బొద్దుగా ఉండాలని ఎవరికీ ఉండదు.. అలా ఉండడం మన తప్పు కూడా కాదు.. కానీ చాలామంది లావుగా ఉన్న వారిని చూసి తమ సూటిపోటి మాటలతో వారిని బాధపెడుతుంటారు. ఇలా ఎదుటివారు అనే మాటలతో తమని తామే నిందించుకోవడం, తమ శరీరాన్ని తామే అసహ్యించుకోవడం.. వంటివి చేస్తుంటారు. కానీ అలా చేస్తే ఎప్పటికీ బరువు తగ్గలేమని చెబుతోంది బాలీవుడ్ అందాల తార భూమి పడ్నేకర్. ఎలా ఉన్నా తమను తాము అంగీకరించుకోవడం, తమ శరీరాన్ని తాము ప్రేమించుకున్నప్పుడే ఫిట్‌గా, ఆరోగ్యంగా మారచ్చని అంటోందీ బాలీవుడ్ బేబ్. ‘దమ్ లగా కే హైసా’ చిత్రంలో బొద్దుగుమ్మగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఆ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 12 కిలోలు పెరిగింది. ఆపై ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గి మల్లెతీగలా మారిపోయింది. తాను బరువు పెరిగినా, తన శరీరాకృతి గురించి విమర్శలొచ్చినా తన శరీరాన్ని తాను ప్రేమించుకోవడం, తనను తాను అంగీకరించుకోవడం వల్లే తిరిగి బరువు తగ్గగలిగానని, ఏ వెయిట్ లాస్ జర్నీకైనా ఇవే కీలకం అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది భూమి. ఈ నేపథ్యంలో బొద్దుగుమ్మగా తన కెరీర్‌ను ప్రారంభించి ముద్దుగుమ్మగా అభిమానుల మనసుల్లో చెరగని ముద్రవేసిన ఈ అందాల తార ఫిట్నెస్ రహస్యాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..
హాయ్.. నేను మీ భూమిని. ‘దమ్ లగా కే హైసా’ చిత్రంలో బాగా లావుగా ఉన్న అమ్మాయిలా సంధ్యా వర్మ పాత్రలో మీ ముందుకు వచ్చినప్పుడు మీరంతా నన్నెంతో ఆదరించారు. చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి నేను ముందు నుంచే కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దానికి తోడు ఈ పాత్ర కోసం నేను దాదాపు 12 కిలోలు పెరిగే సరికి ఇంకాస్త లావుగా తయారయ్యా. సినిమాకు తగ్గట్లుగా బరువు పెరగడం, తగ్గడం నటీనటులకు మామూలే. అయితే ఈ క్రమంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది.
అంగీకరించినప్పుడే అది సాధ్యం!
ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాళ్లలో చాలామంది అమ్మాయిలు అందం, బరువు విషయంలో ఇతరులతో పోల్చుకుంటూ.. ‘తాము ఫలానా వారిలా లేమే..’ అంటూ బాధపడిపోతుంటారు. లావుగా ఉండే తమ శరీరతత్వాన్ని చూసుకొని అసహ్యించుకుంటుంటారు. కానీ అది అస్సలు కరక్ట్ కాదు. ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం, ఎలా ఉన్నా తమను తాము అంగీకరించుకున్నప్పుడే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ప్రతి వెయిట్ లాస్ జర్నీకి ఇవే కీలకం. ‘మీరెలా బరువు తగ్గారు’ అని నన్ను అడిగిన వారందరికీ నేను చెప్పే సమాధానం ఇదే. మీ శరీరానికి అనుగుణంగా మీరు మారుతూ.. దాన్ని మీకు అనుగుణంగా మార్చుకోవాలి. అప్పుడే మీకు నచ్చినట్లుగా మీ శరీరాన్ని మలచుకోవచ్చు. ఈ క్రమంలో తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల్లో క్రమశిక్షణ కూడా అవసరమే. నా విషయానికొస్తే నేను ఏనాడూ జిమ్‌లో వ్యాయామాలు మానలేదు.. రాత్రుళ్లు 7.30 గంటల తర్వాత ఆహారం తీసుకున్నది లేదు.
ఆ విషయంలో అస్సలు రాజీ పడను!
ఇక మరో విషయం ఏంటంటే.. చాలామంది బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకొని అందుకోసం విపరీతంగా కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన ఆహార పదార్థాల్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంటారు కూడా! కానీ మనకు నచ్చిన ఆహారాన్ని కష్టంగా మానేస్తే.. మన మనసంతా దానిపైనే ఉంటుంది.. ఆ ఒత్తిడి వల్ల మరింత బరువు పెరుగుతాం. అందుకే నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూనే బరువు తగ్గే మార్గాల్ని అన్వేషించాలి. నేనూ అదే చేశాను. అంతేకానీ.. నాకు నచ్చిన ఫుడ్ విషయంలో మాత్రం బరువు తగ్గే సమయంలోనే కాదు.. ఎప్పుడూ రాజీ పడను.
