కోరి కోరి బరువు పెరగాలని ఎవరూ అనుకోరు.. కానీ కొన్నిసార్లు మన శరీరంలో తలెత్తే అనారోగ్యాలే అధిక బరువుకు దారితీస్తాయి. ఇక ఈ పరిస్థితుల్లో సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటాం.. ఒక్కోసారి చనిపోవాలన్న ఆలోచనలు కూడా మన మనసును మరింత తీవ్రంగా కుంగదీస్తుంటాయి. ఒక దశలో తాను కూడా అలాంటి మానసిక క్షోభనే అనుభవించానని చెబుతోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ నమిత. తన అందం, అభినయంతో తక్కువ సినిమాల్లోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న ఈ చక్కనమ్మ.. కెరీర్ ఆరంభంలో సన్నగా కనిపించింది. ఆపై బొద్దుగా మారి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాను ఇలా విపరీతంగా బరువు పెరగడానికి కారణమేంటో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందామె. మానసిక ఒత్తిడి, ఆందోళనల గురించి అందరిలో అవగాహన పెంచే క్రమంలో నమిత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే’ పాటతో కుర్రకారు మతులు పోగొట్టింది బబ్లీ బ్యూటీ నమిత. ‘సొంతం’, ‘జెమిని’, ‘ఒక రాజు ఒక రాణి’, ‘బిల్లా’.. వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది. అయితే కెరీర్ ఆరంభంలో మల్లెతీగలా నాజూగ్గా ఉన్న నమిత.. ‘సింహా’, ‘బిల్లా’ సినిమాల్లో కాస్త బొద్దుగుమ్మగా కనిపించే సరికి అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే తానిలా విపరీతంగా బరువు పెరిగిపోవడానికి కారణం థైరాయిడ్, పీసీఓఎస్.. వంటి సమస్యలేనంటూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ క్యూట్ బ్యూటీ.
దానికి కారణం మద్యం కాదు!
పదేళ్ల క్రితం తాను లావుగా ఉన్న సమయంలో దిగిన ఫొటోతో, తాజా ఫొటోని కొలేజ్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నమిత.. ‘డిప్రెషన్ గురించి అందరిలో అవగాహన పెంచడానికే నేను ఇప్పుడు ఈ పోస్ట్ పెడుతున్నాను. ఎడమవైపు ఉన్న ఫొటో సుమారు పదేళ్ల క్రితం దిగింది. అప్పుడు నేను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాను. అయితే నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నానన్న విషయం అప్పుడు నాకు తెలియదు. కానీ ఏదో అసౌకర్యానికి లోనవుతున్నానని మాత్రం అర్థం చేసుకున్నా. రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు.. ఎక్కువ ఆహారం తీసుకునేదాన్ని. ఈ క్రమంలో రోజూ పిజ్జా తినకుండా ఉండలేకపోయేదాన్ని. ఇలా ఇవన్నీ నేను విపరీతంగా బరువు పెరిగేందుకు కారణమయ్యాయి. 97 కిలోలకు చేరుకున్నా. నేను మద్యం తాగడం వల్లే బరువు పెరిగానని అందరూ నా గురించి గుసగుసలాడుకున్నారు. కానీ థైరాయిడ్, పీసీఓఎస్ సమస్యల వల్లే నేను బరువు పెరిగానన్న విషయం నాకు మాత్రమే తెలుసు.
అది ఎక్కడో లేదు.. మనలోనే ఉంటుంది!
ఇలాంటి సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా. ఒక్కో దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి.. ఆ సమయంలో నా అనే వారు, నాకంటూ కాస్త ఓదార్పునిచ్చే వారే కరువయ్యారు. ఇలా దాదాపు ఐదున్నరేళ్ల పాటు డిప్రెషన్లోనే గడిపాను. ఆ తర్వాత ధ్యానంతో ఈ ప్రతికూలతల్ని అధిగమించా. ఈ క్రమంలో నేను ఏ డాక్టర్ దగ్గరికీ వెళ్లలేదు.. ఏ థెరపీ తీసుకోలేదు. నేను తీసుకున్న చికిత్సల్లా ధ్యానం, నాకెంతో ఇష్టమైన కృష్ణ పరమాత్ముని ఆధ్యాత్మిక చింతనలో గడపడమే! ఇలా మొత్తానికి డిప్రెషన్‌ని జయించా.. ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా.. నాకు కావాల్సిన మనశ్శాంతిని నాలోనే వెతుక్కున్నా.. మీరు దేని కోసమైతే బయటి ప్రపంచంలో వెతుకుతున్నారో అది మీలోనే ఉంటుంది.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి..’ అంటూ తన వెయిట్ లాస్ జర్నీ గురించి పంచుకుందీ ముద్దుగుమ్మ.
2017లో తన బాయ్‌ఫ్రెండ్, నటుడు, నిర్మాత అయిన వీరేంద్ర ఛౌదరిని వివాహమాడిన నమిత.. ప్రస్తుతం ‘భౌ వౌ’ అనే సినిమాలో నటిస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే మరోవైపు తన ఫిట్నెస్ వీడియోలతోనూ ఆకట్టుకుంటోందీ చక్కనమ్మ. తాను ఒంటరిగా, తన భర్తతో కలిసి జంటగా కసరత్తులు చేస్తూ.. ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. తన ఫ్యాన్స్‌కి ఫిట్నెస్ పాఠాలు నేర్పుతుంటుందీ క్యూటీ.