ఫలానా రంగమని గిరిగీసుకోకుండా.. ఏ రంగంలోనైనా తమ ప్రతిభాపాటవాలతో దూసుకుపోతున్నారు అతివలు. మరికొందరైతే విభిన్న రంగాలను ఎంచుకొని తమలోని సృజనాత్మకతను చాటుతూ నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారినే ఎంపిక చేసి అత్యంత ప్రభావశీలురైన యువ భారతీయులుగా గుర్తించింది జీక్యూ ఇండియా. వినోదం, కళలు, వ్యాపారం.. తదితర రంగాల్లో చిన్న వయసులోనే ప్రతిభ చాటుతోన్న వారిని ఒక్కచోట చేర్చి ‘పీపుల్ లీడింగ్ ద ఛేంజ్’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో 25 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో బాలీవుడ్ నటి-నిర్మాత అనుష్కా శర్మతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలు కూడా స్థానం సంపాదించారు. మరి, వారెవరు? తమదైన ప్రతిభతో అందరినీ ఎలా ప్రభావితం చేశారో తెలుసుకుందాం రండి..
అనుష్కా శర్మ – వినోదం
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్లో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఎదిగింది అందాల తార అనుష్కా శర్మ. ‘రబ్నే బనాదీ జోడీ’తో మొదలైన తన సినీ ప్రస్థానం ‘అంగ్రేజీ మీడియం’ దాకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. కేవలం నటిగానే కాదు.. అటు సినిమాలు చేసుకుంటూ ఇటు నిర్మాతగానూ మారిందీ ముద్దుగుమ్మ. తన సోదరుడు కర్నేశ్ శర్మతో కలిసి ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఈ చక్కనమ్మ.. ఈ బ్యానర్‌పై ‘ఎన్‌హెచ్ 10’, ‘ఫిలౌరీ’, ‘పరి’, ‘పాతాళ్ లోక్’, ‘బుల్బుల్’.. వంటి సినిమాలను నిర్మించింది. ఇలా తాను నెలకొల్పిన నిర్మాణ సంస్థ వేదికగా కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందామె. మరోవైపు NUSH పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. ఇలా వ్యాపారవేత్తగా మారిన అనుష్క ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఆర్జన కలిగిన నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతోంది. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహమాడిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇటీవలే ‘వామిక’ అనే ముద్దుల పాపకు జన్మనిచ్చింది.
లీజా మంగళ్‌దాస్
సెక్స్, లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడడమంటే మన దేశంలో అదేదో తప్పుగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడినా, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినా అదోలా చూస్తారు.. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న ఇలాంటి అపోహల్ని, మూసధోరణుల్ని తన సృజనాత్మక కంటెంట్‌తో పారదోలే ప్రయత్నం చేస్తోంది ముంబయికి చెందిన లీజా మంగళ్‌దాస్. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన ఆమె.. 2017 నుంచే సెక్స్, లైంగిక ఆరోగ్యం, లైంగికత, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం.. వంటి అంశాలకు సంబంధించిన వీడియోలను రూపొందించడం మొదలుపెట్టింది. వీటిని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అప్లోడ్ చేస్తూ ఎంతోమందిలో లైంగిక విద్యపై అవగాహన పెంచుతోందామె. అంతేకాదు.. మహిళలకూ లైంగిక కోరికలు సహజమని, వాటిని బహిర్గతం చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటోన్న ఆమె.. ‘వాతావరణం, వంటకాల గురించి మనం ఎంత నిర్మొహమాటంగా మాట్లాడతామో.. సెక్స్ గురించి కూడా అలాగే మాట్లాడాలం’టూ ఈ అంశంపై సమాజంలో నెలకొన్న అపోహల్ని రూపుమాపే ప్రయత్నం చేస్తోంది లీజా.
అపర్ణా పురోహిత్

ఈ మధ్య కాలంలో సినీ ప్రియులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ వేదికలు. మరీ ముఖ్యంగా కరోనా ప్రతికూల పరిస్థితుల్లో థియేటర్లు మూతపడడంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్.. వంటి వాటినే ఆశ్రయించారంతా! అయితే బయటి కంటెంట్‌నే కాకుండా సొంతంగా రూపొందించుకున్న కంటెంట్‌తో విభిన్న షోలు, సినిమాలను ‘ఒరిజినల్స్’ పేరుతో ప్రేక్షకుల్లోకి తీసుకొస్తున్నాయీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. అమెజాన్ ప్రైమ్ ఇండియా ఒరిజినల్స్ పేరుతో వచ్చిన ‘మీర్జాపూర్’, ‘బ్రీత్, ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’.. వంటివి ఎంతటి సక్సెస్‌ను సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ వెబ్ సిరీస్ అయితే ఏకంగా ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డులకే నామినేట్ అయిందంటే మాటలు కాదు.. ఈ క్రెడిటంతా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ హెడ్ అపర్ణా పురోహిత్కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.. ముంబయి సినీ పరిశ్రమలో అసిస్టింగ్ డైరెక్టర్‌గా పదిహేనేళ్ల పాటు పనిచేసిన ఆమె.. పలు చాట్ షోలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రింట్ జర్నలిజం, రేడియో, యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లోనూ అనుభవం గడించారామె. సినిమా కంటెంట్ విభాగంలో ఔత్సాహిక మహిళల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె.. ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్‌సిరీస్ పనిలో నిమగ్నమయ్యారు.
మీనమ్ అపంగ్

ఫొటో చూపించి డ్రాయింగ్ వేయమంటేనే కష్టం.. అలాంటిది కథ చెప్పి.. దాన్ని ఊహించుకుంటూ డ్రాయింగ్ వేయడమంటే అంత సులభమైన విషయం కాదు. అదిగో అలాంటి కళలో ఆరితేరింది 40 ఏళ్ల మీనమ్ అపంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో పుట్టిపెరిగిన ఆమె అక్కడి పురాణేతిహాస కథల నుంచి ప్రేరణ పొంది వాటిని బొమ్మల రూపంలో చిత్రీకరించడం మొదలుపెట్టింది. ఇందుకోసం పేపర్, దారాన్ని ఉపయోగిస్తుంటుందామె. ముంబయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మౌఖిక కథల ఆధారంగా డ్రాయింగ్ వేస్తుంటుంది. అంతేకాదు.. తన ఈ కళను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంతో పాటు గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తుంటుంది. ‘నా జీవితాన్ని, కళను అనుసంధానించడానికే నేను అనునిత్యం ప్రయత్నిస్తుంటాను. గతం మరుగున పడిపోకుండా భవిష్యత్ తరాల వారికి అందించడానికి నన్ను నేను వారధిగా మలచుకుంటా..’ అంటారామె.
వీరితో పాటు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం కృషి చేస్తోన్న డాక్టర్ నందిని వెల్హో, ట్రాన్స్ జెండర్ల పట్ల అందరిలో ఉన్న వైఖరిని మార్చడానికి ప్రయత్నిస్తోన్న డాక్టర్ త్రినేత్ర హల్దర్ గుమ్మరాజు.. వంటి వారు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.