బరువు తగ్గాలనుకునే వారికి ముందుగా గుర్తొచ్చేది డైటింగ్.. అయితే కొంతమంది మాత్రం డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలనుకుంటారు. కానీ అది ఎలా సాధ్యమో తెలియక ఆకలేసినప్పుడల్లా నచ్చిన ఆహారం లాగించేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గడం కాదు.. పెరిగే అవకాశం ఉంటుంది. మరి డైటింగ్‌తో పనిలేకుండా బరువు తగ్గడమెలాగో తెలుసుకుందాం రండి...
చక్కెర తగ్గించండి..
బరువు తగ్గాలనుకొనే వారు చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే పానీయాలు, ఆహార పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే చక్కెర శరీరంలోకి చేరుతుంది. దీనివల్ల ఎంత తిన్నా కడుపు నిండుగా అనిపించక మళ్లీ ఆకలేస్తుంటుంది. తద్వారా మరింత ఆహారం లేదా పానీయాలు తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడమేమో గానీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అంతగా పానీయాలు తాగాలనిపిస్తే చక్కెర వేయకుండా తయారు చేసిన నిమ్మరసం, పండ్ల రసాలు, నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండచ్చు.

కూరగాయలెక్కువ..
డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ ఆహారంలో భాగంగా కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని సలాడ్స్ రూపంలో లేదంటే ఉడికించుకుని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా తినాలనిపించకపోతే వాటిపై కాస్త నిమ్మరసం పిండుకుంటే రుచిగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతుంది.
విశ్రాంతి ఎక్కువగా..
నిద్రలేమితో బాధపడే వారికి ఎదురయ్యే సాధారణ సమస్య బరువు పెరగడం. కాబట్టి రాత్రుళ్లు కనీసం ఏడెనిమిది గంటల పాటు హాయిగా.. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిద్ర పోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన పనులతో సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి. దీంతో శరీరానికి, మనసుకు విశ్రాంతి లభించి తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది.

గ్రీన్ టీతో..
బరువు తగ్గడానికి ఎక్కువ మంది నిపుణులు సూచించే పానీయం గ్రీన్ టీ. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు త్వరగా కరుగుతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి డైటింగ్ అవసరం లేకుండా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీని రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.
క్యాలరీలు తక్కువగా..
డైటింగ్ చేయకుండా బరువు తగ్గాలనుకోవడం మంచిదే. అయితే అలాంటి వారు తీసుకునే ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ.. వంటి క్యాలరీలు తక్కువగా ఉండే పదార్థాల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యాలరీలు, కొవ్వులు తక్కువగా ఉండే వెజిటబుల్, టమాటా.. వంటి సూప్‌లను కూడా మెనూలో కలుపుకుంటే మరీ మంచిది. ఫలితంగా ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

యోగాతో..
రోజూ యోగా చేయడం వల్ల కూడా డైటింగ్‌తో పనిలేకుండా అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చు. ఎవరైతే రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తారో వారు.. యోగా చేయని వారితో పోలిస్తే తక్కువ బరువుంటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే యోగా వల్ల ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా మానసిక ప్రశాంతత లభించి ఎక్కువ తినే అలవాటు దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ కనీసం పావుగంట యోగా, పది నిమిషాల చొప్పున నడక, జాగింగ్.. వంటివి వ్యాయామంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాల్ని పొందచ్చు.