ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న మాయ ఇటీవలే కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకుంది. అయినా నీరసం, ఛాతీలో నొప్పి ఇంకా తనని వెంటాడుతూనే ఉన్నాయి.
దియాకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. అయితే ఇప్పుడిప్పుడే తనలో పొడిదగ్గు, గొంతునొప్పి.. లక్షణాలు కనిపిస్తుండడంతో తెగ కంగారు పడుతోంది.
ఈ మధ్య కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా చాలామందిలో నీరసం, నిస్సత్తువ, గొంతునొప్పి, ఛాతీలో అసౌకర్యం.. వంటి లక్షణాలు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మరికొందరేమో తమకు ఎలాగో నెగెటివ్ వచ్చింది కదా పూర్తిగా కోలుకున్నట్లే అనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇలాంటి అలక్ష్యం తగదని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. వైరస్ నుంచి కోలుకునే క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చక్కటి ఆహారపుటలవాట్లు, కాసేపు వ్యాయామం చేయడం ముఖ్యమని, తద్వారా వైరస్ బారి నుంచి త్వరగా విముక్తి లభిస్తుందంటూ తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
ఓవైపు కరోనా నెగెటివ్ వచ్చినా వెంటాడుతోన్న లక్షణాలు, మరోవైపు ఈ మహమ్మారి రెండోసారీ విజృంభించే అవకాశం ఉందన్న వార్తలు అందరినీ ఒకింత కలవరానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం పాటించే జీవనశైలే మనకు శ్రీరామ రక్ష అని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడి కోలుకుంటోన్న వారి కోసం కొన్ని చిట్కాలు సూచించింది. ఈ జీవనశైలి మార్పులు బాధితుల్లో రోగనిరోధక శక్తిని పెంచి వారు కొవిడ్ బారి నుంచి త్వరగా కోలుకునేలా చేయడంతో పాటు ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.
ఎవరికి వారు ఇలా జాగ్రత్తపడాలి!

* కరోనా నెగెటివ్ వచ్చింది కదా.. ఇక మళ్లీ ఈ వైరస్ సోకదు అన్న అతి విశ్వాసం వద్దు.. ఎందుకంటే ఇది రెండోసారీ విజృంభిస్తోందన్న వార్తలు మనం చదువుతూనే ఉన్నాం. కాబట్టి కరోనా నుంచి కోలుకున్నా కూడా మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడం, శ్వాసవ్యవస్థకు సంబంధించిన పరిశుభ్రత పాటించడం (అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూను అడ్డుగా పెట్టుకోవడం, ఆపై వాటిని మూత ఉన్న చెత్త డబ్బాలో పడేయడం), సామాజిక దూరం పాటించడం.. వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. * గోరువెచ్చటి నీళ్లే తాగాలి. * ఆరోగ్యం సహకరిస్తే ఇంటి పనులు చేసుకోవచ్చు.. అలాగే వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ఉన్నా వినియోగించుకోవచ్చు. * మీ ఆరోగ్య స్థితిని బట్టి, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా రోజూ యోగా, ప్రాణాయామం, ధ్యానం.. వంటివి చేయాలి. అలాగే నిపుణుల సలహా మేరకు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయచ్చు. ఇక రోజూ ఉదయం లేదా సాయంత్రం కాసేపు నడవడం మంచిది. * చక్కటి పోషకాహారం తీసుకోవాలి. అది కూడా ఎప్పటికప్పుడు వండుకొని, సులభంగా జీర్ణమయ్యే ఆహారమైతే మరీ మంచిది. ఇందుకోసం కావాలంటే పోషకాహార నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. * నిద్ర, విశ్రాంతికి సరైన సమయం కేటాయించాలి. * కొవిడ్ చికిత్సలో భాగంగా వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. * రోజూ ఇంట్లోనే ఎవరికి వారు శరీర ఉష్ణోగ్రత, బీపీ, ఆక్సిజన్ స్థాయులు, మధుమేహం ఉన్న వారు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు.. వంటివన్నీ తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. * ఇంకా పొడిదగ్గు, గొంతునొప్పి వేధిస్తున్నట్లయితే ఉప్పు నీటితో గార్గ్లింగ్ చేయడం, ఆవిరి పట్టడం మంచిది. వీటితో పాటు వైద్యుల సలహా మేరకు ఆయా సమస్యల నుంచి ఉపశమనం కోసం మందులు వాడాలి. * తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయులు 95% కంటే తగ్గడం, ఛాతీలో నొప్పి విపరీతంగా ఉండడం, నీరసం.. వంటి లక్షణాలుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
|
రోగనిరోధక శక్తి కోసం..!

