రోజులో ఎన్నోసార్లు మన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాం. అలాంటిది ఎప్పుడైనా మనకు మనం లావుగా కనిపించినా, రోజులాగా అందంగా కనిపించకపోయినా ‘ఏంటిది.. ఈ రోజు ఇలా ఉన్నానేంటి?’ అనుకుంటూ ఉంటాం.. ఇలా తమ శరీరంలో వచ్చిన మార్పుల్ని స్వీకరించకుండా అసహ్యించుకునే వారూ లేకపోలేదు. ఒకానొక దశలో తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్. లావెక్కిన తన కాళ్లు, చేతులు చూసుకొని ఎంతో బాధపడ్డానని, అభద్రతా భావానికి లోనయ్యానని చెబుతోంది. ఇక ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం ఆలస్యంగా గ్రహించినా.. అప్పట్నుంచి తన శరీరాన్ని ప్రేమించుకుంటూ తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలోనే బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ బాలీవుడ్ బ్యూటీ. ఎలా ఉన్నా ఎవరికి వారు తమ శరీరాన్ని ప్రేమించాలని, అంగీకరించాలన్న చక్కటి సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
తన అందమైన చిరునవ్వు, ఉంగరాల జుట్టుతో.. 11 ఏళ్ల వయసులోనే ‘ఆనంది’గా (బాలికా వధూ/తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్) బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ముంబయి బ్యూటీ అవికా గోర్. ఇక పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ చక్కనమ్మ.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆపై ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘రాజుగారి గది 3’ సినిమాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకానొక దశలో లావెక్కిన తన శరీరాన్ని చూసి అసహ్యించుకున్నానని, అలా చేయడం ఎంత మాత్రమూ కరక్ట్ కాదన్న విషయం ఆ తర్వాత గ్రహించానని చెబుతూ.. బరువు తగ్గే క్రమంలో తనకెదురైన అనుభవాలను ఓ సుదీర్ఘ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వ్యక్తపరిచిందీ అందాల తార.
ఆ ఆలోచనలతో కుంగిపోయా!
‘గతేడాది ఒక రోజు రాత్రి జరిగిన సంఘటన నాకిప్పటికీ గుర్తే! ఆ రోజు అద్దంలో నన్ను నేను చూసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోయా.. బాధపడ్డా! ఎందుకంటే లావెక్కిన నా చేతులు, కాళ్లు, కొవ్వు పేరుకుపోయిన నా పొట్ట భాగం.. ఇలా నా శరీరం నాకే నచ్చలేదు. పోనీ నాకు థైరాయిడ్, పీసీఓఎస్ వంటి సమస్యలున్నాయి.. వాటి వల్లే నేను లావుగా మారానేమో అనుకుంటే అదీ లేదు. మరి, నా శరీరంలో వచ్చిన ఈ మార్పులకు కారణమేంటా అని ఆలోచిస్తే.. నేను పాటించిన ఆహార నియమాలే అన్న విషయం నాకు అర్థమైంది. నాకు నచ్చిందల్లా తినేదాన్ని.. వ్యాయామం చేయకపోయేదాన్ని! అందుకే ఇలా తయారయ్యా. నిజానికి మన శరీరాన్ని మనకు కావాల్సినట్లుగా మలచుకోవచ్చు.. కానీ ఆ విషయంలో నేను నిర్లక్ష్యం వహించాను. ఇవే ఆలోచనలతో నా మనసంతా నిండిపోయింది. దీంతో నాకు ఎంతో ఇష్టమైన డ్యాన్సింగ్‌ని కూడా ఎంజాయ్ చేయలేకపోయా. నేను ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని నన్ను నేను జడ్జ్ చేసుకోవడం మొదలుపెట్టా.. అలాగని ఇతరులకు ఈ అవకాశం ఇవ్వాలనుకోలేదు. ఇలాంటి అభద్రతా భావాలు ఆ సమయంలో నన్ను మరింత కుంగదీశాయి.
ఈ జర్నీలో ఎదురైన సవాళ్లెన్నో..!
ఇక ఇలా ఉంటే లాభం లేదు.. అని కొన్ని రోజులకు కానీ నేను రియలైజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఒక రోజు.. ‘ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా నేను మారాలి’ అని నిర్ణయించుకున్నా. అలాగని ఒక్క రాత్రిలోనే అది సాధ్యం కాదు.. కాబట్టి సరైన దారిలో వెళ్లాలనుకున్నా.. ఇందులో భాగంగానే నాకెంతో ఇష్టమైన డ్యాన్స్ సాధన చేస్తూనే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఈ క్రమంలో సవాళ్లెన్నో ఎదురయ్యాయి. అయినా నాకు నా లక్ష్యమే గొప్పదనిపించింది. అందుకే అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగాను. నా జర్నీలో నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు ఎంతగానో సపోర్ట్ చేశారు.. నాకు మార్గనిర్దేశనం చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓ నవ్వు నవ్వి, ‘నేను భలే అందంగా ఉన్నానే..’ అంటూ నాకు నేనే చెప్పుకుంటున్నా. ప్రస్తుతం నేను నా శరీరాకృతి పట్ల సంతృప్తిగా, సౌకర్యవంతంగా ఉన్నా. ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉన్నా. మీరు కూడా ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు స్వీకరించండి.. మీ శరీరాన్ని ప్రేమించుకోండి. ఈ క్రమంలో మీకెదురైన అనుభవాలను నాతో పంచుకోండి..’ అంటూ తన అనుభవాలను చెబుతూ స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తీసుకునే ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించాలని, నోటికి రుచించిందెప్పుడూ ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోండి అంటూ తన ఫ్యాన్స్‌కి ఆరోగ్య పాఠాలు చెబుతోందీ ముంబయి భామ.