వ్యాయామం అనగానే జిమ్, అందులో చేసే కఠినమైన వ్యాయామాలే మన కళ్ల ముందు కదలాడతాయి. కానీ వాటి అవసరం లేకుండా ఇంట్లోనే సులభమైన వర్కవుట్స్ చేస్తూ మన ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఇదివరకే చాలామంది ముద్దుగుమ్మలు నిరూపించారు. అంతేనా.. వారు చేసే ఆ వర్కవుట్ వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు ఫిట్నెస్ పాఠాలు నేర్పుతుంటారు కూడా! అలాంటి ఫిట్టెస్ట్ బ్యూటీస్ జాబితాలో ఫిట్నెస్ గురూ, బాలీవుడ్ హీరో మిలింద్ సోమన్ భార్య అంకితా కొన్వర్ తప్పకుండా ఉంటుంది. తాను చేసిన వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా ఇంట్లోనే ఈజీగా చేసే కొన్ని వర్కవుట్లను తాను చేస్తూనే.. తన ఫ్యాన్స్‌కి నేర్పుతోందీ ఫిట్టెస్ట్ బేబ్. మరి, అంకిత చేసిన ఆ వర్కవుట్లేంటో తెలుసుకొని, ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఫిట్‌గా మారిపోదాం రండి..
అంకితా కొన్వర్.. ఫిట్నెస్ గురూ, బాలీవుడ్ నటుడు అయిన మిలింద్ సోమన్ భార్యగానే కాదు.. తన వర్కవుట్లతో ఈ ఫిట్నెస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ముందునుంచీ ఫిట్నెస్ ఔత్సాహికురాలైన అంకిత.. పెళ్లి తర్వాత తన భర్త ప్రోత్సాహంతో ఈ విషయంలో మరింతగా రాటుదేలింది. అందుకే ఎక్కడ, ఏ ఫిట్నెస్ కార్యక్రమం, మారథాన్ జరిగినా సరే.. అక్కడ ఈ జంట మెరవాల్సిందే! అంతేకాదు.. తాము చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిరంతరం సోషల్ మీడియాలో పంచుకుంటారీ క్యూట్ కపుల్. ఈ క్రమంలోనే ఇంట్లో ఈజీగా చేసే కొన్ని వ్యాయామాలకు సంబంధించి అంకిత పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అలాంటి వారికోసమే ఇవి..!
ఏ పనైనా సులభంగా పూర్తవ్వాలనుకునే వారు మనలో చాలామందే ఉంటారు. వ్యాయామాలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. జిమ్‌లో చెమటోడ్చి కష్టపడే కంటే ఇంట్లో చేసే చిన్నపాటి వ్యాయామాలతోనే ఫిట్‌గా మారాలనుకునే వారే ఎక్కువమంది ఉంటారు. అలాంటి సులభమైన ఎక్సర్సైజ్ల గురించి చాలామంది తనను అడిగారని అంటోంది అంకిత. ‘ఇంట్లో చేసే సులభమైన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు రూపొందించి మాకోసం పోస్ట్ చేయచ్చు కదా.. అని నన్ను చాలామంది అడుగుతున్నారు. అలాంటి వారికోసమే ఈ వర్కవుట్స్..’ అనే క్యాప్షన్‌తో పాటు తాను చేసిన ఈజీ వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిందీ ఫిట్టెస్ట్ బ్యూటీ.
వీడియోలో భాగంగా..
* ముందు నిటారుగా నిల్చొని కిందికి వంగి చేతులు నేలపై ఆనించాలి. ఆ తర్వాత కాళ్లను కదపకుండా చేతుల్ని ఒకదాని తర్వాత ఒకటి ముందుకు జరుపుతూ ప్లాంక్ పొజిషన్లోకి రావాలి.. ఆపై యథావిధిగా చేతుల్ని వెనక్కి జరుపుతూ వెళ్లి నిటారుగా నిల్చోవాలి. ఇలా కొన్ని సార్లు చేయాలి.
* నేలపై వెల్లకిలా పడుకొని మోకాళ్లను మడిచి పాదాలను నేలకు ఆనించాలి. మెడ, తలను పైకెత్తి ఉంచాలి. ఇప్పుడు కుడి చేతి వేళ్లతో కుడి పాదాన్ని తాకాలి. ఆపై ఎడమచేతి వేళ్లతో ఎడమ పాదాన్ని తాకాలి. తర్వాత ఇదే పద్ధతిని రిపీట్ చేయాలి. ఇలా ఐదుసార్లు చేయాలి.
* ముందుగా నిటారుగా నిల్చొని ఒక పెద్ద బెల్ట్ ఎలాస్టిక్ని తీసుకొని కాళ్ల మధ్య ఉంచాలి. ఇప్పుడు ఎలాస్టిక్ చివర్లను ఇరువైపులా చేతులతో పట్టుకొని పైకి లాగుతూ, కిందికి వదులుతూ.. కాసేపు వ్యాయామం చేయాలి.
* ఇప్పుడు నేలపై వెల్లకిలా పడుకొని రెండు మోకాళ్లను మడుస్తూ ఎద భాగం వరకు తేవాలి.. ఇదే సమయంలో తలను, చేతుల్ని ముందుకు రానిస్తూ.. ఎద భాగం వరకు వచ్చిన మోకాళ్లను చేతులతో తాకే ప్రయత్నం చేయాలి. ఆపై తిరిగి ఇలాగే యథాస్థానానికి చేరుకోవాలి. ఇలా కాసేపు వర్కవుట్ చేయాలి.
* ఇప్పుడు నేలపై వెల్లకిలా పడుకొని.. చేతుల్ని నేలపై ఆనించాలి. ఆపై కాళ్లను మాత్రమే 90 డిగ్రీలు పైకి లేపుతూ, తిరిగి యథాస్థానానికి తీసుకొస్తూ వ్యాయామం చేయాలి. ఇదే పద్ధతిని కొన్నిసార్లు రిపీట్ చేయాలి.
* లూప్ బ్యాండ్ ఎలాస్టిక్ మధ్య కాళ్లను ఉంచాలి. దాన్ని సాగదీస్తూ కాసేపు ఒకవైపు అడుగులు వేయాలి.. ఆపై మరోవైపు అడుగులు వేస్తూ జరగాలి. ఇదే పద్ధతిని పలుమార్లు రిపీట్ చేయాలి. ఈ వ్యాయామం చేస్తున్నంత సేపు చేతుల్ని జోడించే ఉంచాలి.
* నేలపై కేవలం నడుం భాగాన్ని మాత్రమే ఆనించి.. శరీరం పైభాగాన్ని ఏటవాలుగా ఉంచాలి.. కాళ్లను కూడా నేలపై ఆనకుండా పైకి లేపి ఉంచాలి. ఇప్పుడు చేతిలో బాల్ లేదా కాస్త బరువుగా ఉండే ఏదో ఒక వస్తువును తీసుకొని ఓసారి కుడివైపుకు, మరోసారి ఎడమవైపుకు తిరగాలి. ఇదే పద్ధతిని కొన్ని సార్లు రిపీట్ చేయాలి.
ఇలా అంకిత చేసిన సులభమైన వర్కవుట్లు ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు.. పైగా వీటికి ఎలాంటి జిమ్ పరికరాలూ అవసరం లేదు. కాబట్టి ఈ లాక్డౌన్లో ఈ సింపుల్ వర్కవుట్స్తోనే ఫిట్‌గా మారిపోదాం.. ఏమంటారు?