ఆ మూడు నియమాలే కీలకం!
నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫుడీని. ఒక్కమాటలో చెప్పాలంటే ఆహారమే నన్ను ఇంత హ్యాపీగా, ఉత్సాహంగా ఉంచుతుంది. పాత్రలకు అనుగుణంగా బరువు పెరిగేటప్పుడు, తిరిగి తగ్గి స్లిమ్‌గా మారేటప్పుడు నాకు నచ్చిన ఆహార పదార్థాల్ని తీసుకోకుండా కడుపు మాడ్చుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే అన్ని వేళల్లో నాకు ఎంతో ఇష్టమైన నెయ్యి, బటర్, మజ్జిగ ఉండాల్సిందే! అయితే బరువు తగ్గే క్రమంలో నేను తీసుకునే ఫుడ్‌లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకున్నానంటే అది.. చక్కెరకు పూర్తి దూరంగా ఉండడం ఒకటైతే.. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం మరొకటి.. అలాగే ఏ ఆహారం తీసుకున్నా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం అలవాటుగా మార్చుకున్నా.. ఈ మూడు ఆహార నియమాలే నేను బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించాయని చెబుతా.
ఇంటి ఫుడ్‌కే నా ఓటు!
‘దమ్ లగా కే హైసా’ సినిమా చేసేటప్పుడు 89 కిలోల బరువున్న నేను.. ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గి 57 కేజీలకు చేరుకున్నా. ఈ క్రమంలో నేను తీసుకున్న ఆహారం నా అధిక బరువు తగ్గించుకునేందుకు బాగా తోడ్పడింది. అందుకే ప్రస్తుతం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు అదే డైట్‌ని కొనసాగిస్తున్నా.. ఈ క్రమంలో నా మీల్ ప్లాన్‌ను నాలుగు భాగాలుగా విభజించుకున్నా.
1. బ్రేక్‌ఫాస్ట్ కోసం: * రోజులో నేను తీసుకునే తొలి ఆహారం గ్లాసు గోరువెచ్చటి నీళ్లు. ఇవి నాకు డీటాక్స్ వాటర్‌గా పనిచేసి.. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించేస్తాయి. * ఆపై అరగంటకు సన్‌ఫ్లవర్ గింజలు లేదా అవిసె గింజలు, సెరల్స్ వెన్న తొలగించిన పాలల్లో మరిగించి తీసుకుంటా. * ఇక జిమ్‌కి వెళ్లే అరగంట ముందు గోధుమ బ్రెడ్, రెండు గుడ్ల తెల్లసొనలతో చేసిన ఆమ్లెట్స్, ఒక బొప్పాయి లేదా యాపిల్ ముక్కలు.. వంటివి తీసుకుంటా. * జిమ్ నుంచి తిరిగొచ్చాక ఐదు కోడిగుడ్ల తెల్లసొనలు మాత్రమే తింటా.
2. లంచ్ మెనూ: * మల్టీగ్రెయిన్ రోటీపై వెన్న పూసుకొని, పప్పు, సబ్జీ (కాయగూరలన్నీ కలిపి చేసే కర్రీ - దీన్ని ఆలివ్ ఆయిల్‌తో చేసుకుంటా), ఇంట్లో తయారుచేసిన పెరుగు లేదా మజ్జిగ.. వంటివి తీసుకుంటా. * ఒక్కోసారి గ్రిల్డ్ చికెన్ లేదా కాయగూరలు, గ్రిల్డ్ చికెన్‌తో స్టఫ్ చేసిన బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్; క్యారట్స్-కీరాలను హమ్మస్‌లో డిప్ చేసుకొని తీసుకుంటా. అప్పుడప్పుడూ బౌల్ బ్రౌన్ రైస్‌ని చికెన్ గ్రేవీతో కలిపి తీసుకోవడమూ నాకు అలవాటే.
3. ఇవే నా స్నాక్స్: * రోజూ సాయంత్రం 4.30 గంటల కల్లా స్నాక్స్ నా ముందు ఉండాల్సిందే! ఇందులో భాగంగా బొప్పాయి/ యాపిల్/ పియర్/ జామ.. వీటిలో ఏదో ఒక పండు తీసుకుంటా. * అరగంట తర్వాత కప్పు గ్రీన్ టీ, బాదం లేదా వాల్నట్స్ తింటా. * డిన్నర్‌కి ముందు తాజా కాయగూరలు, పండ్లు, నట్స్, ఆలివ్ నూనె, వెల్లుల్లి, యాపిల్ సిడార్ వెనిగర్.. వంటివాటితో తయారుచేసిన సలాడ్ని తీసుకుంటా. 4. డిన్నర్ సమయంలో: * రాత్రి 7.30 గంటలకల్లా డిన్నర్ పూర్తిచేస్తా. ఇందులో భాగంగా ఒకవేళ నాన్‌వెజ్ తినాలనిపిస్తే గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్ తీసుకుంటా. * ఒకవేళ వెజ్ తినాలనిపిస్తే.. గ్రిల్డ్ పనీర్ లేదా టోఫు, ఆవిరిపై ఉడికించిన కాయగూరల్ని తీసుకుంటా. * ఇలా ఏది తీసుకున్నా దాన్ని కప్పు బ్రౌన్ రైస్ లేదా మల్టీగ్రెయిన్ రోటీతో కలిపి తినడానికి ఇష్టపడతా. * ఇలా రోజులో ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవడం నాకు అలవాటు. అలాగే ఐదు రోజులకోసారి ఛీట్ మీల్ తప్పనిసరి. అప్పుడు నాకు ఇష్టమైన పదార్థాల్ని మనసారా ఆస్వాదిస్తా.
