Photos: Instagram
పరువు పేరుతో హత్యలు చేయడం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, లింగ వివక్ష, ప్రసూతి మరణాలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల్ని ఓ గడ్డి పరకలా భావిస్తుంటారక్కడ! ఒకవేళ వీటిని ఎదిరిస్తే వారికి మరణ శాసనం తప్పదు. మహిళల పట్ల ఇంతటి క్రూరమైన వివక్ష ఉంది కాబట్టే పాక్ ఆక్రమిత బలోచిస్థాన్ స్త్రీలకు అసురక్షితమైన ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇలాంటి చోటే పుట్టి పెరిగింది కరీమా బలోచ్. అయితే అందరు మహిళల్లా అణిగిమణిగి ఉండాలనుకోలేదామె. మహిళా హక్కులపై ఉద్యమించింది.. అక్కడి మహిళలు ఎదుర్కొంటోన్న దుస్థితిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. అలాంటి ఉద్యమకారిణి గొంతు నేడు మూగబోయింది. 2016 నుంచి కెనడాలో శరణార్థిగా ఉంటోన్న కరీమా రెండు రోజుల క్రితం హత్యకు గురైంది. అయితే దీని వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహిళలకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదించిన ఈ ఉద్యమకారిణి తన కొన ఊపిరిదాకా అదే పట్టుదలను కొనసాగించడం ఆమె ధైర్యానికి ప్రతీక!
మహిళలకు అసురక్షితమైన ప్రదేశాల జాబితాను తయారుచేస్తే.. అందులో బలోచిస్థాన్ అన్ని దేశాల కంటే ముందుంటుంది. పాకిస్థాన్ కబంధ హస్తాల్లో బందీగా ఉన్న ఈ ప్రాంతంలో పుట్టినప్పటి నుంచే ఆడపిల్లపై ఎన్నో ఆంక్షలు! చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, పాక్ సైన్యం చెప్పుచేతల్లోనే మెలగాలి.. వారు తిట్టినా, కొట్టినా, ఆఖరికి చంపినా నోరు మెదపకూడదు.. ఇక ఇక్కడ స్త్రీలు గర్భం దాల్చడం అంటే మృత్యువును ఆహ్వానించడమే! ఎందుకంటే ఆ తల్లికి తన బిడ్డ బతికి ఉంటుందో లేదో తెలియదు. ఆ బిడ్డకు తల్లి దక్కుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. మహిళలు హఠాత్తుగా మాయమవడం, అలాంటి వారు శవాలుగానే కనిపించడం, ఆమ్లదాడులు, తీవ్ర గాయాల పాలైన అత్యాచార బాధితుల ఆర్తనాదాలు.. ఇలా మహిళలకు దినదిన గండంగా ఉన్న ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగింది కరీమా బలోచ్.
మహిళల గొంతుకైంది!
చిన్నతనం నుంచే తోటి మహిళలపై జరిగే అరాచకాలను, అన్యాయాలను చూస్తూ పెరిగింది కరీమా. ఇవన్నీ తన మనసుపై బలమైన ముద్ర వేశాయి. మహిళగా పుట్టడమే శాపమా? పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు ఎందుకు లేవు? స్త్రీలంటే ఎందుకింత వివక్ష? అన్న ప్రశ్నలు ఆమె మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి. మానవ హక్కుల కార్యకర్తగా, మహిళా హక్కులపై పోరాడే ఉద్యమకారిణిగా ఆమెను మార్చాయి. ఈ క్రమంలోనే ‘బలోచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ - అజద్’కు ఛైర్పర్సన్గా కొత్త అవతారమెత్తింది కరీమా. ఇందులో భాగంగా పాక్ ఉక్కు పిడికిలిలో బందీగా ఉన్న బలోచిస్థాన్కు స్వాతంత్ర్యం కావాలని, మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు దక్కాలంటూ నినదించిందామె. అయితే ఆ సమయంలో పాక్ సైన్యం అజద్ను ఉగ్రవాద సంస్థగా ఆరోపించి నిషేధించింది. ఆ తర్వాత చాలాసార్లు మిలిటరీ దాడుల నుంచి తప్పించుకున్న ఆమె.. 2016లో అక్కడి నుంచి తప్పించుకొని కెనడా వెళ్లిపోయింది. అప్పట్నుంచి శరణార్థిగా అక్కడే నివసిస్తోంది కరీమా.
