అథ్లెటిక్స్... స్పోర్ట్స్‌లో ఎంతో ఉత్సాహం గల క్రీడాకారులు ఎంచుకునే క్రీడలివి. ఎంతో శారీరక శ్రమతో కూడిన ఈ పోటీల్లో సత్తా చాటాలంటే అంత సులభమేమీ కాదు. ఏళ్ల కొద్దీ సహనంతో శ్రమించాలి. వేటినైనా త్యాగం చేయాలి. మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా సహకరించాలి. అలాంటిది తాను కేవలం ఒకే కిడ్నీతోనే క్రీడా మైదానంలో అడుగుపెట్టానంటోంది మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్. దీంతో పాటు అలర్జీ, కాలినొప్పి తదితర అనారోగ్య సమస్యలు వేధించినా దేశానికి అపురూప విజయాలు అందించానంటోంది. కొవిడ్ కారణంగా క్రీడా టోర్నీలు లేక అథ్లెట్లందరూ నిరాశ పడుతున్న వేళ... తన జీవితంలోని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటూ వారిలో స్ఫూర్తి నింపుతోందీ మాజీ ఒలింపియన్.
అంజూ బాబీ జార్జ్....కేరళకు చెందిన ఈ మాజీ లాంగ్‌జంపర్ 2003లో ప్యారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్యం గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో 6.75 మీటర్లు దూకి రజతం సొంతం చేసుకుంది. ఇండియా నుంచి అంజూ మాత్రమే ఈ ఘనత సాధించడం విశేషం. అయితే స్వర్ణం గెలిచిన రష్యా క్రీడాకారిణి డోపీగా తేలడంతో 2014లో అంజూ రజత పతకం..స్వర్ణంగా మారింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (6.83)తో ఆరోస్థానంలో నిలిచింది. అయితే అమెరికన్ అథ్లెట్ మరియన్ జోన్స్ డోపింగ్‌లో పట్టుబడడంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. ఇవే కాకుండా 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2006 దోహా ఆసియా గేమ్స్‌లో రజతం, 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ క్రీడల్లో ఓ కాంస్యం నెగ్గింది.
ఒక్క కిడ్నీతోనే సాధించాను!
ఇలా లాంగ్‌జంప్‌లో ఎన్నో అపురూప విజయాలు, పతకాలు సాధిస్తూ భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది అంజు.
అయితే ఈ విజయాలన్నీ ఒక్క కిడ్నీతోనే సాధించానంటోంది మాజీ లాంగ్‌జంపర్. ఎనిమిదేళ్ల క్రితం తన అథ్లెటిక్స్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన ఆమె కొవిడ్ ప్రభావంతో నిరాశలో ఉన్న క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలోని కొన్ని ఆశ్చర్యకర విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
‘మీరు నమ్మినా... నమ్మకపోయినా... ఒక్క కిడ్నీతో ప్రపంచంలో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్న అథ్లెట్లలో నేనూ ఒక ప్లేయర్‌ని. ఇది నా అదృష్టమనే చెప్పుకోవాలి. నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్ తీసుకుంటే అలర్జీ వచ్చేది. అంతేకాదు ఒక కాలి భాగమంతా తిమ్మిరిగా ఉండి జంప్ చేసే సమయంలో తీవ్ర అసౌకర్యంగా ఉండేది. ఇలా ఎన్నో ఇబ్బందులున్నా అద్భుతమైన విజయాలు అందుకున్నా. అందుకు కారణం కోచ్ చేసిన మ్యాజిక్ అని చెప్పాలా? లేదా అతని ట్యాలెంట్‌కు నిదర్శనం అని ఒప్పుకోవాలా?’ అని ట్విట్టర్లో రాసుకొచ్చిందీ మాజీ ఒలింపియన్.
అపస్మారక స్థితిలోకి వెళ్లాను!
ట్రిపుల్ జంప్‌లో నేషనల్ ఛాంపియన్ అయిన రాబర్ట్ బాబీ జార్జ్‌ను వివాహం చేసుకుంది అంజు. కోచ్‌గా అతనికి చాలా అనుభవం ఉంది. ఈ దంపతులకు అరోన్ అనే కుమారుడు, ఆండ్రియా అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో తన భర్త సహాయంతోనే అథ్లెట్‌గా ఎదిగానంటోంది అంజు.
‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎన్నో సవాళ్లు, సమస్యలు దాటి ఈ విజయాలను సాధించాను. నాకు పుట్టుక నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలున్నాయి. రక్తంలో యూరియా లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో నిత్యం కీళ్లనొప్పులతో బాధపడ్డాను. పెయిన్ కిల్లర్స్ సహాయంతో ఈ సమస్యలను అధిగమిద్దామనుకున్నాను. కానీ ఈ మందులు నాకు మంచి చేయకపోగా నా ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. పెయిన్ కిల్లర్స్ ప్రభావంతో చాలాసార్లు అపస్మారక స్థితికి గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. నాకే కాదు మా కుటుంబంలో చాలామందికి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సమస్య ఎదురైంది’..
మా ఆయన కిడ్నీ ఇస్తానన్నాడు!
‘2001లో కొన్ని కారణాల వల్ల బెంగళూరులో హెల్త్ చెకప్‌కు వెళ్లినప్పుడు నాకు ఒక కిడ్నీయే పని చేస్తోందని తెలిసింది. దీంతో నేను షాకయ్యాను. నా క్రీడా కెరీర్‌పై సందిగ్ధంలో పడ్డాను. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకానంత వరకు క్రీడాపోటీల్లో పాల్గొనవచ్చని వైద్యులు చెప్పడం కొంచెం ఉపశమనం కలిగించింది. ఆ సమయంలో నా భర్త నాకు అండగా నిలిచాడు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే తన కిడ్నీ ఇస్తానన్నాడు. ఇక 2003లో ప్యారిస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నేను కాంస్య పతకం నెగ్గాను. అయితే సరిగ్గా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు కిడ్నీ సమస్య మళ్లీ తిరగబెట్టింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. వైద్యులు ఆరు నెలలు విశ్రాంతి అవసరమన్నారు. కానీ నేను పోటీల్లో పాల్గొనడానికే ప్రాధాన్యమిచ్చాను. అనుకున్నట్లే పతకం సాధించాను. నా ఆరోగ్య సమస్యల గురించి ఎన్నోసార్లు బయటకు చెబుదామనుకున్నాను. కానీ ఎందుకో భయమేసింది. కానీ నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. అందుకే ఇలా ధైర్యంగా అందరి ముందుకు వచ్చాను. నా అనుభవాలను పంచుకోవడం ద్వారా యువ అథ్లెట్లలో స్ఫూర్తి కలిగిస్తాననే నమ్మకంతో ఉన్నాను’ అని చెప్పుకొచ్చిందీ మాజీ ఒలింపియన్.
భారతదేశ ప్రతిష్ఠ పెంచావు!
అంజు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రిటీలతో పాటు పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, ధైర్య సాహసాలు, దృఢ సంకల్పంతో భారతదేశ ప్రతిష్ఠ పెంచావు’ అని ప్రశంసించారు.