Photo: Instagram
వ్యాయామం ప్రారంభించిన మొదట్లో అలసట లేకుండా కాసేపు చేయగలుగుతాం. అదే రోజూ సాధన చేసిన కొద్దీ సమయాన్ని పెంచుకుంటూ పోవడమే కాదు.. అందులో పరిణతి కూడా సాధించగలుగుతాం. ఇదే విషయాన్ని నిరూపిస్తోంది బాలీవుడ్ అందాల తార గుల్ పనగ్. పుషప్స్ చేయడం ప్రారంభించిన మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా.. సాధన చేసిన కొద్దీ వాటిని సునాయాసంగా చేయడానికి అలవాటు పడ్డానని చెబుతోందీ బ్యూటిఫుల్ మామ్. అందుకు లాక్డౌన్ సమయం చక్కగా ఉపయోగపడిందంటోంది. మామూలుగానే ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టే గుల్ పనగ్.. ఈ క్రమంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫిట్నెస్ పాఠాలు నేర్పుతుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన పుషప్స్ వీడియోను పోస్ట్ చేసిన ఈ తార.. సాధన వల్లే ఈ వ్యాయామం సులభంగా చేయగలుగుతున్నానంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
కరోనా కారణంగా ఈ ఏడాదంతా ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో చాలామంది తమకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొంతమంది ముద్దుగుమ్మలు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టారు. తాను కూడా ఇదే చేశానంటోంది గుల్ పనగ్. 40 ఏళ్లు దాటినా ఏమాత్రం తగ్గని అందం, ఫిట్నెస్తో దూసుకుపోతోన్న ఈ చక్కనమ్మ.. తాను అనుకున్న పుషప్స్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కరోనా కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయం చక్కగా ఉపయోగపడిందంటోంది.
సాధన వల్లే అది సాధ్యమైంది!
పుషప్స్ చేస్తోన్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న గుల్ పనగ్.. ‘మీరింత సులభంగా పుషప్స్ ఎలా చేయగలుగుతున్నారని చాలామంది నన్ను అడుగుతున్నారు. లాక్డౌన్ ఆరంభంలోనే నేను దీన్ని నా లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఎలాగైనా సరే రోజుకు వంద పుషప్స్ చేయాలనుకున్నా. అయితే ప్రారంభంలో పదికి మించి చేయలేకపోయేదాన్ని. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా రాన్రానూ ఈ వ్యాయామం చేయడం మరింత సులభమైంది. అందుకు తగినట్లుగానే నా శరీరం మరింత దృఢంగా తయారైంది. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అడిగితే మాత్రం సాధన వల్లే అని చెబుతా! ప్రస్తుతం నేను రోజూ 4-5 సెట్ల చొప్పున వంద పుషప్స్ చేయగలను.
ఇది గుర్తుపెట్టుకోండి!
రోజూ పుషప్స్ చేయడమే నా లక్ష్యం.. ఒక రోజు ఎక్కువ కావచ్చు.. ఒక రోజు తక్కువ కావచ్చు.. అలాగే వీటిలోనూ వివిధ రకాల పుషప్స్ని సాధన చేస్తున్నా.. ఈ వ్యాయామాల ద్వారా కండరాలను దృఢంగా మార్చుకోవడం పైనే దృష్టి పెట్టా. మీరు కూడా ఇలా పుషప్స్ని సాధన చేయండి.. అయితే ఈ క్రమంలో వెన్నెముక నిటారుగా ఉంచాలన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేకాదు.. ఇవి సాధన చేసే క్రమంలో నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు..’ అంటూ అభిమానులకు ఫిట్నెస్ పాఠాలు నేర్పుతోందీ ముద్దుగుమ్మ. అంతేనా.. పుషప్స్ జిమ్ డ్రస్‌లోనే కాదు.. చీరలోనూ అలవోకగా చేసేయచ్చంటూ ఇటీవలే తాను శారీలో పుషప్స్ చేసిన వీడియోను సైతం ఇన్‌స్టాలో పంచుకుందీ భామ. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది కూడా!

రోజూ చేస్తే ఎంత మంచిదో!
*పుషప్స్ని రోజూ సాధన చేయడం వల్ల శరీరంలోని కండరాలు దృఢంగా మారతాయి. ఈ క్రమంలో భుజాలు, పొట్ట, కాళ్లపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఆయా భాగాల్లోని కండరాలు బలంగా తయారవుతాయి.
*ఈ వ్యాయామం చేసే క్రమంలో గుండె నుంచి కండరాలకు చక్కటి రక్తప్రసరణ జరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. రోజూ పుషప్స్ సాధన చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది.
*రోజూ వివిధ పనుల రీత్యా మన శరీర భంగిమలు మారుతుంటాయి. ఉదాహరణకు.. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారు ఎక్కువ సమయం పాటు అలాగే కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఇదిలాగే కొనసాగితే సుదీర్ఘకాలంలో అది వంగిపోయే ప్రమాదమూ లేకపోలేదు. మరి, ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే రోజూ పుషప్స్ సాధన చేయడం మంచిదంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. అలాగే ఈ వర్కవుట్ చక్కటి శరీరాకృతిని మన సొంతం చేస్తుంది.
*శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పాత్ర కీలకం. అయితే మనం సాధన చేసే పుషప్స్ వల్ల ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు.
*ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇవి కొత్తగా సాధన చేసే వారు నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం మంచిది. అలాగే ఈ క్రమంలో వెన్నెముక నిటారుగా ఉంచడం, ఆదరాబాదరాగా కాకుండా కాస్త సమయం కేటాయించి నెమ్మదిగా చేయడం వల్ల గాయాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.
సో.. పుషప్స్ చేసే క్రమంలో మీరూ ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటే వీటిని సాధన చేయడం సులభమవుతుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫిట్నెస్ను సొంతం చేసుకోవచ్చు.