బాలీవుడ్ నటిగానే కాదు ఫ్యాషనిస్టుగా, ఫిట్నెస్ ఫ్రీక్‌గా అభిమానుల మనసు దోచుకుంటోంది మలైకా అరోరా. 46 ఏళ్ల వయసులోనూ నాజూకైన శరీరాకృతితో నేటికీ యంగ్ అండ్ స్లిమ్‌గా కనిపిస్తుంది. మరి, వయసుతో పాటు మీ అందం రెట్టింపవడానికి కారణమేంటి? అనడిగితే ...రోజూ చేసే వ్యాయామాలు, వర్కవుట్లు అంటోందీ యమ్మీ మమ్మీ. క్రమం తప్పకుండా కఠినమైన వ్యాయామాలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే. ఈ క్రమంలో తాజాగా మరో వర్కవుట్‌తో మన ముందుకొచ్చింది మలైకా.
శరీరాన్ని విల్లులా వంచుతూ!
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమైంది మలైకా. అయినప్పటికీ తన ఫిట్నెస్, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తాజాగా వర్కవుట్స్‌లో భాగంగా తన శరీరాన్ని విల్లులా వంచుతూ హలాసనం వేసిన ఆమె ఈ యోగాసనానికి సంబంధించిన విషయాలను ఇన్‌స్టా వేదికగా అందరితో షేర్ చేసుకుంది.
మనసుకు మరింత దగ్గరయ్యేందుకు!
‘అందరికీ హాయ్! నేను కనిపించకుండా పోయానేమోనని మీరు అనుకుంటున్నారేమో! నేను ఎక్కడికీ పోలేదు. ఈ లాక్డౌన్ రూపంలో మన మనసుతో మాట్లాడేందుకు మనకో మంచి అవకాశం లభించింది. ఈక్రమంలో నేను ఇంట్లోనే ఉంటూ నా శరీరం, నా మనసుకు మరింత దగ్గరవుతున్నాను. లాక్డౌన్ మార్పులకు అనుగుణంగా చాలామంది ఈ కొత్త లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకుంటున్నారని నేను భావిస్తున్నా. అయితే ‘ఈ లాక్డౌన్లో ఇంట్లో మీరేం చేస్తున్నారు’ అని చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఇంట్లోనే ఉంటున్నా. డైలీ వర్కవుట్లు, వ్యాయామాలతో ఈ లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నా. ఈ సమయంలో నా యోగాసనాలకు సంబంధించిన విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీటితో మీ శరీరంలోని కండరాలను మరింత పటిష్ఠం చేసుకోండి’ అని రాసుకొచ్చింది మలైకా.
ఇందులో భాగంగా హలాసనం వేసిన ఆమె... దీనిని ఎలా ఆచరించాలో చెబుతూ, అదేవిధంగా ఈ ఆసనంతో కలిగే ప్రయోజనాలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.
హలాసనం ఎలా వేయాలంటే!
*మొదటగా నేలపై వెల్లకిలా పడుకుని, రెండు చేతులను భూమికి తాకించాలి.
* అనంతరం శ్వాసను బిగపట్టి రెండు చేతులతో నేలను గట్టిగా అదిమి పట్టాలి. పైన ఉండే సీలింగ్ వైపు రెండు కాళ్లను నిదానంగా లేపాలి.
*శరీరానికి సపోర్టుగా ఉండేందుకు రెండు చేతులతో నడుమును పట్టుకోవాలి.
*శరీరం బ్యాలన్స్ కోల్పోకుండా ఉండేందుకు అవసరమైతే రెండు మోకాళ్లను వంచచ్చు.
*ఇప్పుడు తలపై నుంచి మెల్లగా పాదాలను నేలను తాకించేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి.
*ఇప్పుడు మళ్లీ నిదానంగా నడుముని కిందకి దించుతూ రెండు కాళ్లనూ నేలపైనే ఆన్చి వెల్లకిలా పడుకున్న పొజిషన్లోకి వచ్చేయాలి.
ప్రయోజనాలు!
ఈ హలాసనంతో శరీరంతో పాటు మనసుకు కూడా ప్రశాంతత చేకూరుతుందని, శరీరంలోని విషతుల్య పదార్థాలు బయటకు వెళ్లిపోతాయని చెబుతోంది మలైకా. ఈక్రమంలో ఈ యోగాసనంతో చేకూరే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
*ఈ ఆసనం వెన్నునొప్పి, తలనొప్పి, వంధ్యత్వం, నిద్రలేమితనం, సైనసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
*మహిళల్లో రుతుక్రమ సమస్యలను నయం చేస్తుంది.
*ఉదర, థైరాయిడ్ గ్రంథులను ఉత్తేజితం చేసి వాటి పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.
*బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్ రోగులకు ఈ ఆసనం చాలా మేలు చేకూరుస్తుంది.
*రక్తంలో గ్లూకోజ్ స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది.
గమనిక : గుండె సంబంధిత వ్యాధులు, డయాబటిస్, హెర్నియా తదితర ఆరోగ్య సమస్యలున్న వారు నిపుణుల సలహాల మేరకే ఈ ఆసనం వేయాలి.