లోకులు కాకులు.. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడుతుంటారు.. తాము ఎలా ఉన్నా సరే.. ఇతరులు మాత్రం కంటికి ఇంపుగా కనిపించాలనుకుంటారు.. లేదంటే ఏదో ఒకటి అనేదాకా వారి నోరు ఊరుకోదు.. లావుగా ఉన్నా, అందంగా లేకపోయినా విమర్శిస్తుంటారు. ‘అయినా ఇది మన జీవితం.. నలుగురికీ నచ్చినట్లుగా మనమెందుకు ఉండాలి? ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించాలి’ అంటోంది బుల్లితెర బ్యూటీ షెహ్నాజ్ గిల్.
గతేడాది హిందీ బిగ్‌బాస్ హౌస్‌లో తనకెదురైన బాడీ షేమింగ్‌ను గుర్తు చేసుకుంటూ బరువు తగ్గాలన్న కసిని తనలో పెంచుకుంది షెహ్నాజ్. అనుకున్నట్లుగానే ఆరు నెలల్లో పన్నెండు కిలోలు తగ్గి.. సన్నజాజి తీగలా మారిపోయింది. అలాగని తను గంటల కొద్దీ జిమ్‌లోనే గడిపిందేమో అనుకునేరు.. నిజానికి అసలు తను వ్యాయామమే చేయలేదట! మరి, షెహ్నాజ్ ఎలా బరువు తగ్గింది? ఆ సీక్రెట్స్‌ని ఓ సందర్భంలో బయటపెట్టిందీ పంజాబీ భామ.
పంజాబ్‌లో ఓ సిక్కుల కుటుంబంలో పుట్టిపెరిగిన షెహ్నాజ్ గిల్ అసలు పేరు షెహ్నాజ్ కౌర్ గిల్. పలు మ్యూజిక్ వీడియోలతో తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ఈ పంజాబీ అందం.. 2017లో ‘సత్ శ్రీ అకాల్ ఇంగ్లండ్’ అనే పంజాబీ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆపై గతేడాది హిందీ ‘బిగ్‌బాస్-13’లో రెండో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిందీ చిన్నది. నటనే కాదు.. పాటలు పాడడమన్నా ఈ బ్యూటీకి ఎనలేని ఇష్టమట! ఇక ఈ ఏడాది ‘ముఝ్సే షాదీ కరోగే’ అనే రియాల్టీ షోలో మెరిసిందీ పంజాబీ భామ.
నేనూ బరువు తగ్గగలను!
అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కొంతమంది తాను బొద్దుగా ఉన్నావంటూ ఎగతాళి చేసేవారని, ఆ మాటలకు తొలుత బాధపడినా.. ఎలాగైనా బరువు తగ్గాలన్న కసి తనలో పెరిగిందంటోందీ అందాల తార. ‘గతేడాది బిగ్‌బాస్-13 సీజన్లో పాల్గొన్న సమయంలో అక్కడ కొంతమంది నా అధిక బరువు గురించి ఎగతాళి చేసేవారు. ఆ మాటలు విని నా మనసు చివుక్కుమన్నా.. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. మన చుట్టూ ఎంతోమంది తమ అధిక బరువును తగ్గించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ ఆలోచనతోనే నేనూ బరువు తగ్గి చూపిస్తా అని నా మనసులో బలంగా నిర్ణయించుకున్నా. ఇక ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయం అందుకు బాగా కలిసొచ్చింది. కరోనాకు ముందు వరకు 67 కిలోల బరువున్న నేను.. ఈ ఆరు నెలల్లో 12 కిలోలు తగ్గాను.. అంటే 55 కిలోలకు చేరుకున్నా. నిజంగా మనమేదైనా అనుకుంటే అది చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. బరువు తగ్గడం కూడా అంతే!’ అంటోంది షెహ్నాజ్.
మితంగా తింటూనే..!
ఈ ముద్దుగుమ్మ ఆరు నెలల్లో 12 కిలోలు తగ్గిందంటే గంటల తరబడి జిమ్‌లో గడిపి ఉంటుంది అనుకుంటారంతా.. కానీ అసలు తాను వ్యాయామాలే చేయలేదంటూ తన వెయిట్ లాస్ సీక్రెట్‌ని బయటపెట్టిందీ అందాల తార.
‘బరువు తగ్గాలంటే చాలామంది తమ లైఫ్‌స్టైల్‌ని పూర్తిగా మార్చేసుకుంటారు. అంటే ఆహారపుటలవాట్లలో బోలెడన్ని మార్పులు చేసుకుంటారు.. రోజుకో ఆరోగ్యకరమైన వంటకం ప్రయత్నిస్తుంటారు. కానీ నేను అసలు వ్యాయామాలే చేయలేదు.. పైగా విభిన్న వంటకాలు కూడా తీసుకోలేదు. రోజూ ఒకటి లేదా రెండు వంటకాల్ని తినేదాన్ని. ఉదాహరణకు.. ఈ రోజు మధ్యాహ్నం పప్పు తిన్నాననుకోండి.. రాత్రి డిన్నర్‌కి కూడా అదే! అలాగే ఏది తిన్నా మితంగా తినేదాన్ని. రెండు చపాతీలు తినాలనిపించినప్పుడు ఒక చపాతీతో సరిపెట్టుకునేదాన్ని. ఇలా నా ఆహారపు కోరికల్ని సంతృప్తి పరుస్తూనే ఆకలి కాకుండా, జంక్‌ఫుడ్ వైపు మనసు మళ్లకుండా జాగ్రత్తపడ్డా. అయితే నాకెంతో ఇష్టమైన మాంసాహారం, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ మాత్రం దూరం పెట్టా.. ఇలా నా ఆహారపుటలవాట్లలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆరు నెలల్లోనే 12 కిలోలు తగ్గా.. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నా..’ అంటూ తన వెయిట్ లాస్ జర్నీని పంచుకుందీ ముద్దుగుమ్మ.
అయితే ఎవరో అన్నారని కాకుండా.. ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించాలంటోందీ పంజాబీ భామ. అప్పుడే ఆనందంగా ఉండగలమని.. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇదీ ఓ సీక్రెటే అంటూ అందరిలో స్ఫూర్తి నింపుతోందీ చిన్నది.