ఎన్నో ఆనందాల్ని మోసుకొచ్చే అమ్మతనం.. కొన్ని విషయాల్లో మాత్రం నేటి మహిళల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీ మహిళల్ని... అది కూడా తమ వల్లో, తమ ఇంట్లో వాళ్ల వల్లో కాదు.. ముక్కూ మొహం తెలియని మూడో వ్యక్తి వల్లే! నిజానికి ఒక బిడ్డకు జన్మనిచ్చాక బరువు పెరగడం, ఒత్తిడి ఎదురవడం.. ఇవేవీ అమ్మలకు పెద్ద సమస్యగా అనిపించవు. కానీ తమ శరీరాకృతి గురించి, అందం గురించి సోషల్ మీడియాలో ఎవరో పెట్టే కామెంట్లే వారిని ఈ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తానూ అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని చెబుతోంది బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ దీపికా సింగ్.
2017లో అమ్మయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రసవానంతరం తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలకు చాలామంది నెగెటివ్‌గా స్పందించారని, ముందూ-వెనకా ఆలోచించకుండా తన బరువు గురించి ఏవేవో కామెంట్లు పెట్టారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. అయితే ఓ రకంగా ఈ కామెంట్లు తనకు మంచే చేశాయని తన మనసులోని మాటల్ని బయటపెట్టిందీ లవ్లీ మామ్. మరి, ఇంతకీ ప్రసవానంతరం తన బరువు గురించి సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లకు తనెలా స్పందించింది? అలాగే - డెలివరీ తర్వాత బరువు తగ్గి తిరిగి నాజూగ్గా మారడానికి తాను పాటించిన డైట్, ఫిట్నెస్ నియమాలేంటో తెలుసుకుందాం రండి..
2011లో ప్రసారమైన ‘దియా ఔర్ బాతీ హమ్’ అనే హిందీ సీరియల్లో ‘సంధ్య రతి’గా నటించి మహిళలందరికీ చేరువైంది దీపికా సింగ్. ఆపై పలు టీవీ షోలలో మెరిసింది. ఇక గతేడాది ‘కవచ్.. మహాశివరాత్రి’ అనే సీరియల్‌తో మన ముందుకొచ్చిన ఈ అందాల తార.. 2014లో టీవీ దర్శకుడు రోహిత్ రాజ్ గోయల్‌ను వివాహమాడింది. 2017లో సోహమ్ అనే ముద్దుల బాబుకు జన్మనిచ్చిన దీపిక.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి ఎప్పుడూ వెనకాడదు. ఈ క్రమంలోనే తాను గర్భం ధరించడం, పిల్లాడికి జన్మనిచ్చాక తనకెదురైన ప్రసవానంతర ఒత్తిడి, గర్భస్థ సమయంలో పెరిగిన బరువు తగ్గించుకోవడానికి తాను చేసిన కసరత్తులు.. వంటి విషయాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, పలు సందర్భాల్లో మీడియాతో పంచుకుంటూ నేటి తల్లులందరిలో స్ఫూర్తి నింపిందీ బ్యూటిఫుల్ మామ్. ఇక ఇటీవలే మరో ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ప్రసవానంతరం తన శరీర బరువు గురించి సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయని, వాటిని చదివి మొదట్లో బాధపడినా, ఒక రకంగా అవి తాను తిరిగి బరువు తగ్గేందుకు పరోక్షంగా దోహదం చేశాయంటోంది దీపిక.
