కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరికీ వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై ఎక్కడ లేని శ్రద్ధ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉదయాన్నే ఏదో ఒక ఇమ్యూనిటీ డ్రింక్ తీసుకోనిదే బయట అడుగు పెట్టట్లేదు. మన ముద్దుగుమ్మలు సైతం తాము తీసుకునే ఇమ్యూనిటీ షాట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అందరిలో ఆరోగ్యం పట్ల స్పృహను మరింత రెట్టింపు చేస్తున్నారు. ఆ జాబితాలో తానూ ఉన్నానంటూ తాజాగా మన ముందుకొచ్చేసింది బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా. వయసు పైబడుతున్నా వన్నె తరగని అందానికి, ఫిట్‌నెస్‌కు చిరునామాగా నిలుస్తోన్న ఈ ఫిట్టెస్ట్ బ్యూటీ.. తన ఆరోగ్య, ఫిట్నెస్ రహస్యాలను, తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాను ఉదయాన్నే తీసుకునే ఇమ్యూనిటీ డ్రింక్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసిందీ యమ్మీ మమ్మీ.
సాధారణంగానే మన భారతీయుల్లో రోగనిరోధక శక్తి స్థాయులు ఎక్కువ. అలాంటిది ఈ కరోనా మహమ్మారి వచ్చిన దగ్గర్నుంచి అందరికీ ఈ విషయంలో మరింత శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే తమకు తెలిసిన కషాయాలను రోజూ తయారుచేసుకొని తాగడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, పానీయాల గురించి ఇంటర్నెట్లో శోధించే పనిలో పడ్డారు చాలామంది. దీనికి తోడు మన అందాల తారలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తాము పాటిస్తోన్న చిట్కాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. తాజాగా బాలీవుడ్ ఫిట్టెస్ట్ బ్యూటీ మలైకా అరోరా కూడా అలాంటి ఓ ఇమ్యూనిటీ షాట్ రెసిపీ గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టింది.
ఇమ్యూనిటీ కోసం నేనేం చేస్తున్నానంటే..!
వీడియోలో భాగంగా.. ‘బయట కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో మనమంతా అప్రమత్తంగా, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. అత్యవసర పనులను మినహాయించి ఇంట్లోనే ఉండడం సురక్షితం. ప్రస్తుతం మనమంతా అన్‌లాక్ దశలో ఉన్నాం. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే అందరూ తమ ఇమ్యూనిటీ పెంచుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే గోరువెచ్చటి నీళ్లలో పసుపు, నిమ్మరసం, తేనె.. వంటివి కలుపుకొని తాగుతున్నారు. ఇలా ఎవరికి తెలిసిన చిట్కాల్ని వారు పాటిస్తున్నారు. మరి, నా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి నేనేం చేస్తున్నానో ఇప్పుడు మీ అందరితో పంచుకోబోతున్నా.

ఒక పెద్ద ఉసిరి కాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్క, చిన్న పచ్చి పసుపు కొమ్ము ముక్క (ఇది లేకపోతే టీస్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు), కొన్ని మిరియాలు, కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్, కొన్ని నీళ్లు .. వీటన్నింటినీ బ్లెండర్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఇదే నేను రోజూ ఉదయాన్నే తాగే ఇమ్యూనిటీ డ్రింక్. విటమిన్ ‘సి’ మిళితమైన ఈ పానీయమే నా రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని మీరూ ట్రై చేయండి..’ అంటూ తన ఇమ్యూనిటీ షాట్ గురించి అందరితో పంచుకుంది మలైకా.
ఇక ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ యమ్మీ బ్యూటీ.. ‘మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆదరణలో ఉన్న ఇమ్యూనిటీ డ్రింక్ ఇది. దీన్ని ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే త్వరగా, సులభంగా తయారుచేసుకోవచ్చు.. మీరూ రోజూ ఈ షాట్‌ని తీసుకోండి.. మెరుగైన ఫలితాలు పొందండి..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
సో.. ఇంకా ఆలస్యమెందుకు? మనమూ మలైకా చెప్పిన ఈ చిట్కా ఫాలో అయిపోదాం.. రోగనిరోధక శక్తిని పెంచుకుందాం.. తద్వారా కరోనాకు దూరంగా ఉందాం..!
Also Read:
నా ఇమ్యూనిటీ రహస్యమిదే!
నా ఇమ్యూనిటీని పెంచే పదార్థాలివే!
ఈ పొడితో ఇమ్యూనిటీ పెంచుకోండి!