సాధారణంగా వర్కవుట్ చేయడానికి రోజూ కనీసం అరగంట సమయమైనా వెచ్చించాలి.. అప్పుడే చక్కటి ఫిట్నెస్ను మన సొంతం చేసుకోవచ్చనేది చాలామంది భావన. అయితే ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ హడావిడితో మహిళలకు ఆ కాస్త సమయం కూడా దొరకదు. దాంతో వ్యాయామాలకు బ్రేక్ ఇచ్చేస్తుంటారు. కానీ మీ చేతిలో రెండంటే రెండే నిమిషాల సమయముంటే చాలు.. సింపుల్ వర్కవుట్స్‌తో చక్కటి ఫిట్నెస్ను మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో పాటు, వర్కవుట్లకు సంబంధించి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హెల్దీ లైఫ్‌స్టైల్‌ని అందరికీ చేరువ చేసే రుజుత.. రెండు నిమిషాల్లో చేయగలిగే వ్యాయామాల గురించి ఇటీవల ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇంట్లో ఉన్నా ఆఫీస్‌లో ఉన్నా ఈ సింపుల్ వ్యాయామాల కోసం కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే ఫిట్‌గా మారిపోవచ్చంటున్నారీ ఫిట్టెస్ట్ లేడీ. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
రుజుతా దివేకర్.. ముంబయికి చెందిన ఈ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు కరీనా కపూర్, అలియా భట్.. వంటి నటీమణులు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహార నియమాలు సూచిస్తుంటారు. అంతేకాదు.. ఆయా కాలాల్లో లభించే పండ్లలో నిండిన పోషకాలు, ఇతర పదార్థాల్లో ఉండే పోషక విలువలు, వివిధ అనారోగ్యాలు-వాటిని ఎదుర్కోవడానికి ఉపకరించే పోషకాహారం.. వంటి విషయాలపై సోషల్ మీడియా వేదికగా తరచూ పోస్టులు పెడుతూ ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేస్తున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి డైట్ ఛార్ట్లు, విభిన్న వ్యాయామాలు, మానసిక ఒత్తిడిని దూరం చేసే చిట్కాల గురించి కూడా వరుస పోస్టులు పెడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు రుజుత. అయితే ఫిట్నెస్ కోసం గంటల తరబడి సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని, కేవలం రెండంటే రెండే నిమిషాలు చాలంటూ ఇటీవలే ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్.
ఎక్కడైనా చేసేయచ్చు..!
మహిళలకు ఇంటి పనులతోనే సమయం సరిపోతుంది.. ఇక వ్యాయామం చేయడానికి తీరికెక్కడిది. ఇలా గబగబా పనులు ముగించేసుకొని మళ్లీ ఆఫీసుకు పరుగు పెట్టాల్సిందే! అయితే ఇలాంటి వారు ఆఫీస్‌లో దొరికే చిన్న చిన్న బ్రేక్స్లోనూ రెండు నిమిషాలు వెచ్చిస్తే చాలు.. సింపుల్ వర్కవుట్స్తోనే ఫిట్‌గా మారిపోవచ్చు.. ఇలా ఆఫీస్‌లోనైనా, ఇంట్లో ఉన్నా ఈ టూ-మినిట్ వ్యాయామాల్ని చేసేయచ్చంటున్నారు రుజుత. ఈ క్రమంలో దాదాపు రెండు నిమిషాల నిడివి గల వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారామె. ఇందులో భాగంగా తాను కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ వాటిని వివరించారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..!
‘లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం మొదలైంది. ఈ క్రమంలో వ్యాయామం చేయడానికి మాకు తగిన సమయం దొరకట్లేదంటూ చాలామంది చెబుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సింపుల్ వర్కవుట్స్. మీ చేతిలో రెండు నిమిషాల సమయముంటే చాలు.. ఇంట్లో అయినా, ఆఫీస్‌లో అయినా ఈ వ్యాయామాలు చేసేయచ్చు.
* ముందుగా నిటారుగా కుర్చీలో కూర్చోవాలి.. తిరిగి లేచి నిలబడాలి.. ఆపై మళ్లీ కూర్చొని మళ్లీ లేవాలి.. ఇలా ఐదు సార్లు కూర్చుంటూ-లేస్తూ ఈ వ్యాయామం చేయాలి.
* ఇప్పుడు మళ్లీ నిటారుగా కుర్చీలో కూర్చోండి. మీ కుడి కాలిని మడుస్తూ ఎడమ కాలిపై పెట్టాలి. ఆపై అలాగే లేచి నిలబడాలి. తర్వాత అదే పొజిషన్లో మళ్లీ కూర్చోవాలి. ఇలా లేస్తూ-కూర్చుంటూ ఐదు సార్లు ఈ వ్యాయామం రిపీట్ చేయాలి.
* ఆపై ఇదే వ్యాయామాన్ని కాలు మార్చి చేయాలి. అంటే ఇందాక ఎడమ కాలిపై కుడి కాలు పెట్టారు కదా.. ఇప్పుడు కుడికాలిపై ఎడమ కాలిని పెట్టి లేస్తూ-కూర్చుంటూ వ్యాయామం చేయాలి. ఇలా ఐదు సార్లు రిపీట్ చేయాలి.
* ముందుగా రెండు చేతులు భూమికి సమాంతరంగా చాచి.. టాయిలెట్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి. ఆపై పైకి లేస్తూ జంప్ చేయాలి. తర్వాత మళ్లీ ఇదే వ్యాయామం చేయాలి. ఇలా ఐదు సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది.
* ఇప్పుడు నిల్చొనే జంప్ చేయాల్సి ఉంటుంది. అంటే రోప్ ఎక్సర్సైజ్ మాదిరిగా అన్నమాట! ఇలా ఐదుసార్లు రిపీట్ చేయాలి.
అంతే.. రెండు నిమిషాల్లోనే ఈ వ్యాయామాలన్నీ చేయడం పూర్తవుతుంది. వీటి వల్ల శరీరంలో శక్తిస్థాయులు పెరగడంతో పాటు శరీరం కింది భాగం దృఢంగా, ఫిట్‌గా మారుతుంది..’ అంటూ వివరించారు రుజుత.
మరి, రుజుత చెప్పిన ఈ రెండు నిమిషాల సింపుల్ వ్యాయామాల్ని మనమూ చేసేద్దాం.. ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా మారిపోదాం.. ఏమంటారు?