ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ప్రత్యేకించి ఈ వైరస్ కారణంగా అందరిలో ఆరోగ్య స్పృహ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ను మెరుగుపరచుకుంటున్నారు. ఈక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘స్టే ఫిట్’ ఛాలెంజ్ పేరుతో కొన్ని ప్రత్యేక ఆరోగ్య నియమాలను పాటించిందట. దొరక్క దొరక్క దొరికిన ఈ ఆరు నెలల సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ మరింత కూల్‌గా, పాజిటివ్‌గా మారిపోయానంటోందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తన అభిమానులు కూడా ఈ ‘స్టే ఫిట్’ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరుతూ తాను పాటించిన ఆరోగ్య చిట్కాలను అందరితో షేర్ చేసుకుంది.
అందం, అంతకుమించిన అభినయాన్ని సొంతం చేసుకున్న తమన్నాకు ఫిట్నెస్పైనా ప్రేమెక్కువే. అందుకే తన సోషల్ మీడియా పేజీల్లో కూడా తాను చేసిన విభిన్న వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తుంటాయి. ఇక కరోనా కారణంగా నెలల కొద్దీ ఖాళీ సమయం దొరకడంతో ఓ ట్రైనర్ సహాయంతో తన ఫిట్నెస్ ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకుంది తమ్మూ. ఇందులో భాగంగా మొత్తం 21 రోజుల పాటు ప్రత్యేక ఆరోగ్య నియమాలను పాటించినట్లు చెప్పుకొచ్చిందీ మిల్కీ బ్యూటీ. ఈ సందర్భంగా తన హెల్దీ డైట్, వర్కవుట్ ప్లాన్స్ గురించి అందరితో షేర్ చేసుకుంది.
బాటిల్ నీళ్లతోనే ప్రారంభం!
‘స్వచ్ఛమైన నీటిని సమృద్ధిగా మానవాళికి అందించగలిగితే వారికి కలిగే అనారోగ్యాల్లో సగమైనా నివారించవచ్చు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అదేవిధంగా పరగడుపునే రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల సమస్త రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈక్రమంలో తాను కూడా నీళ్లతోనే ‘స్టే ఫిట్’ ఛాలెంజ్‌ను ప్రారంభించానంటోంది తమన్నా. ‘సానుకూల దృక్పథంతో ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించాను. ఇందులో భాగంగా చిన్న చిన్న చిట్కాలతో నా ఆరోగ్యాన్ని మరింత మెరుగుకోవాలనుకున్నాను. ఈక్రమంలో మొదటగా ఒక బాటిల్ నీళ్లతో ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించాను. ఇందులో కొన్ని సబ్జా గింజలు వేసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలంటే సమృద్ధిగా నీరు తాగాల్సిందే’ అంటోందీ అందాల తార.
వాటిని నా మెనూలో చేర్చుకున్నా!
ఇక ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా పోషక విలువలున్న ఆహారానికి బాగా ప్రాధాన్యమివ్వాలంటోంది తమన్నా. ‘కరోనాకు ముందు వరకు నేను కేవలం రుచికరమైన వంటకాలను తినేందుకే ఇష్టపడేదాన్ని. అయితే ఈ ఖాళీ సమయంలో కొన్ని ఆరోగ్యకరమైన వంటకాలను తయారుచేయడం నేర్చుకున్నాను. ఇందులో భాగంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం ఫ్రెంచ్ టోస్ట్, ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేశాను. అదేవిధంగా అరటి పండ్లు, పోషకాలతో నిండిన గింజలను నా డైట్ మెనూలో చేర్చుకున్నాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
యోగాతో పాజిటివిటీ!
సినిమా ఇండస్ట్రీలో ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవాలంటే వ్యాయామానికి మించిన సాధనం మరొకటి ఉండదంటోంది తమన్నా. ‘కరోనాకు ముందు వరకు నేను అంతగా ఆరోగ్య నియమాలు పాటించలేదు. సరైన నిద్ర కూడా ఉండేది కాదు. అయితే కరోనా కారణంగా ఖాళీ సమయం దొరికినప్పట్నుంచి శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారయ్యేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేశాను. ఇందుకోసం వర్చువల్‌గా ఓ ట్రైనర్‌ను కూడా నియమించుకున్నాను. ఖాళీ టిష్యూ బాక్స్‌పై ఫోన్ ఉంచి, అందులో ట్రైనర్ చూపించినట్లు కసరత్తులు చేయడం కాస్త కష్టమనిపించినా ఫిట్‌గా మారాలన్న ఇష్టం ఆ కష్టాన్ని దూరం చేసింది. అయితే ఈ ఆరోగ్య నియమాల కారణంగా నా లైఫ్స్టైల్లో చాలా మార్పులొచ్చాయి. అలాగే నా నిద్ర సమయాలు కూడా మారిపోయాయి. ఇక ఈ 21 రోజుల ‘స్టే ఫిట్’ ఛాలెంజ్‌లో నేను నేర్చుకున్న మరో ముఖ్యమైన అంశం సానుకూలంగా ఆలోచించడం. ఇందుకు నాకు యోగా బాగా సహకరించింది. దీంతో నా మనసు మరింత ప్రశాంతంగా, కూల్‌గా ఉండేది. ఇక ఈ ఆరు నెలల్లో కొన్ని రోజులు నాకు తెలియకుండానే గడిచిపోయాయి. అల్మరాలో దాచుకున్న నా చిన్ననాటి ఫొటోలను చూస్తూ మరికొన్ని రోజులు కాలక్షేపం చేశాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.