అన్నా.. మా మొర ఆలకించు!
బలోచ్ ఉద్యమకారుల్ని రక్షించాలని, అక్కడి మహిళల హక్కుల్ని కాపాడాలంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ఇటు అంతర్జాతీయ వేదికలపై, అటు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను ఎప్పటికప్పుడు వెలిబుచ్చే కరీమా.. ఓ సందర్భంలో ప్రధాని మోదీ సహాయం కూడా కోరింది. 2016లో రక్షాబంధన్ రోజున మోదీని ఉద్దేశిస్తూ ఓ సందేశం పంపింది కరీమా. ‘మిమ్మల్ని మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేధం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్ చెల్లెళ్ల గొంతుకగా మీరు మారాలి. మేము ఈ పోరాటాన్ని మాకు మేముగా కొనసాగిస్తాం. కేవలం మీరు మా ఆవేదనను ప్రపంచానికి తెలియజేస్తే చాలు!’ అంటూ రికార్డ్ చేసిన సందేశాన్ని తారేక్ ఫతా అనే కెనడా రచయిత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. అప్పట్లో ఇది పెను సంచలనమే సృష్టించిందని చెప్పచ్చు. అయితే అదే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున బలోచ్ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు మోదీ. ఇది జరిగిన వారం తర్వాత కరీమా సందేశం మోదీకి అందింది.
బెదిరింపులకు తలొగ్గక!
బలోచ్ ఉద్యమకారిణిగా మారి అక్కడి మహిళల దుస్థితిని ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చిన కరీమా.. తన ఉద్యమంలో భాగంగా కెనడాలో స్థిరపడిన పాక్ జనరల్స్ను తీవ్రంగా విమర్శించింది. ఈ క్రమంలో తనను చంపుతామని ఓ వైపు బెదిరింపులు వచ్చినా వాటికి తలొగ్గక తన పోరాటాన్ని కొనసాగించిందీ లేడీ యాక్టివిస్ట్. అయితే ప్రస్తుతం కెనడాలో నివాసముంటోన్న కరీమా అక్కడి టొరంటో నగరానికి సమీపంలో ఇటీవలే హత్యకు గురైంది. ఈ హత్య వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆమె మృతికి నివాళిగా 40 రోజులు సంతాప దినాలు పాటించాలని బలోచ్ నేషనల్ మూమెంట్ పిలుపునిచ్చింది.
తుది శ్వాస వరకూ..!
ఇటీవలే హత్యకు గురైన కరీమా తన తుది శ్వాస వరకూ బలోచ్ హక్కుల కోసమే పోరాటం చేసింది. ఇందుకు ఆమె చివరి ట్వీటే ప్రత్యక్ష సాక్ష్యం. పాక్ సైన్యం తమ వారిని కిడ్నాప్, హత్యలు చేస్తోందని, తీవ్రంగా హింసిస్తోందని.. బలోచ్ ఉద్యమ కారుల్ని రక్షించాలంటూ డిసెంబర్ 14న చివరి ట్వీట్ చేసింది కరీమా. ఇలా శత్రువుల నుంచి ఎన్ని బెదిరింపులు ఎదురైనా తలొగ్గక ధైర్యంగా తన పోరాటాన్ని కొనసాగించింది కాబట్టే అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిలిచిందీ బలోచ్ యాక్టివిస్ట్. ఈ క్రమంలో 2016లో బీబీసీ ప్రచురించిన ‘100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల’ జాబితాలో ఈ లేడీ యాక్టివిస్ట్కు చోటు దక్కింది.