పిల్లలు చిన్నతనంలో ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దొస్తుంటారు. అయితే కొంతమంది ఆహారపుటలవాట్ల వల్ల కావచ్చు.. లేదంటే జీన్స్ వల్ల కావచ్చు.. ఇలా విపరీతంగా బరువు పెరుగుతుంటారు. కొన్నాళ్లకు స్థూలకాయులుగా మారుతుంటారు. ఇలాంటి వారిని చూసి లడ్డూ, డుంబు అంటూ స్కూల్లో తోటి పిల్లలు చేసే ఎగతాళికి బాధపడుతుంటారు. తాను స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇలా ఎన్నో మాటలు పడ్డానంటోంది హైదరాబాద్‌కు చెందిన మానస. చిన్నతనంలో ఎంతో బొద్దుగా ఉండే ఆమె తోటి పిల్లలు అనే మాటలకు అప్పుడు బాధపడినా.. పెద్దయ్యే కొద్దీ అవే తనకు పాఠాలయ్యాయంటోంది. ఏ విషయంలోనైనా ఇతరుల విమర్శలకు బాధపడకుండా వాటిని సానుకూలంగా తీసుకుంటే ఆ సమస్యకు సరైన సమాధానం దొరుకుతుందంటూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
ఒక వ్యక్తిని చూసినప్పుడు వారిలో ఉండే మంచి కంటే చెడే ఎక్కువగా వెతుకుతుంటారు చాలామంది. ఆ లోపాల్ని ఆసరాగా చేసుకొని విమర్శలు చేస్తూ ఆనందిస్తుంటారు. కానీ అదే స్థితిలో మనం ఉంటే ఎలా ఫీలవుతాం.. అని ఒక్కరు కూడా ఆలోచించరు. నిజానికి అలా ఆలోచిస్తే ఈ లోకంలో ఒకరి వల్ల మరొకరు బాధపడే అవసరం రాదేమో! నేను ఎందుకిలా మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు.. చిన్నతనంలో అలాంటి విమర్శలు ఎదుర్కొన్నా కాబట్టే వాటి వల్ల కలిగే బాధ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలా మీ ముందుకొచ్చా.

నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నాన్న వ్యాపారి. అమ్మ గృహిణి. నాకు ఇద్దరు కవల సోదరులున్నారు. ఆర్థికంగా మా కుటుంబం బాగానే స్థిరపడింది. మేము ఏది అడిగినా నాన్న లేదనుకుండా కొనిచ్చే వారు. నేనైతే నాన్నకు ముద్దుల కూతురిని అని చెప్పాలి. అలా గారాబంగా పెరిగిన నేను మా ఇంటికి దగ్గర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. స్కూల్ అంటే టీచర్లు చెప్పే పాఠాలు వినడం, తోటి పిల్లలతో ఆడుకోవడం.. ఆ వయసులో నాకు తెలిసిందిదే! కానీ అంత చిన్న వయసులోనే ఒకరినొకరు ఎగతాళి కూడా చేసుకుంటారని తోటిపిల్లలతో మాటలు పడ్డాక కానీ నాకు తెలియలేదు. మా అమ్మానాన్న కాస్త బొద్దుగా ఉండే వాళ్లు. వారి శరీరతత్వమే నాకూ వచ్చినట్లుంది. పుట్టుకతోనే మంచి బరువుతో ఉన్న నేను.. పెరిగి పెద్దయ్యే క్రమంలో మరింత లావయ్యాను. దీంతో స్కూల్లో అందరూ నన్ను డుంబు, సిలిండర్ బేబీ.. అని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పిలిచేవారు. ఒక్కోసారి కొంతమంది పిల్లలు నా వెనకాల చేరి ‘అసలే లావుగా ఉంది.. ఖో ఖో ఏం ఆడుతుంది.. పరిగెత్తడం తన వల్ల అస్సలు కాదు..’ అంటూ గుసగుసలాడుకునే వారు. అవన్నీ వదిలేసి నేనెంత వారితో కలిసిపోదామనుకున్నా నేనేదో తప్పు చేసినట్లు వారు నన్ను దూరం పెట్టేవారు. లంచ్‌లో కూడా నేను ఒంటరిగానే తినేదాన్ని.

