శరీరాన్ని, మనసును ఏకకాలంలో ఫిట్‌గా మార్చుకోవాలంటే మనం జపించే మంత్రం ‘యోగా’. అయితే ఇందులోనూ సరికొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. అటు యోగాసనాలు, ఇటు వ్యాయామాలు కలిపి చేస్తూ మరింత దృఢంగా మారిపోతున్నారు ఫిట్నెస్ ప్రియులు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏరియల్ యోగా కూడా అలాంటిదే! భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా గాల్లో వేలాడుతూ యోగా చేయడం ఈ వ్యాయామం ప్రత్యేకత! అంతేకాదు.. శరీరానికి, మనసుకు సంపూర్ణ ఫిట్నెస్ను, ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టే సినీ తారలంతా ఈ యోగా ట్రెండ్‌ను తెగ ఫాలో అయిపోతున్నారు. అక్కడితో ఆగిపోకుండా వారు చేసిన ఏరియల్ యోగాసనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కీ ఈ యోగాపై అవగాహన పెంచుతున్నారు. మరి, ఇంతకీ ఏంటీ ఏరియల్ యోగా? దీన్నెలా చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
ఏరియల్ యోగా.. సర్కస్ ఫీట్లను తలదన్నేలా ఉంటాయీ యోగాసనాలు. భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా గాల్లో వేలాడదీసిన ఓ హ్యామక్ సహాయంతో ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. విభిన్న యోగాసనాలు, పిలాటిస్, డ్యాన్స్.. ఈ మూడూ కలిపి చేస్తూ ఇటు శారీరక దృఢత్వాన్ని, అటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడమే ఈ సరికొత్త యోగా ట్రెండ్ ప్రత్యేకత. అందుకే మలైకా అరోరా, బిపాసా బసు, అలియా భట్, సారా అలీఖాన్, సమంత, జుహీ చావ్లా, హ్యూమా ఖురేషీ, సుస్మితా సేన్.. వంటి ముద్దుగుమ్మలంతా ఏరియల్ యోగాకు ఫిదా అయిపోయారు. వారు ఈ యోగా చేస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు ఫిట్నెస్ పాఠాలు నేర్పుతున్నారు.
ఎన్నెన్నో ప్రయోజనాలు!
* ఏరియల్ యోగాసనాలు వేసే క్రమంలో భుజాలు, నడుమును వంచుతూ పలు ఆసనాలు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ రెండు భాగాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే అవి మరింత ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.
* వెన్నునొప్పి, నడుంనొప్పితో సతమతమవుతున్నప్పుడు ఏరియల్ యోగా చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గాల్లో స్వేచ్ఛగా వేలాడడం వల్ల వెన్నెముకపై తక్కువ ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆయా భాగాలు రిలాక్సయి నొప్పి క్రమంగా తగ్గుతుంది.
* గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వేలాడుతూ యోగాసనాలు చేయడం వల్ల భలే సరదాగా అనిపిస్తుంది. ఈ ఉత్సాహం మానసిక ఒత్తిళ్లను మటుమాయం చేస్తుంది. అందుకే ఏరియల్ యోగా అటు శరీరానికే కాదు.. ఇటు మనసుకూ మందులాంటిదంటుంటారు నిపుణులు.

* ఈ యోగాసనాల వల్ల శరీరంలోని ప్రతి కండరానికీ, కీళ్లకు, ఎముకలకు వ్యాయామం అందుతుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను సొంతం చేసుకోవచ్చు.
* శారీరక స్థిరత్వాన్ని, బ్యాలన్స్‌ని పెంపొందించడంలో ఈ యోగాను మించింది లేదంటున్నారు నిపుణులు. ఫలితంగా మనం రోజువారీ ఇంట్లో చేసుకునే పనులు, ఆఫీస్ పనులు ఎంతో చురుగ్గా చేసుకోవడానికి మన శరీరం సహకరిస్తుందట!
* ఈ యోగాసనాల్లో భాగంగా తలకిందులుగా వేలాడడం వల్ల జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావం పడుతుందట! తద్వారా మలబద్ధకం, అజీర్తి.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు నయమై జీర్ణ వ్యవస్థ మరింత చురుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

* ఏరియల్ యోగా శరీరంలోని ప్రతి అవయవానికి రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* శ్వాస వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ ఏరియల్ యోగా మంచి సాధనంగా పనిచేస్తుంది.
* ఈ యోగా వల్ల చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా ముడతలు, గీతలు, కళ్ల కింద నల్లటి వలయాలు.. వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు.
* క్యాలరీలను కరిగించడంలోనూ ఈ యోగా ముందుంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో 50 నిమిషాలు వ్యాయామం చేస్తే సుమారు 320 క్యాలరీల దాకా ఖర్చవుతాయంటున్నారు. అంటే బరువు తగ్గాలనుకునే వారికీ ఇది మంచి వ్యాయామం అని అర్థమవుతుంది.
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ఏరియల్ యోగా అంటే గాల్లో తేలుతూ స్వేచ్ఛగా చేసే వ్యాయామమే అయినా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అది కొత్తగా మొదలుపెట్టే వారైనా, అలవాటు ఉన్న వారైనా దానివల్ల చేకూరే పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఇవి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. * ముందుగా ఈ యోగా చేయడానికి ఉపయోగించే హ్యామక్ (క్లాత్ స్వింగ్) నాణ్యమైనది ఎంచుకోవాలి. ఇది సుమారు 300 కిలోల దాకా బరువును ఆపగలుగుతుంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా వ్యాయామాలు చేయచ్చు. * ఈ వ్యాయామం కోసం వదులుగా ఉండే దుస్తులు కాకుండా బిగుతుగా ఉండే దుస్తుల్నే ఎంచుకోమంటున్నారు నిపుణులు. తద్వారా ఇటు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు అటు మన దుస్తులు మనకు అడ్డుపడి కింద పడకుండా జాగ్రత్తపడచ్చు.
 * కడుపు నిండుగా తిని ఏరియల్ యోగా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగని అసలేమీ తినకుండా కూడా చేయకూడదట. కాబట్టి ఏదైనా ఒక పండు తినడం, లేదా తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. * ఈ వ్యాయామం చేసేటప్పుడు జ్యుయలరీ, యాక్సెసరీస్ వంటివి ధరించకపోవడమే మంచిది. తద్వారా సౌకర్యవంతంగా వర్కవుట్ చేసుకోవచ్చు. * ఈ యోగా క్లాస్‌లో ఏదైనా కఠినమైన ఆసనం వేయాల్సి వస్తే బలవంతంగా వేయకుండా.. నిపుణుల సలహా ప్రకారం నెమ్మదిగా దాన్ని ప్రాక్టీస్ చేయడం మంచిది. తద్వారా గాయాల పాలు కాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఈ క్రమంలో మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికీ వెనకాడకూడదు.
|
ఏరియల్ యోగా శరీరానికి, మనసుకు ఎంత మంచిదో తెలుసుకున్నారుగా! అయితే చిన్నారులు, గర్భిణులు, వయసు పైబడిన వారు ఈ ఆసనాలకు దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే నిపుణుల సలహా తీసుకున్నాకే, అదీ నిపుణుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది.