Photo: Twitter.com/@DharDipsita
నిన్నటివరకు ఆ చేతులు చీపురును పట్టుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికురాలిగా పంచాయతీ కార్యాలయంలోని అన్ని గదులను శుభ్రం చేశాయి. అక్కడి ప్రెసిడెంట్ కుర్చీకి పట్టిన దుమ్మును కూడా దులిపాయి. కానీ నేడు అవే చేతులు పెన్ను పట్టుకున్నాయి. ఇప్పటివరకు తను శుభ్రం చేసిన ప్రెసిడెంట్ కుర్చీలోనే కూర్చొని ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించడానికి రడీ అయ్యాయి. పారిశుద్ధ్య కార్మికురాలు ఏంటి? పంచాయతీ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోడమేంటి? అనుకుంటున్నారా?అయితే ఈ స్టోరీ చదవండి.
నిన్న సిటీ మేయర్.. నేడు పంచాయతీ ప్రెసిడెంట్!
మహిళా సాధికారతకు సంబంధించిన విషయాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళ అన్ని విషయాల్లోనూ మెరుగ్గా ఉంది. అక్షరాస్యత మొదలుకుని రాజకీయాల వరకు అన్ని విషయాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు ముందుకెడుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే మగవారికి మించి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇటీవల 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్ పీఠాన్ని అధిష్టించగా... తాజాగా పంచాయతీ ఆఫీసులో పార్ట్ టైం స్వీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ అదే పంచాయతీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతను, మహిళా శక్తిని ఒకేసారి చాటిచెప్పిన ఆ మహిళ పేరు ఆనందవల్లి.
‘వల్లిచేచి’ అంటూ!
కొల్లం జిల్లాలోని పఠాన్‌పురం పంచాయతీ బ్లాకులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పదేళ్లుగా పనిచేస్తోంది ఆనందవల్లి. ఆమె భర్త మోహనన్ ఓ పెయింటర్. సీపీఎం స్థానిక కమిటీ సభ్యుడిగా కూడా పని చేస్తున్నారు. వీరిద్దరికీ మిథున్, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఆనందవల్లి అక్కడి వారందరికీ తలలో నాలుకలా ఉండేది. అందుకే ఆమెను స్థానికంగా ‘వల్లిచేచి’ అని కూడా పిలుస్తారు. దీంతో ప్రజల్లో ఆమెకున్న మంచి పేరుని గమనించిన అధికారిక ఎల్డీఎఫ్ పార్టీ తనను రాజకీయాల్లోకి ఆహ్వానించింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ (ఎం) తరఫున తలవూరు వార్డు తరఫున పోటీ చేసిన ఆనందవల్లి యూడీఎఫ్ అభ్యర్థిపై 654 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ క్రమంలో మొత్తం 13 మంది సభ్యులుండే పఠాన్‌పురం పంచాయతీలో ఎల్డీఎఫ్ ఏడు సీట్లను కైవసం చేసుకోగా, యూడీఎఫ్ ఆరు స్థానాలను గెలుచుకుంది.
పంచాయతీ అధ్యక్షురాలిగా!
పంచాయతీ ప్రెసిడెంట్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎల్డీఎఫ్ తరఫున గెలిచిన ఆనందవల్లికి ఆ పీఠం దక్కింది. ఎల్డీఎఫ్ నుంచి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మరో మహిళ కూడా వార్డు సభ్యురాలిగా విజయం సాధించింది. అయితే ఆనందవల్లికి ప్రజల్లో మంచి పేరు ఉండడం, విజయం సాధించిన తోటి వార్డు సభ్యులు కూడా ఆమెను అధ్యక్షురాలిని చేయాలని కోరుకోవడంతో పార్టీ అధిష్టానం తన వైపే మొగ్గు చూపింది. దీంతో పదేళ్లుగా స్వీపర్‌గా పనిచేసిన అదే పంచాయతీ కార్యాలయంలోనే ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిందీ సూపర్ వుమన్.
మొదట్లో భయపడ్డాను!
2011లో పఠాన్‌పురం పంచాయతీ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరినప్పుడు ఆనందవల్లి జీతం రూ.2 వేలు. ఆ తర్వాత అది మూడువేలకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె నెల జీతం రూ.6 వేలు. ఈ క్రమంలో తన తాత్కాలిక స్వీపర్ పోస్టుకు రాజీనామా చేసిన ఆనందవల్లి ఏకంగా పంచాయతీ పీఠాన్నే అధిష్టించింది.
‘స్వీపర్ పోస్టులో ఉన్న నేను పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికవడం ఎంతో సంతోషంగాను, గర్వంగాను ఉంది. అసలు నేను ఇది ఊహించలేదు. మొదట్లో ఈ పదవిని స్వీకరించడానికి నేను భయపడ్డాను. అయితే పార్టీ పెద్దలు, వార్డు సభ్యులందరూ నాకు అండగా నిలిచారు. కొత్త బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించారు. అందరి సహకారంతో నా పంచాయతీని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఆనందవల్లి.
పార్ట్ టైం స్వీపర్ నుంచి పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆనందవల్లిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘మీరు అందరికీ ఆదర్శం’, ‘కంగ్రాట్స్ కామ్రేడ్’ అంటూ నెటిజన్లు వరుసగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.