటే పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
|