కొత్త ఏడాదిలో నేను అది చేయాలి.. ఇది సాధించాలని కొత్త కొత్త తీర్మానాలు తీసుకోవడం సహజం. ఈ క్రమంలో ఆరోగ్యం, ఫిట్నెస్, చెడు అలవాట్లను వదిలేయడం.. ఇలా ఎవరికి నచ్చిన లక్ష్యాలను వారు నిర్దేశించుకుంటారు.. వాటిని తమ రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటుంటారు. ఇలాగే మన టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా కొత్త ఏడాదిలో ఓ కొత్త అలవాటును అలవర్చుకున్నానని చెబుతోంది. సాధారణంగానే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాదంతా ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఓ చక్కటి వర్కవుట్‌ను తన రొటీన్లో భాగం చేసుకున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తన వర్కవుట్ వీడియోను అందరితో పంచుకుంటూ మరోసారి ఫిట్నెస్ విషయంలో అందరినీ అలర్ట్ చేసింది. మరి, ఇంతకీ సామ్ అలవాటు చేసుకున్న ఆ కొత్త ఫిట్నెస్ రొటీన్ ఏంటి? మనల్ని ఫిట్‌గా ఉంచేందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం రండి..
నటిగానే కాదు.. ఫిట్నెస్ ఫ్రీక్ గా కూడా తన ఫ్యాన్స్‌కు దగ్గరైంది సమంత. తరచూ వర్కవుట్స్ చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం ఈ అక్కినేని వారి కోడలు పిల్లకు అలవాటే! అంతేకాదు.. కొత్త కొత్త వ్యాయామాల్ని, కఠినమైన ఎక్సర్‌సైజుల్ని సాధన చేయడానికీ వెనకాడదీ తెలుగందం. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా ఓ చక్కటి వర్కవుట్‌ను తన ఫిట్నెస్ రొటీన్లో భాగం చేసుకున్నానంటోంది సామ్.
కొత్త ఏడాది.. కొత్త హాబీ!
కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఏడాదంతా ఫిట్‌గా ఉండేందుకు తాను యానిమల్ ఫ్లో వర్కవుట్‌ను తన రొటీన్లో భాగం చేసుకున్నానంటోంది సమంత. ఈ క్రమంలో ఈ వ్యాయామానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ టాలీవుడ్ బ్యూటీ.. ‘కొత్త ఏడాది.. కొత్త అలవాటు.. యానిమల్ ఫ్లో ఇన్స్ట్రక్టర్ నిషితతో కలిసి ప్రారంభిస్తున్నా..’ అంటూ క్యాప్షన్ పెట్టిందీ మిసెస్ చై. ఇందులో భాగంగా వివిధ భంగిమల్లో తన శరీరాన్ని అలవోకగా వంచుతూ ఆకట్టుకుందీ క్యూటీ. ఇలా సామ్ కొత్త హాబీకి సంబంధించిన వర్కవుట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేంటీ యానిమల్ ఫ్లో?
ఇలా సామ్ చేసిన ఈ వర్కవుట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫిట్‌నెస్‌పై ఆమెకున్న మక్కువను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. అసలేంటీ వర్కవుట్ అని ఇంటర్నెట్లో వెతికిన వారూ లేకపోలేదు. నిజానికి ఈ వ్యాయామం కొన్నేళ్ల క్రితం నుంచే బాగా ప్రాచుర్యంలో ఉంది. పేరుకు తగినట్లుగానే వివిధ జంతువుల కదలికలతో కూడిన భంగిమల్ని ఒకదాని తర్వాత మరొకటి వరుస పెట్టి చేయడమే ఈ వ్యాయామం ముఖ్యోద్దేశం. అచ్చం యోగాసనాలను పోలి ఉండే ఈ వర్కవుట్ వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు, కీళ్లకు చక్కటి వ్యాయామం అందడంతో పాటు మానసికంగానూ ప్రశాంతత లభిస్తుందంటున్నారు నిపుణులు.