హాయ్.. నేను మీ దీపికా సింగ్.. నిజానికి నా అసలు పేరు కంటే ‘దియా ఔర్ బాతీ హమ్’ సీరియల్లో నా పాత్ర పేరు సంధ్యా రతిగానే చాలామంది నన్ను గుర్తుపడుతుంటారు. మీ ఆదరాభిమానాలకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. అయితే ఇంత సడెన్‌గా మీ ముందుకు రావడానికి ఓ కారణముంది. చాలామంది మహిళలు ప్రసవం తర్వాత బుజ్జాయి ఆలనా పాలనా, నిద్రలేమి, ఇంటి పనుల్ని సమన్వయం చేసుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇక వీటికి తోడు మన శరీరాకృతి, అందం గురించి మనకంటే మన చుట్టూ ఉన్న వాళ్లకే ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందేమో! అందుకే చాలామంది మహిళలు డెలివరీ తర్వాత ఫలానా వాళ్లు నన్ను అలా అన్నారు, ఇలా కామెంట్ చేశారు అని చెబుతూ బాధపడిపోతుంటారు.
ఆ కామెంట్లు బాధించినా..!
ఇలాంటి అనుభవాలు నా జీవితంలోనూ ఉన్నాయి. నా బాబు సోహమ్ పుట్టినప్పుడు నేను 72 కిలోల బరువున్నాను. ప్రసవానంతరం కాస్త బబ్లీగా కనిపించడం ఏ తల్లికైనా కామన్. అయితే నా బరువు గురించి ఆ సమయంలో సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్లు వచ్చాయి. అందులో చాలావరకు నెగెటివ్ కామెంట్లే! ఎప్పటిలాగే ఆ ఏడాది నా పుట్టినరోజు సందర్భంగా నేను నా ఫొటోల్ని పోస్ట్ చేశాను. అంతే.. ఒకరి తర్వాత ఒకరు నా బరువు గురించి నెగెటివ్‌గా మాట్లాడుతూ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. కనీసం నా పుట్టినరోజు అని కూడా చూడకుండా ఎవరి నోటికొచ్చినట్లు వాళ్లు మాట్లాడారు. ‘మీరు ఇంత పేరున్న నటి కదా! ఇలాంటి ఫొటోలు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించరా?’, ‘ఇలా ఉంటే మీకు ఏ పాత్రలోనూ నటించే అవకాశం రాదు’, ‘ఓసారి ఆమెను చూడండి.. ఎంత లావుగా కనిపిస్తోందో!’, ‘ఇలా అయితే తను లీడ్ రోల్‌కి పనికిరాదు’.. ఇలా ఒకటా, రెండా.. బోలెడన్ని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి.
అలా సున్నితంగానే వారికి సమాధానం చెప్పా!
ఇలాంటి కామెంట్లు నన్ను చాలా బాధించాయి. వాటిని నేను చాలా సీరియస్‌గా తీసుకున్నా. అందుకే పెరిగిన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ కామెంట్లే నన్ను వ్యాయామం వైపు అడుగులు వేసేలా చేశాయి. ఆ కామెంట్లన్నీ స్క్రీన్‌షాట్ తీసుకొని నా మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకునేదాన్ని. నాకెప్పుడైనా బద్ధకంగా అనిపించినప్పుడు వాటిని చూసుకునేదాన్ని.. వెంటనే బద్ధకం మాయమై వర్కవుట్‌పై దృష్టి సారించేదాన్ని. ఏదేమైనా మొత్తానికి ప్రసవానంతరం బరువు తగ్గా. కాబట్టి మీ అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. ఎవరో ఏదో అన్నారని బాధపడి మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం అస్సలు కరక్ట్ కాదు. ఆ విమర్శల్నే మన లక్ష్యానికి సోపానాలుగా చేసుకొని అనుకున్నది సాధించాలి. మనమేంటో సున్నితంగానే వారికి నిరూపించగలగాలి.
ఆ సమయంలో ఆందోళన వద్దు!