ఇలా వారి మాటలు, చేష్టలు నన్నెంతో బాధపెట్టేవి. దీనికి తోడు కొంతమంది టీచర్లు కూడా నన్ను ‘హే లడ్డు పిల్లా.. ఇలా రా!’ అని పిలిచేవారు. ఓసారి డ్యాన్స్ కాంపిటీషన్ కోసం టీచర్ పేర్లు రాసుకుంటోంది. నా పేరు ఇవ్వబోతుంటే.. ‘ఇంత లావున్నావ్.. డ్యాన్స్ ఎలా చేస్తావ్? వద్దులే.. ఆయాసం వస్తుంది!’ అని తను అనే సరికి చాలా బాధనిపించింది. ఇలా తోటి పిల్లలతో పాటు టీచర్ల మాటలు నా గుండెకు సూదిలా గుచ్చుకునేవి. ఇవన్నీ అమ్మానాన్నలతో చెబితే బాధపడతారని మౌనంగా భరించేదాన్ని. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే పదో తరగతి పూర్తిచేశా. మంచి మార్కులు రావడంతో ఇక్కడే ఓ టాప్ కాలేజీలో సీటొచ్చింది. ‘వాళ్లు అలా అన్నారు, ఇలా చేశారు అని పట్టించుకుంటూ చదివితేనే ఇన్ని మార్కులొచ్చాయి.. ఇక చదువుపై మరింత ఏకాగ్రత పెడితే నేననుకున్నట్లుగా కలెక్టర్ అవ్వచ్చు కదా!’ అనుకున్నా.. ఇలా నన్ను నేను పాజిటివ్‌గా మార్చుకుంటూనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. ఆపై సివిల్స్ కోచింగ్‌లో చేరా.

అలాగని నేను స్కూల్లో పడ్డ మాటలు మర్చిపోలేదు. ఇటు సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూనే.. ఎలాగైనా బరువు తగ్గాలనుకున్నా. ఇందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పీసీఓఎస్ ఉందని, ఆరోగ్యపరంగా బరువును అదుపులో ఉంచుకోవాలని సూచించారు. అందుకోసం చక్కని డైట్, వ్యాయామ నియమాలతో కూడిన షీట్ ఒకటి ఇచ్చారు అక్కడి న్యూట్రిషనిస్ట్. ఇక అప్పట్నుంచి క్రమం తప్పకుండా వాటినే ఫాలో అవుతున్నా. అలా నేను పాటిస్తోన్న డైట్ విషయానికొస్తే..
* ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చటి నీటితో నిమ్మరసం కలుపుకొని తీసుకుంటా.
* అంతకుముందు టీ తాగేదాన్ని.. ఇప్పుడు ఏదైనా హెర్బల్ టీ అది కూడా ఉదయం, సాయంత్రం రెండు కప్పులు తాగుతున్నా. అప్పుడప్పుడూ సత్తు డ్రింక్ (వేయించిన శెనగపిండితో చేసే పానీయం) కూడా నా డైట్లో భాగం చేసుకుంటున్నా.
* ఇక అల్పాహారం సమయంలో ఇడ్లీ, దోసె, పుల్కా, ఓట్మీట్.. వంటి నూనె తక్కువగా వాడే పదార్థాల్ని తీసుకుంటున్నా.
* బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మధ్యలో ఆకలేస్తే అరటిపండు, యాపిల్.. ఇలా ఏదో ఒక పండు తింటూ ఆకలి కోరికల్ని అదుపు చేసుకుంటున్నా.
* భోజనానికి కప్పు అన్నం, పప్పు, సబ్జీ (కాయగూరలన్నింటితో చేసే కూర).. వంటివి తినొచ్చని సూచించారు న్యూట్రిషనిస్ట్. అప్పుడప్పుడూ గ్రిల్డ్ చికెన్/చేపలు, ఆమ్లెట్.. వంటివి తీసుకుంటున్నా.. అది కూడా తక్కువ నూనెతో చేసినవే!
* ఇక సాయంత్రం పూట పండ్లు, కాయగూరల సలాడ్ లేదంటే నట్స్ వంటివి తీసుకుంటున్నా.
* రాత్రి భోజనం సమయంలో చపాతీ, పప్పు, సబ్జీ ఉండాల్సిందే!

