Photo: Instagram
‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది... కష్టాల వారధి దాటిన వారికి అది సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షరాలా సత్యమని నిరూపిస్తోంది కేరళకు చెందిన ఓ మహిళ. లక్షలు ఆర్జించిపెడుతున్న స్వీట్ షాప్ కాస్తా దోపిడీకి గురైతే ఒక్కసారిగా రోడ్డున పడింది. అలాగని చేతకానిదానిలా ఏడుస్తూ కూర్చోలేదు. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో మళ్లీ ముందుకు దూసుకువచ్చింది. కష్టాలకు కుంగిపోకుండా తన సంకల్పబలంతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. అందరి జీవితాల్లో కష్టాలనేవి సర్వసాధారణమని.. అయితే వాటినే తలుచుకుంటూ కూర్చోవడం కంటే... ఆ పరిస్థితులను అధిగమించే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం ఉంటుందని చెబుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆ మహిళ విజయ గాథను మనమూ తెలుసుకుందాం రండి...
స్వీట్లు, స్నాక్స్ వ్యాపారంతో!
ఒకప్పుడు వ్యాపార వాణిజ్య రంగాలంటే చాలామందికి పురుషులే గుర్తుకు వచ్చేవారు. అయితే ప్రస్తుతం మహిళలూ ఈ రంగాల్లో మగవాళ్లతో పోటీపడుతున్నారు. అవరోధాలు, వైఫల్యాలు ఎదురైనా కుంగిపోకుండా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఇలవరసి జయకాంత్ కూడా ఈ కోవకే చెందుతుంది. పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా 45 ఏళ్ల క్రితమే త్రిస్సూర్ వచ్చి స్థిరపడిందామె. తన తాత, తల్లిదండ్రులు జీవనోపాధి కోసం ప్రారంభించిన స్వీట్లు, స్నాక్స్ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించి ఒక చిన్నపాటి వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించింది.
వ్యాపారాన్ని విస్తరిస్తూ!
ప్రారంభంలో ఇంట్లోనే స్వీట్లు, స్నాక్స్ తయారు చేసి స్థానిక దుకాణాలు, తెలిసిన వారికి అమ్మి మంచి లాభాలు గడించింది ఇలవరసి. ఇక పెళ్లయ్యాక కూడా ఇదే బిజినెస్‌లో నిమగ్నమైన ఆమె వీలైనంత ఎక్కువగా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంది. దీంతో బ్యాంకులు, తెలిసిన వారి నుంచి సుమారు రూ.50 లక్షల వరకు అప్పుగా తీసుకుని త్రిస్సూర్‌లో 2010లో తనే ప్రత్యేకంగా ఓ షాప్ ప్రారంభించింది. తన వ్యాపార దక్షతకు మరింత పదును పెడుతూ మామిడి, నారింజ, గూస్బెర్రీస్, పనస, బంగాళాదుంపలు, దోసకాయలు... మొదలైన వాటితో హల్వా, చిప్స్, కేక్స్ తయారుచేసి విక్రయించేది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జించింది. ఇదే క్రమంలో కనీసం 50 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది.
అనుకోని కుదుపు!
ఇక అంతా బాగుంది అన్న తరుణంలో ఇలవరసి వ్యాపారం ఊహించని కుదుపునకు లోనైంది. కొందరు దుండగులు ఆమె దుకాణంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. దీంతో ఆమె కుటుంబంతో పాటు ఉద్యోగులు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ఊహించని సంఘటనతో శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎంతో కుంగిపోయింది ఇలవరసి. దీనికి తోడు ఇతర అనారోగ్యాలు కూడా చుట్టుముట్టడంతో కొన్నాళ్లు ఆస్పత్రికే పరిమితమైందామె. ఈ క్రమంలో చికిత్స తీసుకుని మళ్లీ మామూలు మనిషి కావడానికి ఇలవరసికి కనీసం ఆరునెలలు పట్టింది. ఇదే సమయంలో అప్పులు ఇచ్చిన వారు డబ్బులు కట్టాలని ఆమె కుటుంబాన్ని వేధించారు. బ్యాంకులు కూడా వెంటనే లోన్ కట్టేయాలని నోటీసులు జారీ చేయడంతో పూర్తి డోలాయమానంలో పడిపోయిందీ బిజినెస్ ఉమన్.
మనో ధైర్యంతో ముందడుగు!
ఈ క్రమంలో మనోబలం మెండుగా ఉన్న ఇలవరసి ఒక నిర్ణయం తీసుకుంది. మనో ధైర్యంతో ముందడుగేసి తన పూర్వీకులు నేర్పించిన మిఠాయిలు, స్నాక్స్ వ్యాపారాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో మళ్లీ మొదలుపెట్టింది. కేవలం రూ.100ల పెట్టుబడితో త్రిస్సూర్ రైల్వేస్టేషన్ దగ్గర ‘అవతి హాట్ చిప్స్’ పేరుతో ఒక దుకాణం ప్రారంభించింది. దీనికి మంచి స్పందన రావడంతో వెంటనే వడల వ్యాపారం కూడా మొదలుపెట్టింది. ఇలా వారసత్వంగా వచ్చిన ప్రతిభకు తోడు రాత్రీ పగలూ కష్టపడుతూ తన బిజినెస్‌ను మళ్లీ లాభాల బాటలోకి తీసుకొచ్చింది.
కొన్ని నెలల్లోనే ఇలవరసి దుకాణం నుంచి హాట్ చిప్స్, వడలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. భారీగా లాభాలు రావడంతో మొదట పాత అప్పులు తీర్చిన ఆమె ఆ తర్వాత మెల్లగా తన వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త్రిస్సూర్‌లోని వివిధ ప్రదేశాల్లో మరో నాలుగు స్టాల్స్ కూడా ప్రారంభించింది. స్వీట్లు, స్నాక్స్‌తో పాటు కేక్స్, హల్వాలు, పచ్చళ్లతో సహా మొత్తం 60 రకాల ఉత్పత్తులను ఈ దుకాణాల్లో విక్రయిస్తోంది.
నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా!
ఈ క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలంగా మారినా మనోధైర్యంతో ముందడుగు వేసింది ఇలవరసి. తన వ్యాపార దక్షతతో తను నిలబడడమే కాకుండా తనను నమ్ముకున్న ఉద్యోగుల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపింది. ఈ క్రమంలో 2019లో ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యూఏఈ నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు కూడా సొంతం చేసుకుందీ బిజినెస్ ఉమన్.
‘నా జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు నాకు మంచి గుణ పాఠాలను నేర్పించాయి. షాపులో భారీ దోపిడీ జరిగినప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. నాతో పాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఆ సమయంలో నాకు చేయూత అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నా కోసం కాకపోయినా, నా ఉద్యోగుల కోసం వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించాను. అనుకున్నట్లే మళ్లీ లాభాల బాటలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు కూడా నా వ్యాపారంతో నెలకు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులతో పాటు వ్యాపారంలో నష్టపోయిన పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం నా మార్గదర్శకత్వం కోసం వస్తున్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారీ సూపర్ ఉమన్!