మనదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల గురించి అడిగితే పురుషుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. సంచలనమైన తీర్పులు ఇచ్చిన సందర్భంలో మినహా.. మహిళా న్యాయమూర్తుల గురించి పెద్దగా బయటికి తెలియదు. అయినప్పటికీ తమ అచంచల ప్రతిభాపాటవాలతో.. ఈ రంగంలో కొందరు ఉన్నత స్థానాలకు చేరుకొంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జడ్జిలుగా కొనసాగుతున్నారు. హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదుగుతున్నారు. ఆ కోవకే చెందుతారు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన జస్టిస్ హిమా కోహ్లీ. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళ ఆమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సీనియర్ మహిళా జడ్జి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..
పదోన్నతిపై తెలంగాణకు!
న్యాయ వ్యవస్థ ద్వారా మనుషులకే కాదు... ప్రకృతికి, పర్యావరణానికి కూడా న్యాయం జరగాలంటారు హిమా కోహ్లీ. అందుకే ఓ జడ్జిగా తన విధులను నిర్వర్తిస్తూనే ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్రను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంపై పలు అంతర్జాతీయ వేదికలపై సైతం తన గళాన్ని వినిపిస్తున్నారామె. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఒకేసారి 14 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దిల్లీ హైకోర్టులో సీనియర్ జడ్జి హోదాలో పనిచేస్తోన్న హిమా కోహ్లీ పదోన్నతి పొంది తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రానున్నారు.
వివిధ హోదాల్లో పనిచేస్తూ!
జస్టిస్ హిమా కోహ్లీ 1959, సెప్టెంబర్ 2న దిల్లీలో జన్మించారు. అక్కడి సెయింట్ థామస్ స్కూల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఆమె హిస్టరీలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీ యూనివర్సిటీలోని లా ఫ్యాకల్టీ, క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్బీ కోర్సును చదివారు. 1984లో లా కోర్సును పూర్తిచేసి దిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. 1994-2004 మధ్య కాలంలో దిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2004లో దిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. ఇదే సమయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కమిషన్, దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్లతో పాటు... పలు బ్యాంకులు, ప్రైవేటు సంస్థలకు లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరించారు హిమ.
2006, మే 29న దిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన హిమా కోహ్లీ...ఆ మరుసటి ఏడాదే శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017, ఆగస్టు 8 నుంచి పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్‌లో సభ్యురాలిగా జస్టిస్ హిమా కోహ్లీ కొనసాగుతున్నారు. ఈ ఏడాది మే 20 నుంచి దిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా, అదేవిధంగా ఈ ఏడాది జూన్ 30 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గానూ వ్యవహరిస్తున్నారు.
కరోనా పరీక్షలు పెంచాలని!
కరోనా తొలిరోజుల్లో దేశ రాజధాని దిల్లీ హాట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లు పెంచాలని, ఫలితాలు కూడా ఒకే రోజులో వచ్చేలా చేయాలని జస్టిస్ హిమా కోహ్లీ ఆదేశాలు ఇచ్చారు. ఇక కేసులు, వివాదాల పరిష్కారంలో న్యాయవ్యవస్థతో పాటు ప్రత్యామ్నాయ ఫోరమ్‌గా మధ్యవర్తిత్వాన్ని కూడా ఆమె ప్రోత్సహిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ సీనియర్ జడ్జి.. అందులో న్యాయవ్యవస్థ పాత్రను బాగా ప్రమోట్ చేస్తుంటారు. అదేవిధంగా కుటుంబ వివాదాల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తున్నారీ లేడీ సీనియర్ జడ్జి.