Photo: Instagram
మరికొన్ని రోజుల్లో మొదటిసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది బాలీవుడ్ అందాల తార అనుష్కా శర్మ. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. నెలలు నిండుతున్నా సినిమా షూటింగ్స్‌కు హాజరవుతూ.. తన వృత్తి నిబద్ధతను చాటుకుంటోంది. అమ్మయ్యే క్రమంలో ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు తన క్యూట్ బేబీ బంప్ ఫొటోలు, మెటర్నిటీ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది టు-బి-మామ్. ఈ క్రమంలోనే తాజాగా నిండు గర్భంతో కఠినమైన శీర్షాసనం వేసిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలో గోడ ఆధారంగా ఆమె తలకిందులుగా నిల్చోగా, ఆమె భర్త విరాట్ కోహ్లీ ముందు జాగ్రత్తగా కాళ్లు పట్టుకుని బ్యాలన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాధారణ రోజుల్లోనే ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే అనుష్క గర్భిణిగా ఉన్నప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఈ ఫిట్నెస్ జర్నీలో తన ప్రియమైన భర్త ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. ఈక్రమంలో నెలలు నిండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కఠినమైన శీర్షాసనం వేసి అందరినీ ఆశ్చర్యపరిచిందీ అందాల తార. కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లక ముందు చేసిన ఈ యోగాసనానికి సంబంధించిన ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది అనుష్క. దీంతో పాటు ఈ ఆసనం వేసేటప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు ఆ పోస్టులో స్పష్టం చేసింది.
మా వైద్యుల సూచనలతోనే!
‘చేతులు కిందికి పెట్టి..కాళ్లు పైకి ఎత్తే అతి కష్టమైన వ్యాయామమిది. యోగాకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. గర్భం ధరించడానికి ముందు ఎలాంటి ఆసనాలు వేశానో, ఇప్పుడు కూడా వాటిని చేయచ్చని మా డాక్టర్ సూచించారు. అయితే ఇందుకు మన శరీరం సహకరించాలని, ఎవరి సపోర్ట్నైనా తీసుకుని ఇలాంటి ఆసనాలు వేయమని వారు సలహా ఇచ్చారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి ఈ శీర్షాసనం వేస్తున్నా... ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నాను కాబట్టి గోడను ఆధారంగా తీసుకున్నాను. ఇక బ్యాలన్స్డ్గా ఉండేందుకు, మరింత జాగ్రత్త కోసం నా భర్త నాకు సాయం చేశాడు (లవ్ సింబల్). నా యోగా టీచర్ ష్రాఫ్ పర్యవేక్షణలోనే (వర్చువల్‌గా) ఇదంతా జరిగింది. గర్భంతో ఉన్నప్పుడు కూడా వ్యాయామాన్ని కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ.
మీరు చాలా గ్రేట్!
అనుష్క శీర్షాసనానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ ఫొటోకు సుమారు 34.71 లక్షల లైకులు రావడం విశేషం. ఇక ఈ పోస్ట్ చూసిన శిల్పాశెట్టి, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, డయానా పెంటీ, అదితీరావు హైదరి, అంకితా లోఖండే, మృణాల్ ఠాకూర్, ప్రణీత, జరీన్ ఖాన్, కిరణ్ రాథోర్, తనీషా ముఖర్జీ, అనిందితా బోస్, టిస్కా చోప్రా.. తదితర సెలబ్రిటీలు హార్ట్, లవ్ ఎమోజీలు పెట్టారు. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు అయితే ‘అనుష్కా...మీరు చాలా గ్రేట్’, ‘మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

శీర్షాసనంతో ప్రయోజనాలు బోలెడు!
ఇలా గర్భంతో ఉన్నప్పుడు కూడా డాక్టర్ సలహా మేరకు వ్యాయామాలను కొనసాగించచ్చని నిరూపించింది అనుష్క. అయితే గర్భం ధరించిన సమయంలో ఈ కఠినమైన ఆసనం వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు.
*శీర్షాసనం వల్ల తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా మెదడు, కళ్లు, చెవులు వంటి అవయవాల పనితీరు మెరుగవుతుంది.
*ఇలా తలకిందులుగా ఆసనం వేయడం వల్ల రక్తప్రసరణ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఈ క్రమంలో ఆక్సిజన్ స్థాయులు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు.
*శరీర వ్యవస్థలన్నింటినీ ఉత్తేజపరిచి.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
*గర్భంతో ఉన్నప్పుడు- హార్మోన్ల సమతుల్యం సాధించి, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉండడంలో శీర్షాసనం ఉపయోగపడుతుంది
*అదేవిధంగా శారీరక ఒత్తిడి, మానసిక ఆందోళన లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
*నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడంలో, జీర్ణశక్తిని పెంచడంలో ముందుంటుందీ ఆసనం.
*గర్భంతో ఉన్నప్పుడు కొంతమందికి నడుం నొప్పి వస్తుంటుంది. అలాంటి వారికి ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడంలో శీర్షాసనం సహకరిస్తుంది.
*గర్భిణిగా ఉన్నప్పుడు నిద్రలేమి, మానసిక ఒత్తిడి-ఆందోళనలతో బాధపడే వారు ఈ ఆసనం వేయడం వల్ల మానసిక ప్రశాంతత సొంతమవుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
యోగాసనాల్లో శీర్షాసనం చాలా కఠినమైనది. సాధారణ వ్యక్తులే ఈ ఆసనం సాధన చేయడానికి భయపడుతుంటారు. అలాంటిది గర్భిణులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో- గర్భంతో ఉన్నప్పుడు శీర్షాసనం వేయాలనుకునే వారు ఎవరికి వారుగా ప్రయత్నించడం కాకుండా ముందుగా నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది హై-రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్లో ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో ముందుగా మీ ఆరోగ్య పరిస్థితుల్ని వైద్యుల సమక్షంలో పరీక్షించుకోవాలి. అలాగే ఈ తరహా కష్టమైన వ్యాయామాలు చేయడం గతంలో అలవాటు లేని వారు గర్భంతో ఉన్నప్పుడు కొత్తగా అలవాటు చేసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి బిడ్డకు జన్మనివ్వబోతున్న క్రమంలో చేసే వ్యాయామాల విషయంలో సొంత నిర్ణయం కాకుండా నిపుణుల సలహా ప్రకారమే ముందుకు సాగడం మంచిది. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తే మరీ మంచిది.