ఆరోగ్యం, ఫిట్నెస్ వంటి విషయాల్లో మన అందాల నాయికలు తీసుకునేంత శ్రద్ధ మరెవరూ తీసుకోరేమో అనిపిస్తుంది వాళ్ల లైఫ్‌స్టైల్‌ని చూస్తే! అయితే వాళ్లకొచ్చే సినిమా అవకాశాలు, అందులోని పాత్రలకు తగ్గట్లుగా బరువు పెరగడం, తగ్గడం.. అంత సులభమైన విషయమేమీ కాదు. ఇందులోనూ తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి కొందరు ప్రోస్థటిక్ మేకప్‌ను ఆశ్రయిస్తే.. మరికొందరు నిజంగానే తమ శరీరాన్ని పాత్రకు తగినట్లుగా మలచుకుంటుంటారు. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కూడా ఇదే పని చేసింది. ‘తలైవి’గా తెరకెక్కనున్న జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న ఆమె.. ఆ పాత్ర కోసం ఏకంగా 20 కిలోలు పెరిగిందట! ఇక ఇప్పుడు తగ్గే పనిలో పడ్డానంటోందీ చక్కనమ్మ. అంతేకాదు.. బరువు పెరగడం ఎంత సులభమో.. తగ్గడం అంతకంటే కష్టమంటూ తన వర్కవుట్స్ గురించి సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతోందీ మనాలీ బ్యూటీ.
బరువు తగ్గించుకొని నాజూగ్గా కనిపించాలనుకుంటారు కానీ.. కావాలని బరువు పెరగడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. కానీ కొందరు నటీమణులు మాత్రం ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోవడానికి, రియాల్టీని తలపించడానికి బరువు పెరిగేందుకు కూడా వెనకాడరు. ‘తలైవి’ చిత్రం కోసం కంగన కూడా అదే పని చేసింది. ఈ క్రమంలో నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఏకంగా 20 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ‘బరువు పెరిగేటప్పుడు ఇలా ఇష్టమైనవన్నీ తింటూ ఎంతగా ఎంజాయ్ చేస్తామో.. బరువు తగ్గేటప్పుడు అంత కష్టపడాల్సి ఉంటుంది..’ అని ట్వీట్ పెట్టింది.
పెరిగిన బరువు అలా తగ్గుతున్నా!
‘తలైవి’ కోసం 20 కిలోలు పెరిగిన కంగన.. ప్రస్తుతం తగ్గే పనిలో పడ్డానంటోంది. ఈ క్రమంలో తాను వేసిన నటరాజాసనం ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. ‘తలైవి సినిమా కోసం నేను 20 కిలోలు పెరిగాను. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోండడంతో తిరిగి పూర్వ స్థితికి చేరుకునేందుకు నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. గతంలోలాగా నా శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి, చురుకుదనం, ఫ్లెక్సిబిలిటీ కోసం వేకువజామునే నిద్ర లేవడం, నడక/జాగింగ్ చేయడం అలవాటు చేసుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. నటరాజాసనం ఎలా వేయాలంటే.! *ముందుగా నిటారుగా నిల్చొని కుడి కాలిని వెనక్కి మడుస్తూ, చీలమండను వంచుతూ.. కుడి పాదాన్ని కుడి అరచేతిలోకి తీసుకోవాలి. *ఆపై మరో చేయిని జత చేస్తూ.. శరీరాన్ని చాపంలా వంచుతూ.. పాదాన్ని నెమ్మదిగా పైకెత్తాలి. ఈ క్రమంలో ఎడమ కాలిని వంచకుండా నిటారుగానే ఉంచాలి. ఇలా ఈ భంగిమలో కాసేపు ఉండాలి. ఈ ఆసనం ఏ కాలితోనైనా వేయచ్చు. ప్రయోజనాలెన్నో! యోగా సాధన చేసే వాళ్లు నటరాజాసనం రోజూ చేయడం వల్ల ఆరోగ్యపరంగా, ఫిట్నెస్ పరంగా బోలెడన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. * ఈ ఆసనం ఛాతీ, పిరుదులు, కాళ్లు, చీలమండలు.. తదితర భాగాలను దృఢంగా చేయడంలో సహకరిస్తుంది. అలాగే దీని వల్ల పొట్ట కండరాలు, తొడ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. * బరువు తగ్గడానికి, జీవ క్రియల్ని వేగవంతం చేయడానికి, జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి ఈ ఆసనం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. * చక్కటి శరీరాకృతికి, ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి, మానసిక ప్రశాంతతకు కూడా ఈ ఆసనం దోహదం చేస్తుంది. అయితే బీపీ తక్కువ ఉన్న వాళ్లు మాత్రం ఈ ఆసనం వేయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అలాగే తొలిసారి ఈ ఆసనాన్ని ప్రయత్నించే వారు కూడా నిపుణుల వద్ద సలహాలు తీసుకున్నాకే ఈ ఆసనం వేయడం ఉత్తమం.
|
ఈ కసరత్తులు వాటి కోసమే!
ఇలా ఓవైపు బరువు తగ్గడంతో పాటు మరోవైపు తన తదుపరి సినిమాల కోసం తీవ్ర కసరత్తులు సైతం చేస్తోంది కంగన. ఈ క్రమంలో కిక్ బాక్సింగ్, ఫ్లోర్ ఎక్సర్సైజెస్ సాధన చేస్తూ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ‘నా తదుపరి సినిమాలు తేజస్, ధాకడ్ కోసం యాక్షన్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టేశా. తేజస్‌లో మిలిటరీ నేపథ్యం ఉన్న పాత్రలో, ధాకడ్ చిత్రంలో గూఢచారిగా కనిపించబోతున్నా. ఇప్పటిదాకా నాకు బాలీవుడ్ చాలానే ఇచ్చింది.. మణికర్ణిక చిత్ర విజయాన్ని నేను బాలీవుడ్‌కు అందించాను. హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరోయిన్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోగలిగిన పాత్ర అది’ అంటూ రాసుకొచ్చింది కంగన.
|
ఇలా ఎప్పటికప్పుడు ఆయా పాత్రలకు తగ్గట్లుగా కఠినమైన కసరత్తులు చేస్తూ సినిమాలపై తనకున్న మక్కువను, పాత్రలపై తన అంకిత భావాన్ని మరోసారి చాటుకుందీ మనాలీ గర్ల్.