సుమ: 'హాయ్ ఉమ.. ఎలా ఉన్నావ్.. ఏంటి కుంటుతున్నావ్??'
ఉమ: 'ఏం లేదే.. మొన్నామధ్యన బైక్ ప్రమాదంలో కాలుకి చిన్న గాయమైంది కదా.. అది ఇంకా తగ్గలేదు..'
సుమ: 'ఏంటీ.. ఆ గాయం ఇంకా తగ్గలేదా??'
ఉమ: 'లేదు.. ఇంకా మానలేదు.. అప్పుడప్పుడు ఇలా నొప్పి వేధిస్తుంది..'
ఆటలాడేటప్పుడైనా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడైనా అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఈ గాయాలు కొంతమందికి త్వరగా తగ్గిపోతే.. మరికొందరికి చాలారోజుల వరకు మానకుండా బాధపెడుతుంటాయి. ఈ క్రమంలో తగిలిన గాయాలు త్వరగా మానిపోయి మళ్లీ ఫిట్‌గా తయారవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
కాపడం పెట్టాలి..
ఎక్కడైనా నొప్పి లేదా వాపు ఉన్నప్పుడు ఆ భాగానికి వేడినీళ్లతో కాపడం పెట్టడం తెలిసిందే. దీనివల్ల గాయమైన ప్రదేశానికి రక్తప్రసరణ బాగా జరిగి సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మంచు ముక్కలతో..
దెబ్బలు తగిలినప్పుడు సంబంధిత భాగాలలో అప్పుడప్పుడు వాపు వస్తుంటుంది. దీనివల్ల భరించలేని నొప్పి పుడుతుంది. కాబట్టి ఈ భాగంపై 20 లేదా 30 నిమిషాల పాటు కొన్ని మంచు ముక్కల్ని (ఐస్ ప్యాక్స్) ఉంచితే ఫలితం ఉంటుంది. దీనివల్ల చర్మానికి డ్యామేజ్ కాకుండా కూడా జాగ్రత్త పడచ్చు.
ఎక్కువ నిద్ర..
మనమేదైనా అస్వస్థతకు గురైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం అనేది సర్వసాధారణం. దీనివల్ల గాయం త్వరగా మానిపోయే అవకాశం ఉంది. అలాగే రోజుకు ఏడెనిమిది గంటలు నిద్ర పోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోతే నిద్రలో నొప్పి తెలియకుండా ఉండి.. గాయం త్వరగా మానే అవకాశం ఉంది. అలాగే మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది.

కదిలించాలి..
గాయమైన భాగాన్ని నొప్పి వల్ల కొన్ని రోజుల వరకు ఎటూ కదిలించకుండా అలాగే ఉంచుతాం. ఫలితంగా ఆ భాగంలోని కండరాలు పట్టేసినట్లుగా తయారవుతాయి. కాబట్టి గాయం పూర్తిగా మానిన తర్వాత ఆయా ప్రదేశాలను నెమ్మదిగా వంచడం, కదిలించడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం.. వంటివి చేస్తే క్రమంగా సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
పచ్చిగా ఉన్నప్పుడు..
రోజూ వ్యాయామం చేసే వారికి ఒక రోజు చేయకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. అలాగని దెబ్బలు పూర్తిగా తగ్గకుండా పచ్చిగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మంచిది కాదేమోనని భయపడాల్సిన పని లేదు. దెబ్బలపై తక్కువ ప్రభావం చూపే వ్యాయామాలు చేయడం మంచిదే.
డాక్టర్‌ను సంప్రదించాలి..
తగిలిన గాయాలు, వాటివల్ల కలిగే నొప్పి పదిహేను రోజుల వరకు కూడా తగ్గకుండా ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. లేదంటే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.