కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలు కళ్లల్లో పడితే చాలు... ‘అబ్బ ఎంత లావుగా ఉందో... బరువు తగ్గి కొంచెం స్లిమ్‌గా మారొచ్చు కదా!’ అని కామెంట్ చేసేవారు, ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. ఇలాంటి వెటకారపు మాటలతో అప్పటివరకు తమ శరీరాన్ని చూసి ఎంతో మురిసిపోయే వారు సైతం లేనిపోని భయాలు పెంచుకుంటారు. మాటిమాటికీ అద్దంలో చూసుకుంటూ ‘ఏంటిది... ఇలా ఉన్నానేంటి’ అంటూ ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు.
ఒకానొక దశలో తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది అలనాటి తార మేనక పెద్ద కూతురు, ప్రముఖ నటి కీర్తి సురేశ్ సోదరి రేవతి సురేశ్. లావైన తన శరీరాన్ని చూసుకుని ఎంతో బాధపడ్డానని, అభద్రతా భావానికి గురయ్యానంటోంది. ఆ సమయంలో తల్లి, సోదరి సహాయంతో తన శరీరాన్ని ప్రేమించుకుంటూ తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలోనే బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
20 కేజీల బరువు తగ్గిపోయింది!
‘మహానటి’ సినిమాతో జాతీయ పురస్కారంతో పాటు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందీ అందాల తార. ఇక కీర్తి తల్లి మేనక కూడా 80వ దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన ‘పున్నమినాగు’ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె పెద్ద కూతురే రేవతి సురేశ్. తల్లిదండ్రుల్లాగే సినిమా రంగంలోనే స్థిరపడిన ఆమె కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం కీర్తి హీరోయిన్గా మలయాళంలో తెరకెక్కుతోన్న ‘వాశి’ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేవతి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, పోస్టులు షేర్ చేస్తుంటుంది. అలా కొన్ని నెలల క్రితం వరకు ఎంతో బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు 20 కేజీల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయింది.
తను నాలో ఏం చూసి ప్రేమిస్తున్నాడో!
ఈ క్రమంలో బొద్దుగా ఉన్న తన ఒకప్పటి ఫొటోను, ప్రస్తుతం బరువు తగ్గిన ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది రేవతి. ఈ సందర్భంగా తన ఫ్యాట్ టు ఫిట్ స్టోరీతో పాటు అధిక బరువు సమయంలో తనకెదురైన అనుభవాలను పంచుకుంది.
‘నా శరీర బరువు కారణంగా ఎన్నో ఏళ్ల నుంచి మానసికంగా పోరాటం చేస్తున్నాను. అందం, శరీరాకృతి విషయంలో అమ్మ, సోదరితో నన్ను పోల్చుతూ ఎగతాళి చేసేవారు. దీంతో టీనేజీ వయసులో ఉన్నప్పుడు నేను తీవ్ర అభద్రతా భావానికి గురయ్యాను. నామీద నాకు నమ్మకం పోయింది. అమ్మ, చెల్లిలా అందంగా లేనని నాలో నేను కుమిలిపోయేదాన్ని. ఒకవేళ నాకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని తీవ్రంగా ఆలోచించేదాన్ని.
ఒకానొక సమయంలో నా భర్త నాకు ప్రపోజ్ చేయగానే ..‘అసలు తను నాలో ఏం చూసి ప్రేమిస్తున్నాడో’ అని షాక్ అయ్యాను. దీనికి తోడు బయటి జనాల సూటి పోటి మాటలు, నెగెటివ్ కామెంట్లు, ఉచిత సలహాలు నన్ను మరింత వేధించాయి. ఒక పెద్దావిడైతే ‘మీ అమ్మ, చెల్లి చాలా అందంగా ఉన్నారు. నీకు ఏమైంది?’ అని ముఖం మీదే అనేసింది.
ఆ మాటలతో అభద్రతా భావం మొదలైంది!
‘నా శరీరాకృతి గురించి అందరూ నెగెటివ్‌గా మాట్లాడేసరికి నాలో అభద్రతా భావం మొదలైంది. గంటల కొద్దీ అద్దం ముందు నిలబడి నా శరీరంలో ఏం లోపముందని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకు నేను అందంగా లేనని నా అంతరాత్మను నిలదీశాను. ఒకానొక సమయంలో నన్ను నేను అసహ్యించుకున్నాను. ఇక సంతోషం అనేది నా దరిదాపుల్లోకి కూడా రాదనుకున్నాను.
ఈ సమయంలో నా సోదరి కీర్తి నాకు అండగా నిలిచింది. ఎవరైనా నా బరువు గురించి నెగెటివ్ కామెంట్లు చేస్తే కౌంటర్లు ఇచ్చింది. అదేవిధంగా తన కంటే నేనే అందంగా ఉన్నానని తన స్నేహితులు అంటున్నారని నాలో సానుకూల దృక్పథం నింపడానికి ప్రయత్నం చేసింది. కీర్తి నోట ఆ మాట రాగానే పెద్ద జోక్ అని నేను గట్టిగా నవ్వుకున్నాను. చెల్లితో పాటు అమ్మ, నా భర్త కూడా నాలో నెగెటివిటీని పోగొట్టేందుకు నిరంతరం శ్రమించారు.’
తారా ఆంటీకి థ్యాంక్స్!
‘ఇలా అంధకారంలో మగ్గిపోయిన నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత నా యోగా గురువు తారా సుదర్శన్‌కే చెందుతుంది. ఆమె కారణంగానే నా శరీరాన్ని ప్రేమించుకుంటూ 20 కేజీల బరువు తగ్గాను. నన్ను నేను నమ్మలేని పరిస్థితుల్లో తార ఆంటీ నన్ను బాగా విశ్వసించింది. నాకు యోగాను పరిచయం చేసి నాలో ఉన్న బలమేంటో తెలిసేలా చేసింది. ఆమె కారణంగానే నా మనసుతో పాటు నా శరీరం ఎంతో అందమైనదని అర్థం చేసుకున్నాను. అందుకు ఇతరుల అనుమతి అవసరం లేదని గ్రహించాను. నా శరీరాన్ని నాకు నచ్చినట్లు మార్చుకునేందుకు సహకరించిన తారా ఆంటీకి ధన్యవాదాలు..!’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది రేవతి.
బాడీ షేమింగ్ గురించి చక్కటి సందేశాన్ని చాటుతోన్న రేవతి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ ‘నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అని లవ్ అండ్ స్మైలీ ఎమోజీలతో తన అక్కకు అభినందనలు తెలిపింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు, నెటిజన్లు ‘మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది’, ‘మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి’, ‘మీరు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.