నటనా?, కుటుంబమా? అని అడిగితే కుటుంబానికే అధిక ప్రాధాన్యమిస్తా. ముఖ్యంగా నా కొడుకుతో సమయం గడపడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా. నిజంగా అమ్మగా మనం పొందే ఆనందం మరెందులోనూ దొరకదేమో! సోహమ్ పుట్టాకే ఈ విషయం నాకు అర్థమైంది. అయితే చాలామంది అమ్మలు ప్రసవానంతరం ఒత్తిడికి గురవడం సహజం. అనుక్షణం పుట్టిన పాపాయిని సంరక్షిస్తూ, వారి ఆలనా పాలనా చూడడంలోనే మన సమయమంతా గడిచిపోతుంటుంది. పైగా ఈ క్రమంలో నిద్ర కరువవుతుంటుంది.. ఇక మరోవైపు ఇంటి పనులు చూసుకోవాలి.. ప్రసవానంతరం శరీరం కూడా బలహీనంగా మారుతుంది.. తద్వారా నీరసం ఆవహిస్తుంటుంది. ఇవన్నీ మనలో విపరీతమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. నేనూ ఈ డిప్రెషన్‌ని ఎదుర్కొన్నా. అయితే ఇలాంటి సమయంలో కొందరు మహిళలు మరింత ఎక్కువగా ఆలోచిస్తూ మథనపడిపోతుంటారు. తద్వారా సమస్య ఎక్కువవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే నేను ఒత్తిడి, ఆందోళనల గురించి ఆలోచించకుండా నా పనుల్ని సమన్వయం చేసుకుంటూ, బాబును కంటికి రెప్పలా కాపాడుకుంటూ, చక్కటి పోషకాహారం తీసుకుంటూ ముందుకు సాగా. అలా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ను క్రమంగా దూరం చేసుకున్నా.
అస్సలు కాంప్రమైజ్ కాలేదు!
సోహమ్కి జన్మనిచ్చాక 16 కిలోల దాకా బరువు పెరిగా. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు కంటే ప్రసవం తర్వాతే నేను ఎక్కువ బరువు పెరిగా! ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించచ్చు. ఇలా నేను బరువు పెరగడం వెనకా ఓ కారణముంది. తల్లయ్యాక మన శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకోవడంతో పాటు పుట్టిన బిడ్డ పూర్తిగా మన పాల పైనే ఆధారపడుతుంది.. కాబట్టి వారికి మన పాల ద్వారానే అన్ని పోషకాలు అందాలి. అందుకే సోహమ్ కోసం ఎక్కువ పాలు ఉత్పత్తి కావాలని, ఆ పాల ద్వారా అన్ని పోషకాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలో బరువు పెరుగుతానేమోనన్న విషయం పూర్తిగా మర్చిపోయి చక్కటి పోషకాహారం తీసుకోవడంపైనే దృష్టి పెట్టా. ఇలా నా బాబు పుట్టాక ఎక్కువ బరువు పెరిగా. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ సమస్య ఎదురైంది. ఆ సమయంలో ఎక్కువ బరువు పెరగడానికి అదీ ఓ కారణమే.
జంక్‌ఫుడ్ పూర్తిగా మానేశా!
సోహమ్‌కు నా పాల ద్వారా పూర్తి పోషకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేను.. వాడికి ఏడు నెలలు దాటాకే నా ప్రసవానంతర బరువు గురించి ఆలోచించడం మొదలుపెట్టా. గర్భం ధరించక ముందు 56 కిలోల బరువున్న నేను.. గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవానంతరం.. ఇలా రెండు దశల్లో కలిపి 16 కిలోలు పెరిగి.. మొత్తంగా 72 కిలోలకు చేరుకున్నా. ఈ పెరిగిన బరువు తగ్గడానికి నాకు దాదాపు 7 నెలల సమయం పట్టింది. ఇందులో నేను తీసుకున్న ఆహారం, చేసిన వ్యాయామాల పాత్ర కీలకం అని చెబుతా. చాలామంది త్వరగా బరువు తగ్గాలని వెయిట్ లాస్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ వాటిని వాడడం కంటే నెమ్మదిగా బరువు తగ్గడమే ఆరోగ్యదాయకం అనేది నేను నమ్మిన సూత్రం. అందుకే ఎక్కువగా పండ్లు, కాయగూరలు.. వంటివి నా ఆహారంలో భాగం చేసుకున్నా. అలాగే అప్పుడప్పుడూ జంక్ ఫుడ్ తినాలని మనసు లాగినా దానికి దూరంగా ఉన్నానే తప్ప ‘ఇప్పుడైతే ఇది తిందాం.. బరువు సంగతి దేవుడెరుగు..’ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. వీటితో పాటు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం కూడా నేను బరువు తగ్గేందుకు దోహదం చేసింది.