* నా డైట్లో భాగంగా చక్కెరను పూర్తిగా మానేశానని చెప్పాను కదా.. మరి, స్వీట్ తినాలనుకున్నప్పుడు ఏం చేస్తా అనే సందేహం మీకు రావచ్చు. అందుకు తేనె, డేట్ సిరప్, బెల్లం, మేపుల్ సిరప్, కొకోనట్ షుగర్, స్టీవియా.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండనే ఉన్నాయి. వాటితో తయారుచేసిన స్వీట్స్ కుమ్మేస్తా. * ఇక నాకు దాహం వేసినప్పుడే కాదు.. మధ్యమధ్యలో కూడా నీళ్లు తాగుతుంటా. ఎక్కడికెళ్లినా నాతో పాటు ఓ బాటిల్ వెంట ఉండాల్సిందే! అది కూడా ఇంట్లోని పరిశుభ్రమైన నీరే అయి ఉండాలి. * ఇక నా డైట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్న మరో ముఖ్య విషయం ఏంటంటే.. నాకు ఏది తినాలనిపించినా ఇంట్లో తయారుచేసుకొని తింటుంటానే తప్ప బయటి పదార్థాలు అస్సలు ముట్టను. ఎందుకంటే బయటి పదార్థాలు తిని ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ఇంట్లోనే పరిశుభ్రంగా తయారుచేసుకొని తీసుకుంటే ఆ రుచి, శుచి వేరుగా ఉంటుంది.
|
నా దృష్టంతా ఆ రెండింటిపైనే!
తీసుకునే ఆహారంతో పాటు క్రమం తప్పకుండా నేను చేసే వ్యాయామాలు నా అధిక బరువు తగ్గించడమే కాదు.. నన్ను నిరంతరం స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేలా చేస్తున్నాయి. ఎక్సర్సైజ్ విషయానికొస్తే.. జిమ్‌లో కార్డియో, వెయిట్ ట్రెయినింగ్.. ఈ రెండింటిపైనే ఎక్కువ దృష్టి పెడతా. వారానికి మూడు రోజులు కార్డియో వ్యాయామాలకు సమయం కేటాయిస్తే.. రెండు రోజులు బరువులెత్తే వ్యాయామాలు చేస్తా. ఇవి నా శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించడంతో పాటు నా కండరాలు దృఢంగా అయ్యేందుకు దోహదపడుతున్నాయి. చక్కటి శరీరాకృతిని నాకు అందిస్తున్నాయి. ఇక వీటితో పాటు ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం కంటే ఉన్న చోటే అటూ-ఇటూ తిరగడానికి ప్రయత్నిస్తా. అలాగే మెట్లెక్కడం, దగ్గరి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే నడిచే వెళ్లడం.. వంటివీ నా ఎక్సర్సైజ్ రొటీన్లో భాగమే.
|
ఇక ఆఖరుగా మరో మాట.. లావుగా ఉన్నామని తమను తాము నిందించుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తప్ప.. ఒరిగేదేమీ ఉండదు.. ఫలితంగా మరింత బరువు పెరుగుతాం. కాబట్టి ఎవరి శరీరాన్ని వారు అంగీకరించుకోవాలి.. ప్రేమించుకోవాలి. అప్పుడే బరువు తగ్గాలన్న మన ఆలోచన సఫలీకృతమవుతుంది. ఇక అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. మీ ఇంట్లో వాళ్లను, తెలిసిన వాళ్లను బరువు తగ్గమంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తూ వాళ్లను మరింత బాధపెట్టకండి. మీరు వారికి ఎలాంటి సహాయం చేయకపోయినా పర్లేదు.. కానీ అధిక బరువు, శరీరతత్వం.. వంటి విషయాల్లో ఇతరుల్ని నిందించడం మానుకోండి.. ఫ్యాట్ షేమింగ్, బాడీ షేమింగ్.. వంటి విషయాలకు మరింత దూరంగా ఉండండి. అదే ఈ సమస్యలతో బాధపడుతోన్న వారికి మీరిచ్చే బహుమతి!