రోజూ తీరికలేని పనివేళలు, ప్రయాణాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడి ఎదురవుతుంటుంది. ఇది మితిమీరితే వివిధ రకాల శారీరక నొప్పులు వేధించడం సహజం. ఈ నొప్పులు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ మనల్ని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి అనుభవం తనకూ కొత్తేమీ కాదంటోంది ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్ యామీ గౌతమ్.
రోజూ తీరికలేని బిజీ షెడ్యూల్స్ వల్ల గతంలో తీవ్రమైన మెడనొప్పితో బాధపడేదట యామీ. అయితే లాక్ డౌన్ లో దొరికిన తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుని రోజూ యోగా సాధన చేస్తోందట. ఫలితంగా మెడనొప్పి సమస్యను అధిగమించగలుగుతున్నానని వివరిస్తూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టిందీ ముద్దుగుమ్మ.
కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో మన ముద్దుగుమ్మలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇలా అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని తమ కుటుంబంతో గడపడానికి, తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవడానికి, ఆరోగ్యం-ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ ఫిట్‌గా మారడానికి.. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఈ జాబితాలో యామీ కూడా చేరిపోయింది. తనను ఇబ్బంది పెడుతోన్న తీవ్రమైన మెడనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఈ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ అందాల బొమ్మ.
ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది!
తాను యోగా చేస్తోన్న ఫొటోను పోస్ట్ చేసిన యామీ.. ‘తీవ్రమైన మెడ నొప్పి బారిన పడిన దగ్గర్నుంచి నా ఆరోగ్యం విషయంలో నాకు మరింత శ్రద్ధ పెరిగింది. ఒక నటిగా తీరిక లేని పనివేళలు, నిరంతరాయంగా డ్యాన్స్ చేయడం వల్ల కలిగిన శారీరక శ్రమ, కఠినమైన వ్యాయామాలు, షూటింగ్స్ రీత్యా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడం, నొప్పి పుట్టించే ఫుట్‌వేర్.. వంటివి ఇలాంటి శారీరక నొప్పులకు కారణమవుతాయి. అయితే ఒక్కోసారి ఇలాంటి నొప్పుల్ని పంటి బిగువున భరిస్తూనే ముందుకు సాగాల్సి ఉంటుంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని నా కోసం వినియోగించుకుంటున్నా. నిజానికి ఇంతకుమునుపెన్నడూ నా ఆరోగ్యంపై నేను ఇంత శ్రద్ధ వహించలేదు. ప్రతిసారీ యోగా సాధన చేయడం, నొప్పి మరింత తీవ్రమవడంతో ముందుకెళ్లలేకపోయా. కానీ నా శరీరం లోపల, వెలుపల కలిగే నొప్పుల్ని ఎలాగైనా అధిగమించాలని బలంగా నిర్ణయించుకున్నా. ప్రస్తుతం దొరికిన ఈ ఖాళీ సమయంలో ఫిట్‌గా మారడంతో పాటు నా ప్రాధాన్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకునే పనిలో ఉన్నా. ఈ క్రమంలోనే రోజూ యోగా సాధన చేస్తున్నా. అలాగని నేను ఇందులో పూర్తిగా నైపుణ్యం సాధించానని చెప్పలేను. ఎందుకంటే ఈ దిశగా నా జర్నీ ఇప్పుడే మొదలైంది.. ఇక పైనా ఇదిలాగే కొనసాగుతుంది..’ అంటూ సుదీర్ఘ క్యాప్షన్ పెట్టిందీ బ్యూటీ.
ఇలా యోగా చేస్తూ మెడనొప్పిని క్రమంగా దూరం చేసుకుంటున్నానని చెబుతోన్న యామీ.. ఈ ప్రక్రియ వల్ల శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందచ్చని తన అనుభవంతో మరోసారి నిరూపించింది. మరి, ఈ ముద్దుగుమ్మను ఫాలో అయిపోయి మనమూ యోగాను మన జీవితంలో భాగం చేసుకుందాం.. తద్వారా అటు శారీరకంగా ఫిట్‌గా మారడంతో పాటు ఇటు ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి క్రమంగా బయటపడదాం..!