సంపూర్ణ ఫిట్నెస్ను పొందచ్చు!

* చాలామంది తమ శరీరం ఎటు పడితే అటు సులభంగా వంగట్లేదు, ఫ్లెక్సిబుల్‌గా లేదు అని బాధపడుతుంటారు. అలాంటి వారికి యానిమల్ ఫ్లో వర్కవుట్ చక్కగా దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామంలో భాగంగా చేసే వివిధ భంగిమల కారణంగా అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న కీళ్లు, కండరాలు సులభంగా కదిలేందుకు వీలుగా మారతాయి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్నాళ్లకు శరీరం ఎటు పడితే అటు వంచేంత ఫ్లెక్సిబుల్‌గా మారుతుందంటున్నారు నిపుణులు. * యానిమల్ ఫ్లో వర్కవుట్ వల్ల పొట్ట కండరాలు, కటి వలయ కండరాలు, వెన్నెముక, పిరుదులు.. వంటి వాటికి చక్కటి వ్యాయామం అంది అవి దృఢంగా మారతాయి. * అథ్లెట్‌గా రాణించాలంటే ముందుగా శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం యానిమల్ ఫ్లో వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇందులోని భంగిమల్ని నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా కాస్త వేగాన్ని పెంచుకుంటూ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. * కష్టమనుకుంటే ఏదైనా కష్టమే.. అదే మనసు పెట్టి చేస్తే కష్టమనిపించిన పని కూడా సులభంగా పూర్తి చేయగలుగుతాం. యానిమల్ ఫ్లో వర్కవుట్ కూడా అంతే! ఇందులోని భంగిమలు చూసి భయపడడం కాకుండా సాధన చేస్తూ ఎంజాయ్ చేయడం వల్ల ఎంతో సరదాగా పూర్తి చేయచ్చు. తద్వారా శారీరక దృఢత్వాన్నే కాదు.. మానసిక ప్రశాంతతను కూడా సొంతం చేసుకోవచ్చు. * ఈ వర్కవుట్ భంగిమల్లో భాగంగా భుజాలను నేలపై ఆనించి.. వాటిపై ఒత్తిడి పెడుతూనే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భుజాల్లోని కండరాలకు చక్కటి వ్యాయామం అంది అవి దృఢంగా మారతాయి. * ఈ వ్యాయామాన్ని రోజూ ఓ అరగంట పాటు సాధన చేస్తే గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందట!
|
ఇవి గుర్తుపెట్టుకోండి!

* యానిమల్ ఫ్లో వ్యాయామంలో భాగంగా మనం చేసే ప్రతి భంగిమ శరీరానికి చక్కటి వ్యాయామాన్ని అందిస్తుంది. అయితే కీళ్ల సంబంధిత సమస్యలున్న వారు తప్ప ఎవరైనా ఈ వ్యాయామాల్ని సాధన చేయచ్చు. * ఈ వ్యాయామంలో చేసే ప్రతి భంగిమకు ముందు, తర్వాత పది నిమిషాల పాటు వార్మప్ చేయడం, ఆపై సాధారణ స్థితికి వచ్చాక మరో భంగిమ ప్రారంభించడం మంచిది. తద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా కదులుతుంది. గాయాలు కాకుండా జాగ్రత్తపడచ్చు. * ప్రతి భంగిమను రెండు నుంచి మూడు సార్లు పునరావృతం చేయడం వల్ల శరీర సామర్థ్యం మెరుగుపడుతుంది. * వయసు పైబడిన వారు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఇలాంటి వ్యాయామాలు చేసే విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అంతేకాదు మొదటిసారి వీటిని చేసే వారు తప్పనిసరిగా నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలట! సరైన మార్గదర్శకత్వం లేకుండా ఎలా పడితే అలా చేయడం వల్ల కండరాలు, కీళ్లు పట్టేయడం, గాయాలవడం.. వంటి లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.
|