Photo: Instagram
నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో కొన్ని కఠినతరమైన పనులు చేయడానికి సంకోచిస్తుంటారు. ఇక ఈ సమయంలో వ్యాయామం మంచిదని చెప్పినా దాని జోలికి వెళ్లని వారూ లేకపోలేదు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు కూడా గర్భిణులు ఏది చేస్తామన్నా ససేమిరా అంటుంటారు. కానీ వీటన్నింటినీ అధిగమించి వ్యాయామాలు చేస్తూ, మారథాన్లలో పాల్గొంటూ నలుగురిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం మహిళలు. అలాంటి వారిలో ఒకరే బెంగళూరుకు చెందిన అంకితా గౌర్. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఆమె తాజాగా టీసీఎస్ వరల్డ్ 10కె రన్లో పాల్గొంది. గంటలోనే పది కిలోమీటర్లు పరుగెత్తి.. గర్భంతో ఉన్న వారికి పరుగు మంచి వ్యాయామమని చాటుతోంది. తొమ్మిదేళ్లుగా పరుగునే ఊపిరిగా మార్చుకున్నానని, ఆ ఉత్సాహమే గర్భంతోనూ తనను పరిగెత్తేలా చేసిందని చెబుతోన్న ఈ న్యూ మామ్ తన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..
గర్భంతో ఉన్న కూతురు కాస్త కఠినమైన వ్యాయామం చేస్తానన్నా, ఏదైనా పబ్లిక్ ఈవెంట్లో పాల్గొంటానన్నా కన్నతల్లి ససేమిరా అనడం చాలామందికి అనుభవమే! తాజాగా జరిగిన టీసీఎస్ వరల్డ్ 10కె మారథాన్‌లో నేను పాల్గొంటానన్నప్పుడు మా అమ్మ కూడా అందరమ్మల్లాగే కాస్త వెనకా ముందు అయింది. అందుకు కారణం.. ప్రస్తుతం నేను ఐదు నెలల గర్భిణిని కావడమే! పరుగు నాకు కొత్త కాదు.. గత తొమ్మిదేళ్లుగా పరుగునే నా ఊపిరిగా భావించా. ఏదైనా కాస్త అనారోగ్యంగా అనిపించినప్పుడు, ఆరోగ్యం సహకరించనప్పుడు తప్ప ఏ ఒక్క రోజూ నేను పరిగెత్తడం ఆపింది లేదు. ఈ క్రమంలో నాకు గ్రేట్ సపోర్టర్‌గా నిలిచింది మా అమ్మే! అలాగే నాన్న, పెళ్లి తర్వాత నా భర్త కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
నిద్ర లేచానంటే అదే నా పని!
మాది బెంగళూరు. నేను వృత్తి రీత్యా ఇంజినీర్ని. మారథాన్లలో పాల్గొనడం ఇది నాకు తొలిసారి కాదు. 2013 నుంచే టీసీఎస్ వరల్డ్ 10కె మారథాన్లలో పాల్గొంటూ వస్తున్నా. వీటిలో పలు పతకాలు కూడా గెలిచాను. అలాగే బెర్లిన్ (మూడుసార్లు), బోస్టన్, న్యూయార్క్‌లలో నిర్వహించిన దాదాపు ఐదారు అంతర్జాతీయ మారథాన్లలోనూ పాల్గొన్నా. నాకు పరిగెత్తడమంటే చాలా ఇష్టం. ఇది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే ఉదయం నిద్ర లేచానంటే నేను చేసే మొదటి పని పరిగెత్తడమే. దీంతో పాటు యాప్ బేస్డ్ మారథాన్లనూ ఎంజాయ్ చేస్తుంటా. మీకు చెప్పనే లేదు కదూ.. నాలో ఉన్న ఈ విద్యను నలుగురికీ పంచుతూ వారినీ మంచి రన్నర్స్‌గా తయారుచేస్తున్నా.
గర్భిణులకు ఇది మంచి వ్యాయామం!
గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడానికి చాలామంది భయపడుతుంటారు. డాక్టర్లు చెప్పినా కొంతమంది వినరు. కానీ ఈ సమయంలో వ్యాయామం మనకు, మన కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పరుగు కూడా అలాంటిదే! గర్భిణిగా ఉన్నప్పుడు పరిగెత్తడం వల్ల మనలో కొత్త ఉత్సాహం జనిస్తుంది. అయితే అందరినీ అలా చేయమని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి వ్యాయామం విషయంలో మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.
రోజుకు ఎనిమిది కిలోమీటర్లు..!
అయితే గతంలో నేను పాల్గొన్న మారథాన్లలో అలుపు లేకుండా పరిగెత్తేదాన్ని. కానీ ఇప్పుడు నేను గర్భిణిని కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ ముందుకు సాగాను. అందుకే ఈసారి పతకం గెలవలేకపోయాను. ఇక ఈ మారథాన్ కోసం గత కొన్ని రోజుల నుంచే నేను రోజుకు 5-8 గంటల పాటు రన్నింగ్, నడక సాధన చేశాను. అది కూడా నెమ్మదిగా, బ్రేక్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేశాను. ఇక ఈ మారథాన్ కోసం నేను నా గైనకాలజిస్ట్ సలహా కూడా తీసుకున్నా. నా ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఢోకా లేదని డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, నా ఫిజియోథెరపిస్ట్ కూడా ఈ విషయంలో నాకు మద్దతుగా ఉండడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా నా పరుగు సాగింది. డాక్టర్ ఓకే చెప్పడంతో అమ్మ కూడా తన భయాన్ని పక్కన పెట్టి నాకు మద్దతు పలికింది. ఏదేమైనా గర్భంతోనూ మారథాన్‌లో పాల్గొనడం ఓ సరికొత్త అనుభూతి!
అయితే ఇందాక చెప్పిన విషయం మీ అందరికీ మరోసారి చెబుతున్నా. గర్భం ధరించిన మహిళలకు పరుగు, నడక, ఇతర వ్యాయామాలు మంచివే! అయినప్పటికీ అవి సాధన చేయాలా? వద్దా? అనేది మాత్రం మీ ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సలహా పైనే ఆధారపడి ఉంటుంది. అంతేకానీ.. ఈ విషయంలో మీ సొంత నిర్ణయం మాత్రం తీసుకోకండి..!