ఇక వ్యాయామాల విషయానికొస్తే.. మరీ కఠినమైన వ్యాయామాల జోలికి పోకుండా సులభంగా, ఇంట్లో చేసే వర్కవుట్స్తోనే బరువు తగ్గుతున్నా. రోజూ 15 నిమిషాలు సూర్యనమస్కారాలు, సులభమైన యోగాసనాలు, స్క్వాట్స్, స్కిప్పింగ్, మెట్లెక్కడం-దిగడం, నాకు నచ్చిన పాటలకు స్టెప్పులేయడం.. ఇవే నేను చేసే వర్కవుట్స్! ఇక మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజూ పది నిమిషాల పాటు ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నా. ఇలా నేను ఫాలో అవుతోన్న ఈ ఆహార-వ్యాయామ నియమాలు నేను బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. నా సివిల్స్ ప్రిపరేషన్‌పై పూర్తి ఏకాగ్రత పెట్టేందుకు సైతం దోహదం చేస్తున్నాయి.
******
ఆరు నెలలుగా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తోన్న నాకు మంచి ఫలితం కనిపిస్తోంది. ఈ క్రమంలో సుమారు ఐదు కిలోల దాకా తగ్గాను.. పీసీఓఎస్ కూడా క్రమంగా అదుపులోకొస్తోందని చెకప్‌కి వెళ్లినప్పుడు డాక్టర్ చెప్పారు. అంతేకాదు.. నాకెంతో ఇష్టమైన డ్యాన్స్ కూడా ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నా!
మరి, ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానని మీరు అనుకోవచ్చు.. అయితే మన గురించి ఇతరులు విమర్శిస్తున్నా, ఏదో ఒక మాట అన్నా మనకు కోపం రావడం సహజం. కానీ వారిపై కోపం చూపించే కంటే శాంతంగా ఆ మాటల్ని సానుకూలంగా తీసుకుంటే అది మనకే ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నన్నే చూడండి.. స్కూల్లో ఉన్నప్పుడు తోటి పిల్లలేదో అన్నారని వారిపై కోపం తెచ్చుకొని నా అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే నా అనారోగ్యం బయటపడేది కాదు.. నేను బరువు తగ్గడంపై దృష్టి పెట్టకపోయేదాన్నేమో! అందుకే ఇతరులేదో అన్నారని మనమూ అదే ధోరణిలో వెళ్లకుండా కాస్త ఆలోచించి చూడండి.. అందులోనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
మరొక్క మాట.. నేను బరువు తగ్గేందుకు పాటించిన ఈ డైట్, వ్యాయామ నియమాలు నా శరీరానికి మాత్రమే సరిపోవచ్చు.. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరతత్వం, ఆరోగ్య స్థితి ఒక్కోలా ఉండచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు ముందుగా డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకుని వారి సలహా మేరకు ఆహార-వ్యాయామ నియమాలు పాటిస్తే తప్పకుండా ఫిట్‌గా మారతారు.
****
మీ ‘వెయిట్ లాస్ స్టోరీ’ని మాతో పంచుకోండి!
పిల్లలకైనా, పెద్దలకైనా - బరువు పెరగడం అనేది ఓ సమస్యే. అందులోనూ - సమాజంలో పాతుకుపోయిన వివిధ మూస ధోరణులు, అభిప్రాయాల వల్ల మహిళల విషయంలో ఇది మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తోంది.
ఈ క్రమంలో- మీరు కూడా ఒకప్పుడు అధిక బరువు సమస్యతో బాధపడి; వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలి మార్పుల ద్వారా ఇప్పుడు బరువు తగ్గారా? అయితే - మీ వెయిట్ లాస్ స్టోరీని మాతో పంచుకోండి.. 'అలా బరువు తగ్గా' శీర్షికలో ప్రచురిస్తాం..
మీరు బరువు తగ్గిన విధానం, పాటించిన చిట్కాలు అధిక బరువుతో బాధపడే ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి కలిగించవచ్చు.. వాళ్లు కూడా బరువు తగ్గి ఆరోగ్యంగా మారడానికి ఉపయోగపడచ్చు.. ఇంకెందుకాలస్యం.. మీ ‘వెయిట్ లాస్ స్టోరీ’ని కింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.
|