'స్వచ్ఛమైన నీటిని మానవాళికి అందించగలిగితే వారికి కలిగే అనారోగ్యాల్లో సగమైనా నివారించవచ్చు' అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే శరీరానికి అవసరమైన నీరు తాగడంలో చాలామంది మహిళలు శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఫలితంగా వివిధ సమస్యలకు లోను కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో నీరు తాగకపోవడం వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం.
నీరు తాగకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు
* కిడ్నీ సంబంధిత సమస్యలు
* రక్తప్రసరణ సమస్య
* శరీర ఉష్ణోగ్రత పెరగడం
* తీవ్ర అలసట, జీర్ణ సంబంధమైన సమస్యలు
* శరీరం తాజాదనాన్ని కోల్పోవడం
* అధిక బరువు
* మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మొదలైనవి.
మరి ఈ సమస్యలకు పరిష్కారాలేంటో తెలుసుకుందాం..

అవసరమైనంత మేర..
పరగడుపునే రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల సమస్త రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి నీరు మంచి ఔషధం. అలాగని రోజులో ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. దీనివల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది.
దగ్గరే ఉండాలి...
ఆఫీస్‌లో పని ఒత్తిడి వల్ల నీరు తాగడం తగ్గించుకోకూడదు. మరిచిపోకుండా ఉండేందుకు వీలైతే మీకు కనపడేటట్లు నీళ్ల బాటిల్‌ను దగ్గరగా పెట్టుకోండి. అవసరమైతే నిమ్మ, ద్రాక్ష లాంటి పండ్లరసాలు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

ప్రయాణాల్లోనూ...
మీరు దూర ప్రయాణాలకు సిద్ధమవుతున్నారా? అయితే మీ వెంట నీళ్ల బాటిల్స్ తీసుకెళ్లడం మరచిపోకండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలనే ధోరణిలో కాకుండా గంటకొకసారైనా కొద్ది మొత్తంలో నీరు తాగడానికి ప్రయత్నించండి.
అదుపులో రక్తపోటు
సాధారణంగా రక్తపోటు సమస్యతో బాధపడేవారికి ఎక్కువ నీరసంతో పాటు కళ్లు తిరగడం, తలనొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగితే ఒత్తిడిని క్రమంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా అధిక బరువు సమస్యను కూడా నివారించవచ్చు.
మేని మెరుపు
ఒత్తిడిలో ఉన్నప్పుడు రెండు గ్లాసుల నీరు తాగి.. రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఆలోచనలపై కూడా ఇది బాగా ప్రభావం చూపుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరం మెరుపును సంతరించుకోవడమే కాక.. ముడతలు పడకుండా ఉంటుంది.
సమయానుసారం..
* పరగడుపున నీరు తాగితే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది.
* స్నానానికి అయిదు నిమిషాల ముందు తాగితే రక్తపోటు తగ్గుతుంది.
* మధ్యాహ్నం భోజనం చేయడానికి అరగంట ముందు, భోజనానంతరం గంట తర్వాత నీళ్లు తాగితే జీర్ణసంబంధమైన సమస్యలను నివారించవచ్చు.
* రాత్రిపూట నిద్రపోవడానికి అయిదు నిమిషాల ముందు నీళ్లు తాగితే గుండె సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తెలిసిందిగా.. నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో. అందుకే ప్రతిరోజూ అవసరమైన పరిమాణంలో నీటిని తాగండి. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి..