చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్ చేయాలని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

వాతావరణానికి తగినట్లుగా దుస్తులు..
మామూలు రోజుల్లో వర్కవుట్ కోసం వేసుకునే దుస్తులనే చలికాలంలోనూ వేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే ఈ కాలంలో వీచే చల్లటిగాలుల నుంచి ఆ దుస్తులు చర్మానికి రక్షణ కల్పించలేవు. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ఆ వర్కవుట్ దుస్తులపై నుంచి స్వెటర్, జర్కిన్.. వంటివి అదనంగా ధరించడం మంచిది. అలాగే చలికాలంలో బయట జాగింగ్‌కు వెళ్లే వారు వాతావరణానికి తగ్గట్లుగా వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్ని దుస్తులను ధరించాలి. ఇక మీరుండే ప్రాంతాల్లో మంచు పడుతుంటే వాటర్ రెసిస్టెంట్ కోట్లను వేసుకోవడం మంచిది. ఇలా మన చర్మం చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అదే సమయంలో వర్కవుట్లను కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎప్పటిలానే కొనసాగించవచ్చు. ఇక ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ కాలంలో ఇంటి లోపలే చిన్న పాటి వ్యాయామాలు చేయడం ఉత్తమం. అది కూడా నిపుణుల సూచన మేరకే అని గుర్తుపెట్టుకోండి.

షూస్ విషయంలో ఇవి గుర్తుపెట్టుకోండి!
చలికాలంలో ఉదయం కాస్త మంచు పడుతుంటుంది. కాబట్టి రన్నింగ్, వాకింగ్ చేసే క్రమంలో డ్రస్సింగ్ విషయంలోనే కాదు.. కాళ్లకు ధరించే షూస్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో మంచి గ్రిప్ ఉన్న షూలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మంచు వల్ల నేల తడిగా మారుతుంది.. మనం నడక, వాకింగ్, జాగింగ్ చేసే క్రమంలో ఆ తడినేలపై జారకుండా ఉండేందుకు అడుగున కాస్త గరుకుగా ఉండే గ్రిప్ తరహా షూలను ఎంచుకోవాలి. తద్వారా కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే ప్రమాదం ఉండదు.. సరికదా చలి నుంచి పాదాలకు రక్షణ లభిస్తుంది.

నీరు తాగడం మానద్దు..
చలికాలంలో అస్సలు దాహం వేయదు. ఈ సాకుతో నీరు తాగడం మానేస్తుంటారు చాలామంది. అయితే దాహం వేసినా, వేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని తాగడం మాత్రం మానద్దు. మరీ ముఖ్యంగా వర్కవుట్లు చేసే వారు చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కవుట్లు చేసే క్రమంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. తిరిగి ఆ నీటిని శరీరానికి అందించాలంటే సరైన మోతాదులో నీళ్లు తాగడం తప్పనిసరి. అయితే ఇలా మనం తీసుకునే నీళ్లు మరీ చల్లగా, మరీ వేడిగా కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచిన నీటిని వర్కవుట్ చేయడానికి ముందు, తర్వాత తీసుకోవాలి.

బయట అడుగుపెట్టే ముందు కాస్త విశ్రాంతి!
చలికాలంలో ఇంట్లో లేదంటే జిమ్‌లో వర్కవుట్లు చేసేవారు ఈ జాగ్రత్తను కచ్చితంగా పాటించాలి. ఆఫీసుకు టైం అవుతుందనో, లేదంటే మరే కారణంతోనో ఎక్సర్సైజ్ పూర్తిచేసుకున్న వెంటనే బయటకు వెళ్లకుండా కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు వర్కవుట్లతో శరీరంలో వేడి పెరుగుతుంది కాబట్టి ఒకేసారి చలి వాతావరణం తగలకపోవడమే మంచిది. కాబట్టి వ్యాయామం చేయడం పూర్తయ్యాక కాసేపు ఖాళీగా కూర్చుని రిలాక్స్ అయ్యాక బయటకు వెళ్లాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి!
చలికాలపు ఎండ వెచ్చగా, హాయిగా ఉంటుంది.. దానివల్ల ఏం జరుగుతుందిలే అని అస్సలు అనుకోవద్దు. ఎంత చలికాలమైనా సూర్యుని నుంచి అతినీలలోహిత కిరణాలు వెలువడతాయి. అవి చర్మంపై నేరుగా పడితే పలు చర్మ సమస్యలు తప్పవు. అందుకే ఉదయం పూట వాకింగ్, జాగింగ్ కోసం బయటికి వెళ్లే వారు చర్మంపై సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోనిదే బయట అడుగుపెట్టకపోవడం మంచిది. అలాగే చలి నుంచి రక్షణ కోసం ఎలాగూ ఉన్ని దుస్తులు ధరించడం మామూలే. ఇక చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్సులు ఎలాగూ వేసుకుంటాం.. కాబట్టి సూర్యుడి ఎండ వల్ల శరీరానికి, చర్మానికి ఎలాంటి హానీ కలగదు.
మరిన్ని జాగ్రత్తలు...

* ఎక్సర్సైజ్ మొదలు పెట్టే ముందు కచ్చితంగా వార్మప్ చేయాలి. లేకపోతే చలికి కాళ్లు, చేతులు, కీళ్లు బిగుసుకుపోయి ఇతర గాయాలయ్యే ప్రమాదం ఉంది. వార్మప్ వల్ల ఆ కండరాలు, కీళ్లు.. ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.. వ్యాయామం చేయడానికి సిద్ధమవుతాయి. * ఇక బయట పొగ మంచు ఎక్కువగా ఉంటే ఇంట్లోనే సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్, ఛైర్ డిప్స్, డ్యాన్సింగ్, స్కిప్పింగ్.. వంటి వ్యాయామాలు చేయచ్చు. * జాగింగ్, వాకింగ్ చేస్తున్న సమయంలో నోటితో శ్వాస తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే దీనివల్ల చలిగాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
|
సో.. చూశారుగా చలికాలంలో వర్కవుట్లు చేసే క్రమంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో! మరి, మీరూ వీటిని గుర్తుంచుకొని మీ వింటర్ వర్కవుట్‌ని మరింత సౌకర్యవంతంగా, హాయిగా ఎంజాయ్ చేసేయండి!