అధిక బరువుతో బాధపడుతోన్న పావని ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడింది. ఇందుకోసం రోజూ ఉదయాన్నే ఉడికించిన కోడిగుడ్డు తింటోంది.. అయితే అది కూడా కేవలం గుడ్డులోని తొల్లసొన మాత్రమే!
భావనకు కోడిగుడ్డు ఆమ్లెట్ అంటే భలే ఇష్టం. దాని రుచి మరింత పెరగాలని ఎక్కువ నూనె/బటర్.. వంటివి వేసి మరీ తయారుచేసుకొని లాగించేస్తుందామె. ఫలితంగా బరువు తగ్గడమేమో గానీ పెరుగుతోంది.
ప్రొటీన్లు అధికంగా ఉండే కోడిగుడ్డు తినడం వల్ల కడుపు నిండుగా అనిపించి ఇష్టం వచ్చినట్లుగా ఆహారం తీసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి గుడ్లు తీసుకోమని సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలో- బరువు తగ్గడానికి ఉడికించిన కోడిగుడ్డును రోజూ అల్పాహారంగా తీసుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ క్రమంలో మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు మనం బరువు తగ్గడానికి బదులు పెరిగేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటే కోడిగుడ్డుతో బరువు తగ్గడమే కాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ పొరపాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..
బరువు తగ్గాలనుకునే వారికి డైటీషియన్స్ సూచించే మెనూలో గుడ్డు తప్పకుండా ఉంటుంది. ఇందులోని బి 2, బి 12, డి.. వంటి విటమిన్లతో పాటు జింక్, క్యాల్షియం.. వంటి ఖనిజాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే గుడ్డును అల్పాహారంగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గచ్చని ఓ పరిశోధనలో కూడా తేలింది. ఇక జీవక్రియల్ని మెరుగుపరచడంలోనూ ఇది ముందే ఉంటుంది. అలాంటి గుడ్డు తీసుకునే విషయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా బరువు తగ్గడానికి బదులు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

పచ్చసొన వద్దంటున్నారా?
పచ్చసొనలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.. అనేది చాలామందిలో ఉన్న అపోహ. అందుకే బరువు తగ్గాలని డైటింగ్ చేసే వారు నిర్మొహమాటంగా దీన్ని తొలగించి కేవలం తెల్ల సొన తీసుకుంటారు. అయితే ఇందులో కొవ్వులు అధికంగా ఉన్న మాట వాస్తవమే.. కానీ అవి ట్రాన్స్ ఫ్యాట్స్, శ్యాచురేటెడ్ ఫ్యాట్స్.. వంటి అనారోగ్యకరమైన కొవ్వులు కాదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి పచ్చసొనలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల బరువు పెరిగే అవకాశమే లేదంటున్నారు. కాబట్టి గుడ్డుని పూర్తిగా (తెల్లసొన+పచ్చసొన) తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు శరీరానికి అంది బరువు తగ్గించడంలో సహకరిస్తాయి.
అతిగా ఉడికిస్తే ఇక అంతే!
సాధారణంగా గుడ్డు ఉడకడానికి పది నిమిషాలకు మించి సమయం పట్టదు. అయితే కొంతమంది అది ఉడికిందో లేదోనని ఇంకాసేపు అలాగే ఉంచుతారు.. మరికొంతమంది ఎక్కువ మంట మీద ఉడికిస్తుంటారు. ఈ రెండూ పొరపాట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా ఎక్కువ సమయం లేదా ఎక్కువ వేడిపై కోడిగుడ్లు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు నశించిపోయే అవకాశం ఉందట! ముఖ్యంగా విటమిన్ ‘ఎ’, యాంటీ ఆక్సిడెంట్లు తొలగిపోవడంతో పాటు ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఆక్సిడైజ్ చెంది ఆక్సీస్టెరాల్స్ అనే సమ్మేళనాల్ని విడుదల చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి కోడిగుడ్డును పది నిమిషాలకు మించి ఉడికించకపోవడమే ఉత్తమం.

వేటితో కలపొచ్చు?!
కొంతమంది కోడిగుడ్లతో పాటు సోయా పాలు, పండ్లు.. వంటివి తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి ఫుడ్ కాంబినేషన్లు జీర్ణ సంబంధిత సమస్యల్ని తెచ్చిపెడతాయి. అలాగే గుడ్లలోని ప్రొటీన్‌ను శరీరం గ్రహించకుండా చేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారే కాదు ఎవరైనా సరే.. కోడిగుడ్లతో పండ్లు, సోయా పాలు.. వంటివి కలపకపోవడమే ఉత్తమం. కాబట్టి గుడ్లతో ఏదైనా కలిపి తీసుకోవాలనుకునే వారు టొమాటో, క్యాప్సికం, పుట్టగొడుగులు.. వంటి కాయగూరలతో పాటు ఆకుకూరల్ని కలిపి తినచ్చు. తద్వారా ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండి ఇతర పదార్థాల పైకి మనసు మళ్లదు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

నూనె విషయంలోనూ అశ్రద్ధ చేయద్దు!
బరువు తగ్గే క్రమంలో కేవలం ఉడికించిన గుడ్లనే కాదు.. వీటితో బ్రెడ్ టోస్ట్, ఇతర వంటకాల్ని ట్రై చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది రుచికి ప్రాధాన్యమిస్తూ ఎక్కువగా నూనె వాడడం, అది కూడా కొవ్వులు అధికంగా ఉండే బటర్/నూనె ఉపయోగించడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల వీటిలోని శ్యాచురేటెడ్ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలోకి చేరి గుండె సంబంధిత సమస్యల్ని కలుగజేస్తాయి. కాబట్టి మీరు కోడిగుడ్డుతో తయారుచేసే వంటకాల్లో నూనె తక్కువగా వాడడంతో పాటు ఆలివ్ నూనె, కొబ్బరి నూనె.. వంటి ఆరోగ్యకరమైన నూనెల్ని ఉపయోగించాలంటున్నారు నిపుణులు.

ఇలా తీసుకుంటే మేలు!
*ఉడికించిన కోడిగుడ్లను స్లైసుల్లా కట్ చేసి శాండ్విచ్, సలాడ్స్‌లో భాగం చేసుకోవచ్చు.
*పచ్చి గుడ్డును బ్రెడ్ స్లైస్‌పై వేసి ఉడికించుకున్నా అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతాయి.
*కోడిగుడ్లను బేక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. తద్వారా వాటి రుచి పెరగడంతో పాటు ఈ క్రమంలో నూనె, బటర్ వంటి వాటి అవసరం కూడా ఉండదు.
సో.. ఇవండీ గుడ్లు తీసుకునే క్రమంలో మనం సరిదిద్దుకోవాల్సిన కొన్ని పొరపాట్లు! కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకుండా పాటిస్తే అటు బరువు తగ్గడంతో పాటు ఇటు ఆరోగ్యంగానూ ఉండచ్చు.. ఏమంటారు?!