ఏడాది క్రితం పురుడు పోసుకున్న కరోనా నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ అంటూ పలు ప్రపంచ దేశాల్లో కలవరం పుట్టిస్తోంది. మందు లేని ఈ మహమ్మారి కారణంగా చాలామంది శారీకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా వ్యాయామాలు, వర్కవుట్లకు చాలా ప్రాధాన్యమిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాయామానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
అప్పుడే కరోనాను అధిగమించగలం!
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ టీకా ఎప్పుడొస్తుందో సరైన సమాచారం లేదు. అప్పటివరకు నిరంతర అప్రమత్తత, రోగ నిరోధక శక్తితోనే కరోనాను కట్టడి చేయాలంటున్నారు నిపుణులు. ‘ఈ పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కరోనా లాంటి వైరస్‌లను అధిగమించి మనం ముందుకెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. కాబట్టి అన్ని వయస్కుల వారు వ్యాయామాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలి. ఏమీ చేయకుండా ఇంట్లో ఉండడం కంటే శారీరక శ్రమ చేయడం మంచిది. అలాగని ఒకేసారి కష్టసాధ్యమైన వ్యాయామాలు, వర్కవుట్లు చేయకూడదు. ఏదైనా నెమ్మదిగా ప్రారంభించి కాలక్రమేణా తీవ్రతను, వ్యవధిని పెంచాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

చిన్న పిల్లలు, టీనేజర్లు చురుకుగా ఉండాలంటే!
WHO మార్గదర్శకాల ప్రకారం చిన్న పిల్లలతో ప్రతిరోజూ కనీసం 17 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయించాలి. ఎక్కువగా జాగింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్ లాంటివి చేస్తే బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి పని చేయడం, వ్యాయామం చేయడం వల్ల చిన్న పిల్లల్లో మరింత చురుకుదనం పెరుగుతుంది. నడకను పిల్లలు బోరింగ్ గా భావిస్తే ఉత్సాహాన్ని కలిగించే స్కావెంజర్ హంట్, రోలర్ స్కేటింగ్ లాంటి ఆటలు ఆడించాలి. డ్యాన్స్ చేయించినా మంచి ఫలితం ఉంటుంది. ఇక టీనేజర్లు అయితే సంగీతం వింటూ వాకింగ్ చేయచ్చు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న ఫిట్నెస్ యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

పెద్దలు ఏం చేయాలంటే!
ఇక టీనేజ్ దాటిన వారు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు సాధారణ ఏరోబిక్స్ లేదా కనీసం 75 నుంచి 150 నిమిషాల పాటు కఠినమైన ఏరోబిక్స్, వ్యాయామాలు చేయాలి. గుండె జబ్బులు, రక్తపోటు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే ఈ వ్యాయమాలు తప్పనిసరి. ఇక వారానికి కనీసం రెండుసార్లు అయినా కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. అయితే ఈ వ్యాయామాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

గర్భిణులు.. ఈ మూడు పనులూ చేయండి!
గర్భం దాల్చిన సమయంలో మహిళలు చురుకుగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా ప్రయోజనం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం...ఈ మూడు పనులను క్రమం తప్పకుండా పాటిస్తే గర్భిణుల్లో చాలావరకు వ్యాధులను నివారించవచ్చు. WHO మార్గదర్శకాల ప్రకారం వీరు వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. స్ట్రెచింగ్స్ వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే ఎక్సర్సైజులు చేసేటప్పుడు డీహైడ్రేషన్, తల తిరగడం, రక్తస్రావం లాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వీరు కూడా!
క్యాన్సర్, బీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్... లాంటి సమస్యలున్న వారు వ్యాయామాన్ని తమ జీవితంలో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇందులో భాగంగా వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు సాధారణ ఏరోబిక్స్ లేదా 75 నుంచి 150 నిమిషాల పాటు కఠినమైన ఏరోబిక్స్, వ్యాయామాలు చేయాలి. వీటితో పాటు కండరాలు బలోపేతం అయ్యేలా, ఎముకల ఆరోగ్యం మెరుగయ్యేలా కొన్ని వర్కవుట్లను చేయాలి. ఇక శారీరక వైకల్యం లేదా మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కూడా వ్యాయామాలు చేయాలంటున్నారు WHO ప్రతినిధులు. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయని సూచిస్తున్నారు.