అబ్బబ్బా.. విసుగొచ్చేసింది. ఎన్ని రోజులు డైటింగ్ చేసినా ఈ వెయింగ్ మెషీన్ ఎటూ కదలదే.. ఎప్పుడూ అదే బరువు చూపిస్తోంది. బరువు చూసుకోవాలంటేనే విసుగ్గా ఉంది.. అనుకుంటోంది ముప్ఫై సంవత్సరాల శ్రీనిధి.. ఇలాంటి సమస్య చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నవారిలో చాలామంది దాన్ని తగ్గించుకోవడానికి వివిధ రకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది బరువు తగ్గడంలో విజయం సాధిస్తే.. మరికొందరు మాత్రం వెనుకబడిపోతుంటారు. ఇలా వెనుకబడిపోవడం వెనుక కొన్ని తప్పులుంటాయి. అవేంటో విశ్లేషించుకొని, వాటిని సరిదిద్దుకుంటే సులువుగా బరువు తగ్గే వీలుంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

మరీ స్ట్రిక్ట్‌గా ఉందా?
చాలామంది డైట్‌ని చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలని ఎన్నో నిబంధనలు పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల రుచికరమైన ఆహారమేదీ వారి డైట్లో కనిపించదు. ఇలా రుచికరమైన, ఇష్టమైన పదార్థాలన్నింటికీ దూరంగా ఉండడం వల్ల ఆ డైట్ మీకు ఓ శిక్షలా అనిపిస్తుంది. ముందు ఎంతో ఓపిగ్గా ఈ తరహా డైట్‌ని ప్రారంభిస్తాం. ఒకటీ, రెండు వారాల పాటు కొనసాగించగానే విసుగు పుడుతుంది. మనపై మనకే చిరాకేస్తుంది. అప్పుడు జంక్ఫుడ్ని తినడం ప్రారంభిస్తాం. ఎంతగా అంటే తిరిగి తగ్గిన బరువంతా పెరిగిపోయేంతగా అన్నమాట. అందుకే స్ట్రిక్ట్ డైటింగ్ అస్సలు పనికిరాదు. వారానికి కనీసం రెండుసార్లు చీట్ మీల్స్ తినడానికి ఆస్కారం ఉండేలా మీ డైట్‌ని డిజైన్ చేసుకోండి. అయితే ఈ రెండూ ఒకేరోజు కాకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడూ ఓ చిన్న చాక్లెట్ లేదా ఓ నాలుగు చిప్స్ తీసుకోవడం వల్ల మీ డైట్ ఏమీ పాడవ్వదు. అందుకే వారానికి రెండుసార్లు ఇష్టమైన ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవడానికి వీలుగా ఉండేలా డైట్‌ని పాటించాల్సి ఉంటుంది.

ఒకసారి తప్పితే తప్పినట్లు కాదు..
చాలామంది డైటింగ్ బాగానే చేస్తుంటారు. మధ్యలో ఓరోజు ఏదైనా సందర్భంలో కాస్త అటూ ఇటూ అయితే చాలు.. ఇక ఈరోజు ఒకపూట ఎలాగూ తినేశాం కదా.. ఈరోజు డైటింగ్‌ని పక్కన పెట్టేద్దాం.. అనుకుంటారు. అలా ఒక పూట కాస్తా ఒక రోజవుతుంది. ఆ రోజంతా మనకిష్టమైన జంక్‌ఫుడ్ లాగించేస్తాం. వారానికి ఇలా కనీసం రెండు మూడు సార్లయిందనుకోండి.. ఇక ఈ వారం మానేసి వచ్చే వారం నుంచి పక్కాగా డైట్ పాటిస్తాను అనుకునేవారే ఎక్కువ. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఒకపూట తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా మన డైట్లో లేని ఆహారపదార్థాలు తినాల్సి వచ్చిందే అనుకోండి. దాన్ని ఆ పూటకు మాత్రం పరిమితం చేసి మరుసటి పూట చాలా లైట్‌గా ఉండే భోజనం చేయండి. దీనివల్ల క్యాలరీలు మరీ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. తద్వారా మీ డైట్ కూడా పాడవ్వదు. వారంలో మూడుసార్లు ఫంక్షన్ల వల్ల విందుభోజనం చేయాల్సి వస్తే మిగిలిన రోజుల్లో కూడా తినేయాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో డైటింగ్ చేస్తే బరువు తగ్గకపోయినా కనీసం పెరగకుండా కాపాడుకోవచ్చు.

క్రాష్ డైటింగ్..
చాలామంది క్రాష్ డైటింగ్స్పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీటి ద్వారా చాలా తక్కువ కాలంలో ఎక్కువ మోతాదులో బరువు తగ్గే అవకాశం ఉండడమే దీనికి కారణం. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. మన శరీరానికి కేవలం ఓ యాపిల్, కప్పు క్యాబేజీ సూప్ ఇచ్చే డైట్లను పాటించడం వల్ల సన్నగా అయ్యే అవకాశాలు ఉండొచ్చు కానీ దీనివల్ల తగ్గే బరువు కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్లీ పెరిగే అవకాశాలే ఎక్కువ. అంతేకాదు.. ఇలా శరీరానికి పూర్తిగా ఆహారం అందించకుండా మాడ్చడం వల్ల జీవక్రియలకు ఇబ్బంది కలగడమే కాదు.. పోషకాల లోపం తలెత్తి వివిధ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అందుకే సమతులాహారం తీసుకుంటూ డైటింగ్ చేయడం మంచిది. క్రాష్ డైట్ల ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోయి.. కాస్త బరువు తగ్గచ్చేమో.. కానీ కొవ్వు తగ్గదు. ఆ నీరు కొన్నాళ్లకే మన శరీరంలో తిరిగి చేరుతుంది కాబట్టి బరువు కూడా తిరిగి పెరగడం సహజంగా చూస్తుంటాం..

కొద్దికాలానికే కాదు..
చాలామంది డైటింగ్ బాగా చేస్తారు. సమతులాహారం తీసుకుంటారు. వారానికి రెండుసార్లు చీట్ మీల్స్ పెట్టుకొని, వ్యాయామం చేసి బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గిన తర్వాత తిరిగి ఇంతకుముందు ఉన్న పద్ధతిలోకే మారిపోతారు. అంటే నచ్చిన ఆహారం తీసుకోవడం.. వ్యాయామం మానేయడం అన్నమాట. దీనివల్ల అంత కష్టపడీ తగ్గిన బరువు తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే డైటింగ్ ప్రక్రియను కేవలం కొంతకాలం కొనసాగించి తిరిగి మానేయడం కాకుండా.. జీవితాంతం కొనసాగించేందుకు వీలుగా ఉండేలా దీన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడే తగ్గిన బరువు తిరిగి పెరగకుండా కాపాడుకోవచ్చు.