శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరెప్పుడైనా ‘స్కిప్పింగ్’ ట్రై చేశారా? ఎందుకంటే దీనివల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. అలాగే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కూడా ఎలాంటి డైటింగ్ లేకుండా.. కేవలం స్కిప్పింగ్ చేయడం వల్లే కరిగించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, స్కిప్పింగ్ చేయడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...

అసలెలా చేయాలి??
స్కిప్పింగ్ ఎలా చేయాలి?? ఈ ప్రశ్న కాస్త సిల్లీగానే అనిపించినా స్కిప్పింగ్ చేయడంలోనూ కొన్ని మెలకువలున్నాయి. ముందుగా మీరు ఉపయోగించే స్కిప్పింగ్ తాడును మీ పాదాలతో అదిమి పట్టుకుని, దాని రెండు అంచులు మీ ఎత్తుకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత తాడు చివర్లను చేతులతో పట్టుకుని ఎగురుతూ.. కేవలం ముందు నుంచి వెనక్కే కాకుండా.. వెనక నుంచి ముందుకు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి.

ప్రయోజనాలివే!
* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం.. ఇలా మీరు చేసే వ్యాయామంలో స్కిప్పింగ్‌ను కూడా భాగం చేసుకోండి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు కరిగిపోయి క్రమంగా నాజూగ్గా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల చక్కటి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ప్రతిరోజూ ఓ గంటపాటు ఈ రకమైన వ్యాయామం చేస్తే 1300 క్యాలరీలు ఖర్చవుతాయి.
* ఈ వ్యాయామం వల్ల భుజాలు తిప్పడం, పాదాలపై ఒత్తిడి పడడం, కాళ్లను ఆడించడం .. వంటి వాటి వల్ల ఆయా భాగాలు దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా తయారవడంతో పాటు మిగతా శరీర భాగాలూ కదులుతూ వాటికీ వ్యాయామం అందుతుంది.
* తాడాట వల్ల మనం జంపింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక మైలు పరిగెత్తిన దాంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.
* స్కిప్పింగ్ వల్ల శరీరంలో ఎముకలు దృఢమవుతాయి. ఫలితంగా ఆస్టియోపొరోసిస్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
* ఈ వ్యాయామం ప్రారంభించిన మొదట్లో కొంతమందిలో కాళ్లు నొప్పులు పుట్టడం, పాదాలు కమిలిపోవడం.. లాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపకూడదు. ప్రతిరోజూ చేయడం వల్ల కొన్ని రోజులకు అలవాటు పడిపోయి.. కాలి కండరాలు, తొడలు దృఢంగా తయారవుతాయి.

* ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మానసికంగా కూడా దృఢంగా తయారుకావచ్చు. మొదట్లో జంపింగ్ చేయడంలో తడబడినా.. చేస్తూ చేస్తూ ఉంటే మెదడు సరైన విధంగా స్పందించి తాడు కాళ్ల దగ్గరకు వచ్చినప్పుడు యాదృచ్ఛికంగానే జంప్ చేసేస్తాం. ఇది మీరందరూ గమనించే ఉంటారు కదూ! కాబట్టి ఈ వ్యాయామం వల్ల మానసికంగా చాలా చురుగ్గా తయారుకావచ్చు.
* ఈ ఆట వల్ల శరీరంలోని అవయవాల కదలిక, జీవక్రియలు వేగవంతం అవడంతో పాటు అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది.
* స్కిప్పింగ్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం వేగవంతం అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ క్రమంలో ఉదరం లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ ఉంటుంది. ఫలితంగా అక్కడ ఉండే కొవ్వు కరుగుతుంది.
* స్కిప్పింగ్ చేసిన వెంటనే దాహం వేస్తుందని నీరు తాగడం, ఏదైనా తినడం లాంటివి చేయకూడదు. అరగంట తర్వాత మొలకెత్తిన గింజలు, పండ్లు.. వంటి తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* స్కిప్పింగ్ కోసం మీరు తీసుకునే తాడు చిన్నదైతే భుజాలు నొప్పులు పుడతాయి. కాబట్టి మీ ఎత్తుకు సరిపోయే తాడును ఎంచుకోవడం మంచిది.
* త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో వేగంగా స్కిప్పింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండె వేగం, బీపీ పెరుగుతాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో గుండె పోటు వచ్చే ప్రమాదమూ ఉంది.
* స్కిప్పింగ్ చేసే క్రమంలో నిటారుగా నిల్చుని ప్రశాంతంగా చేయాలి. ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. ముందుగా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత కాసేపు కూర్చోండి. దీనివల్ల కాళ్లకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది.
* మీరు జంపింగ్ చేసే క్రమంలో కాళ్లలో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే అథ్లెటిక్ షూస్ ధరించడం మంచిది.
ఎవరు చేయకూడదు?
* గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ వ్యాయామం చేయకపోవడమే మంచిది.
* అలాగే సిజేరియన్ అయిన మహిళలు లేదంటే ఏ ఇతర కారణాల వల్ల ఆపరేషన్ అయిన వారైనా.. వెంటనే ఈ వ్యాయామం మొదలుపెట్టకపోవడం మంచిది. కావాలంటే మూడు నెలల తర్వాత.. అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని తిరిగి ప్రారంభించాలి.