వార్మప్.. వ్యాయామం చేసేవారికి ఈ పదం బాగా సుపరిచితమే. ఎందుకంటే ఎలాంటి వ్యాయామం చేసినా దాని కంటే ముందు ఐదు నుంచి పది నిమిషాల పాటు వార్మప్ చేయడం తప్పనిసరని నిపుణులు సూచిస్తారు. అసలు వార్మప్ ఎందుకు చేయాలి? వార్మప్‌లో భాగంగా ఎలాంటి ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది? అవి చేయడం వల్ల కలిగే లాభాలేంటి?? మొదలైన విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
వ్యాయామం చేయడానికి ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు వార్మప్ తప్పనిసరిగా చేయాలన్నది ఫిట్నెస్ ట్రైనర్స్ చెప్పే మాట! అలా చేయడం వల్ల శరీరంలోని భాగాలన్నీ యాక్టివ్‌గా మారి వ్యాయామం చేసేందుకు సహకరిస్తాయని చెబుతారు. అయితే వార్మప్ చేయడం ద్వారా అదొక్కటే కాదు.. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

వార్మప్ వల్ల ప్రయోజనాలు..
* వార్మప్ ఎక్సర్సైజ్ రక్తప్రసరణని వేగవంతం చేయడం ద్వారా కండరాల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఫలితంగా తర్వాత చేసే కఠినతరమైన వ్యాయామానికి శరీరం సహకరించేలా సన్నద్ధం చేస్తుంది.
* కండరాలకు చేరే ఆక్సిజన్, పోషకాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా వ్యాయామం చేసినప్పుడు త్వరగా అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.
* ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువలో ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా వ్యాయామం చేస్తే ఒకేసారి గుండె కొట్టుకునే వేగం పెరిగి రక్తపోటు, గుండె నొప్పి.. వంటి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులేమీ తలెత్తకుండా వార్మప్ చేయడం ద్వారా గుండె కొట్టుకునే వేగాన్ని క్రమంగా పెంచవచ్చు.
* శరీరంలో శక్తి ఉత్పాదనకు తగినవిధంగా హార్మోన్ల స్థాయి మారేలా ప్రేరేపిస్తుంది.
* కీళ్లలో జరిగే కదలికల వల్ల వ్యాయామం చేసేటప్పుడు మరింత సులభంగా కదిలేందుకు వీలు ఉంటుంది.
* అధిక సమయం వ్యాయామం చేసేందుకు వీలుగా రక్తంలోని ఉష్ణోగ్రతని పెంచుతుంది.
ఇలా ఎన్నో రకమైన ప్రయోజనాలు కలిగిస్తుంది కాబట్టే వ్యాయామానికి ముందు వార్మప్ తప్పనిసరని నిపుణులు సూచిస్తారు.

వార్మప్‌లో ఏం చేయాలి?
వార్మప్ అంటే చిన్న చిన్న వ్యాయామాలు, ఆసనాలు.. మొదలైన వాటి ద్వారా ఎక్సర్సైజ్ చేసేందుకు శరీరాన్ని సన్నద్ధం చేయడమే! అయితే ఈ వార్మప్‌లో భాగంగా కార్డియోకి సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు, శరీరాన్ని వ్యాయామానికి అనుకూలించేలా చేసే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు.. మొదలైనవి చేయాలి. వ్యాయామం చేసే ముందు పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఇలా వార్మప్ చేయడం చాలా మంచిది.
వార్మప్‌లో రకాలు..
వార్మప్ మూడు రకాలుగా ఉంటుంది. * కదలిక లేకుండా- అంటే ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పరిసరాల్లో మార్పులు లేదా క్రీములు వంటివి ఉపయోగించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం. ఆవిరి ఉన్న గదిలో ఉండడం, స్పోర్ట్స్ క్రీమ్స్ వంటివి అప్త్లె చేసుకోవడం.. ఈ కోవకే చెందుతాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. ఇవి ఉపయోగించినా సరే వ్యాయామానికి ముందు కండరాలకు కదలిక కలిగించేలా తప్పనిసరిగా వార్మప్ చేయాల్సిందే!
* సహజమైనది- వ్యాయామం చేసే వారిలో ఎక్కువమంది అనుసరించే వార్మప్ ఇది. ఇందులో భాగంగా కాళ్లు, చేతులు; శరీరాన్ని నిర్దిష్ట పద్ధతిలో కదపడం, జాగింగ్, ఎగరడం, నడక.. ఇలా కండరాలను ఉత్తేజపరిచే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి. ఇవి హృదయనాళ వ్యవస్థని ప్రభావితం చేయడం ద్వారా కండరాలన్నిటినీ వ్యాయామానికి సన్నద్ధం చేస్తాయి.
* నిర్దిష్టమైన అంశాలకు సంబంధించింది- అంటే ప్రత్యేకించి ఒక ఆటకి సంబంధించింది. ముఖ్యంగా ఈ తరహా వార్మప్ ఎక్కువగా క్రీడాకారులు చేస్తారు. ఉదాహరణకి హర్డిల్స్ ఆడేవారు దానికి ముందు కొద్ది దూరం పరిగెత్తడం, కాళ్ల కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం.. వంటివి చేస్తారు.
|
సో.. వార్మప్ ప్రాధాన్యం గురించి తెలిసిందిగా.. మనం చేసే వ్యాయామాలను బట్టి మనకు ఏ రకమైన వార్మప్ ఎక్సర్సైజులు సూటవుతాయో నిపుణులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా వాటి వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.