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన ఈ పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. క్వాత్.. ఇమ్యూనిటీ బూస్టర్! రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్ క్వాత్/కాఢా పానీయం చక్కగా ఉపయోగపడుతుంది. తులసి, దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాలు.. ఈ నాలుగు పదార్థాలను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా తయారైన పొడిని 3 గ్రాముల చొప్పున మరుగుతోన్న నీటిలో వేసి వడకట్టుకుంటే ఆయుష్ క్వాత్ పానీయం తయారవుతుంది. దీన్ని రోజుకోసారి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు. కావాలంటే ఇందులో రుచి కోసం నిమ్మరసం/బెల్లం, కిస్మిస్.. వంటివి కూడా కలుపుకోవచ్చు. ఈ పానీయం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.
|
తిప్ప తీగ చూర్ణంతో..
తిప్ప తీగ బెరడు నుంచి తయారుచేసిన చూర్ణాన్ని జ్వరానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందుకోసం 1-3 గ్రాముల చూర్ణాన్ని కప్పు నీటిలో వేసి మరిగించుకొని గోరువెచ్చగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా 15 రోజుల పాటు చేయడం వల్ల కరోనా నుంచి కోలుకున్నాక ఎదురయ్యే పలు దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందచ్చు. ఇందులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ పైరెటిక్ గుణాలే ఇందుకు కారణం! అంతేకాదు.. తలనొప్పి, అజీర్తి, ఆకలి లేకపోవడం, శారీరక నొప్పులు, కడుపులో మంట.. వంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం చూపుతుంది తిప్ప తీగ.

ఆరోగ్యానికి అశ్వగంధ!
కొవిడ్ వంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే క్రమంలో శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఎదురవుతుంది. ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి అశ్వగంధ చక్కగా ఉపయోగపడుతుందని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ క్రమంలో 15 రోజుల పాటు రోజుకు రెండుసార్లు 1-3 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని కప్పు నీటిలో మరిగించుకొని తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచడానికి సైతం ఇది ఔషధంగా పనిచేస్తుంది.

ఉసిరితో మేలెంతో!
జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాల నుంచి విముక్తి కలిగించే లక్షణాలు ఉసిరిలో బోలెడున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. అలాగే ఉసిరిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపడంలో సమర్థంగా పనిచేస్తాయి. అందుకే రోజుకో ఉసిరికాయ లేదంటే 1-3 గ్రాముల ఉసిరి పొడిని తీసుకోవాలని సూచిస్తోంది ఆరోగ్య శాఖ.

దీంతో పొడి దగ్గుకు చెక్!
కరోనా నుంచి కోలుకున్నా కొంతమందిలో పొడిదగ్గు మాత్రం తగ్గట్లేదు. ఇలాంటివారికి అతిమధురం చక్కటి పరిష్కారం చూపిస్తుందని చెబుతోంది ఆరోగ్య శాఖ. రోజుకు రెండుసార్లు 1-3 గ్రాముల చొప్పున అతిమధురం చూర్ణాన్ని గోరువెచ్చటి నీటిలో వేసుకొని తాగమని సలహా ఇస్తోంది. తద్వారా దగ్గుతో పాటు జలుబు నుంచి కూడా విముక్తి పొందచ్చు.

పసుపు పాలు రెండు పూటలా!
రోజూ ఉదయం, సాయంత్రం గ్లాసు గోరువెచ్చటి నీటిలో అర టీస్పూన్ పసుపు వేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. కొవిడ్ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవచ్చు. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ అలర్జిటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందుకు దోహదం చేస్తాయి.

ఈ మిశ్రమంతో గార్గ్లింగ్!
గొంతునొప్పి, గొంతులో మంట, కఫం పేరుకుపోయినప్పుడు కప్పు గోరువెచ్చటి నీటిలో అర టీస్పూన్ చొప్పున పసుపు, ఉప్పు వేసి ఆ మిశ్రమంతో గార్గ్లింగ్ చేస్తే ఉపశమనం కలుగుతుందని సలహా ఇస్తోంది ఆరోగ్య శాఖ. గొంతులో మంటకు కారణమయ్యే ఆమ్లాలను బయటికి పంపించి వేయడంలో ఉప్పు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇక పసుసులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతులో ఇన్ఫెక్షన్లు కలగజేసే బ్యాక్టీరియా, వైరస్‌ను నశింపజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

పరగడుపున చ్యవన్‌ప్రాశ్!
దాదాపు 40కి పైగా మూలికలతో తయారుచేసిన చ్యవన్‌ప్రాశ్‌ను రోజూ పరగడుపున టీస్పూన్ (5 మిల్లీగ్రాములు) చొప్పున తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల బారి నుంచి త్వరగా కోలుకోవచ్చు. అయితే గతంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. చ్యవన్‌ప్రాశ్‌ను గోరువెచ్చటి నీళ్లలో లేదంటే పాలలో కూడా కలుపుకొని తీసుకోవచ్చని సూచించింది.
ఈ చిట్కాలన్నీ కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడడంతో పాటు వీటిని రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే వీటిలోనూ ఇంకా మీకు ఏవైనా సందేహాలుంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.