Photo: Twitter
అందరమ్మాయిల్లాగే భవిష్యత్తు పైన ఎన్నో కలలు, ఆశయాలతో చదువు పూర్తి చేసిందామె. అదే సమయంలో కన్న తండ్రి కాలం చేయడంతో తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. అయినా ఆ బాధలోంచి తేరుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై సద్గుణవంతుడైన భాగస్వామిని భర్తగా పొందింది. వీరిద్దరి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. దురదృష్టవశాత్తూ పెళ్లైన 40 రోజులకే తన ఐదో తనాన్ని దూరం చేసింది. ఆ సమయంలో ‘నాకు సమస్యల మీద సమస్యలొస్తున్నాయంటే ఆ దేవుడు నన్ను ఓ గొప్ప కార్యంలో భాగం చేయాలనుకుంటున్నాడేమో!’ అనుకుందే తప్ప అధైర్యపడలేదామె. అందుకే దేశ రక్షణలో అమరుడైన తన భర్త ఆశయాన్ని భుజాలపైకెత్తుకుంది. పరీక్షలో పాసై త్వరలోనే సైన్యంలో శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతోంది. ఆమే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌక ప్రమాదంలో అసువులు బాసిన లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి కరుణా సింగ్. తన కలను పక్కన పెట్టి కట్టుకున్న భర్త ఆశయం కోసం కదిలిన ఈ వీర వనిత ధీర గాథ ఆమె మాటల్లోనే..!

Photo: Twitter
2018, జూన్లో ఓ రోజు ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ను తొలిసారి కలిశాను. మా ఇద్దరి ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి. ఒకరికొకరం నచ్చాం.. ఇరువైపుల పెద్దలకూ అన్నీ నచ్చడంతో గతేడాది మార్చి 10న మా వివాహం జరిగింది. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. నచ్చిన వ్యక్తి, అదీ ఎలాంటి భాగస్వామి కావాలని కోరుకున్నానో అలాంటివాడే నా జీవితంలోకి వచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా.
పెళ్లైన 40 రోజులకు..!
పెళ్లికి ముందు నుంచే ఆగ్రాలోని దయాల్బాగ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నా. ధర్మేంద్ర నేవీ ఆఫీసర్. పెళ్లయ్యాక కొన్ని రోజులు ఆనందంగా గడిపాం. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం. ఎన్నెన్నో ఊసులాడుకున్నాం. ఇక ఆ తర్వాత నా భర్త తిరిగి ఉద్యోగంలో చేరే సమయం వచ్చేసింది. ఆ సమయంలో నా మదిలో ఏదో తెలియని గుబులు.. అయినా ఆ భయాన్ని పక్కన పెట్టి ‘నీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తా’ అంటూ ఆయన్ని విధులకు పంపించాను. నా ఉద్యోగంలో నేను బిజీగా మారిపోయా.
సరిగ్గా మా పెళ్లైన 40 వ రోజు నేవీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది.. అందులో ధర్మేంద్ర వీర మరణం పొందారు’ అన్నది ఆ కాల్ సారాంశం. అప్పుడు నేను రత్లాంలోని మా అత్తయ్య వాళ్లింట్లోనే ఉన్నా. ఆ వార్త విన్న క్షణం నా నోట మాట రాలేదు. పెళ్లికి పెట్టుకున్న కాళ్ల పారాణి ఆరకముందే, కట్టుకున్న వాడితో ముద్దూ-ముచ్చట తీరకముందే నా ఐదో తనాన్ని దూరం చేశాడా భగవంతుడు.. దేవుడా! ఏంటి నాకీ పరీక్ష అనుకుంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయా.
భర్త ఆశయమే నా ఊపిరైంది!
చదువు పూర్తి కాగానే నాన్నను కోల్పోయా. పెళ్లయ్యాక ఆ బాధను మర్చిపోయే క్రమంలో నా భర్త కూడా నాకు దూరమయ్యాడు. ఈ బాధలన్నీ జీర్ణించుకోలేక కొన్ని రోజుల పాటు తీవ్ర నిరాశలోనే ఉండిపోయాను. ఆ సమయంలో మా అమ్మ, అత్తయ్య నా వెన్నంటే ఉన్నారు.. నాకు ధైర్యం చెప్పారు.. అప్పుడనిపించింది.. ‘ఆ భగవంతుడు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడంటే నేను నిర్వర్తించాల్సిన గొప్ప బాధ్యత ఇంకేదో ఉంది..’ అని! అది నా భర్త ఆశయమే ఎందుకు కాకూడదు అని ఆలోచించా! దేశ సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అయితే నేవీకి బదులు ఆర్మీలో చేరాలనుకున్నా. ఈ క్రమంలో రత్లాం డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గ్రూప్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ నన్ను మరింతగా ప్రోత్సహించారు.
మొదట వెనుదిరిగినా..!
అయితే సైనిక వితంతువులకు రాత పరీక్ష ఏమీ ఉండదు. నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే మరో ఫ్యామిలీ ఫ్రెండ్ సహకారంతో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యాను. మొదట ఈ సెప్టెంబర్లో ఎస్ఎస్బీ-భోపాల్ నుంచి నాకు ఇంటర్వ్యూ కోసం పిలుపొచ్చింది. కానీ మొదటి రోజే నన్ను ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత అక్టోబర్లో మళ్లీ మౌఖిక పరీక్షకు వెళ్లాను. ఈసారి సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాను. అయితే అప్పటికే నేను అసోసియేట్ ప్రొఫెసర్గా మంచి ఉద్యోగంలో ఉన్నందున.. ‘ఉద్యోగం వదిలి ఆర్మీలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు?’ అని అడిగారు. ‘ఏ దేశ రక్షణలో భాగంగానైతే నా భర్త వీరమరణం పొందాడో.. ఆయన అర్ధాంగిగా తన ఆశయం నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది.. అందుకే దేశమంతా తిరుగుతూ దేశ రక్షణలో భాగమవుదామనుకుంటున్నా..’ అని సమాధానమిచ్చా. అలా ఇంటర్వ్యూలో సక్సెసయ్యా.
అలా చేస్తే ఆయన నాతో ఉన్నట్లే!
వచ్చే ఏడాది జనవరిలో నా మిలిటరీ ట్రైనింగ్ మొదలు కానుంది. పదకొండు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఇది ఎప్పుడెప్పుడు ముగుస్తుందా.. ఎప్పుడెప్పుడు ఆర్మీ యూనిఫాం ధరిద్దామా అన్న ఆతృత నాలో ఉంది. ఇలా నా భర్త ఆశయాన్ని నెరవేర్చడమే కాదు.. దేశ సేవలో భాగంగా ఇండియన్ ఆర్మీ యూనిఫాం ధరిస్తానన్న ఆలోచనే నాకెంతో ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. దేశం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసిన నా భర్త ఆశయాన్ని స్వీకరించానంటే ఆయన ఎప్పుడూ నాతో ఉన్నట్లే.. ఏ లోకంలో ఉన్నా ఆయనే నన్ను గైడ్ చేస్తుంటారు.. సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తారు. జైహింద్!!