వాడు నా వర్కవుట్ మాస్టర్!
ప్రసవానంతరం నేను బరువు తగ్గడంలో ఆహారం పాత్ర ఎంత ఉందో వర్కవుట్ పాత్ర కూడా అంతే ఉంది. ఓవైపు పోషకాహారం తీసుకుంటూనే.. చక్కటి వర్కవుట్ రొటీన్‌ని ప్లాన్ చేసుకున్నా. రోజూ ఉదయాన్నే కాసేపు నడక, యోగా, ధ్యానం చేయడం.. ఇదే నా సింపుల్ వర్కవుట్. వ్యాయామం అంటే మీకు మరో విషయం చెప్పాలి. నా బాబు సోహమ్‌ను ఎత్తుకొని కాసేపు నడవడం, ఎక్కువ సమయం వాడి ఆలనా పాలనాలోనే గడపడం.. ఇలాంటి పనుల వల్లే నా శరీరానికి ఎక్కువ వ్యాయామం అందేది. అందుకే వాడిని నా వర్కవుట్ మాస్టర్‌గా చెబుతుంటా. నేను బేసిగ్గా ఒడిస్సీ డ్యాన్సర్‌ను. ముందునుంచే ఈ డ్యాన్స్‌లో మెలకువలు నేర్చుకున్నా. అందుకే ప్రసవానంతరం నేను బరువు తగ్గడంలో ఈ డ్యాన్స్ కూడా నాకు ఎంతగానో దోహదం చేసింది.
పాలిస్తే అందం తగ్గదు!
ఓ అమ్మగా మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే.. బ్రెస్ట్‌ఫీడింగ్. చాలామంది తల్లులు బిడ్డలకు పాలివ్వడం వల్ల తమ అందం తగ్గిపోతుందని భావిస్తుంటారు. అసలు అది వాస్తవమే కాదు. ఎందుకంటే ఇది తల్లుల ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యానికీ ఎంతో మంచిది. చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వారికి ఎదురయ్యే ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసే శక్తి తల్లిపాలలో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. తల్లిపాలు బిడ్డలకు తెల్ల రక్తం (వైట్ బ్లడ్)తో సమానం. అందుకే తల్లిపాలకు అంత ప్రాధాన్యం ఉంది. ఇలా పిల్లలకు పాలివ్వడం వల్ల మనం బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి బ్రెస్ట్‌ఫీడింగ్‌పై మీకు ఇలాంటి అపోహలేవైనా ఉంటే వెంటనే వాటిని మీ మనసులో నుంచి తొలగించుకొని మీ చిన్నారులకు మనస్ఫూర్తిగా, ఆనందంగా పాలివ్వండి. అలాగే ఎవరో చూస్తున్నారని మొహమాట పడకుండా బయటి ప్రదేశాల్లోనూ పాలు పట్టడానికి వెనకాడకండి..
ఇక చివరిగా.. ప్రసవం తర్వాత ప్రతి మహిళా బరువు పెరగడం అనేది చాలా సహజమైన విషయం. కాబట్టి దీని గురించి ఎవరో ఏదో అన్నారని బాధపడకుండా ముందుగా మీ చిన్నారి ఆరోగ్యం, వారికి పాలివ్వడంపై దృష్టి పెట్టండి. ఆపై వారికి కొంత వయసొచ్చాక మీ బరువు గురించి ఆలోచించండి. ఈ క్రమంలో మీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకొని, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మెలకువలు పాటిస్తూ బరువు తగ్గడం అత్యంత ఆరోగ్యకరం అన్న విషయం గుర్తుపెట్టుకోండి!