అనాదిగా మన సమాజంలో మహిళలపై ఎన్నో కట్టుబాట్లు, మూసధోరణులు వేళ్లూనుకుపోయాయి. ‘స్త్రీలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు..’ అంటూ ప్రతి విషయంలోనూ వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేస్తుంటారు. ఇక మరణించిన వారి అంతిమ సంస్కారాల్లో పాల్గొనడం.. తలకొరివి పెట్టడం.. వంటి పనులు చేస్తే అదో పెద్ద దోషంగా భావిస్తుంటారు. ఇలాంటి కట్టుబాట్లే మన పొరుగు దేశం నేపాల్లోనూ ఉన్నాయి. కానీ ఇలాంటి కట్టుబాట్లను కాదంటున్నారు అక్కడి మహిళా జవాన్లు. కరోనాతో చనిపోయిన వారి మృత దేహాలను ఆస్పత్రి నుంచి శ్మశానానికి తరలించి అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించే వారికి అప్పగిస్తున్నారు. వారిని తమ కుటుంబ సభ్యులుగా, రక్త సంబంధీకులుగా భావించి సాదరంగా కాటికి సాగనంపుతూ నిజమైన కరోనా యోధులుగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి అంతిమ ఘడియల్లో ‘ఆ నలుగురు'గా నిలుస్తున్న మహిళామణుల గురించి తెలుసుకుందాం రండి..
కరోనా మహమ్మారి ఆరోగ్యాన్నే కాదు.. ఆప్యాయతల్నీ దూరం చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారి పట్ల తమ కుటుంబ సభ్యులు కూడా వివక్ష చూపేలా చేస్తోంది. కారణం.. తామెక్కడ కరోనా బారిన పడతామేమోనన్న భయం! అందుకే ఈ వైరస్ సోకి మరణించిన తమ కుటుంబ సభ్యుల అంతిమ సంస్కారాలను చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. నేపాల్లోనూ ఇలాంటి దయనీయ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో - కరోనాతో మరణించిన వారి మృత దేహాలను ఆస్పత్రి నుంచి శ్మశానానికి తరలించే బాధ్యతను అక్కడి సైన్యమే చేపట్టింది. ఏళ్ల నాటి కట్టుబాట్లను కాదని ఈ కార్యక్రమంలో మహిళా జవాన్లు కూడా పాలుపంచుకోవడం విశేషం.
Nepal Army spokesman Shantosh B. Poudyal said the 95,000-strong force was putting women soldiers in new roles, part of a programme to empower them.
Posted by Gulf-Times on Tuesday, December 1, 2020
పీపీఈ కిట్లు ధరించి..!
హిందూ జనాభా ఎక్కువగా ఉండే నేపాల్లోనూ మహిళలపై పలు కట్టుబాట్లు ఉన్నాయి. మృత దేహాలను తాకకూడదని, అంతిమ సంస్కారాల్లో పాల్గొనకూడదన్నది ఇందులో ఒకటి. అయితే కరోనాతో మరణించి తమ కుటుంబ సభ్యుల కడసారి చూపుకి కూడా నోచుకోని అభాగ్యులకు అన్నీ తామే అయి అండగా ఉంటున్నారు అక్కడి మహిళా జవాన్లు. ఈ క్రమంలో కరోనాతో మరణించిన వారి మృత దేహాలను ఆస్పత్రి నుంచి అక్కడికి దగ్గర్లోని శ్మశాన వాటికలకు తరలించి, అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించే వారికి స్వయంగా అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో తాము వైరస్ బారిన పడకుండా పీపీఈ కిట్లు ధరించడం, ఆపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం.. వంటివి కూడా చేస్తున్నారీ కొవిడ్ వారియర్స్.
కట్టుబాట్లను కాదని..
నిజానికి ఇలా కట్టుబాట్లను కాదని ముందుకెళ్తే ఏ కుటుంబమూ అందుకు ఒప్పుకోదు. అలాగే తాము ఇలాంటి పని చేస్తామని చెబితే తమ కుటుంబాలూ తమకు అడ్డు చెప్పాయంటున్నారు ఈ సైనిక మహిళలు. ‘సాధారణంగా పురుషులు మాత్రమే చేసే ఇలాంటి కష్టమైన పనులను జవాన్లుగా విధి నిర్వహణలో భాగంగా మేమూ చేస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. రోజురోజుకీ సమాజంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మేము ఎంచుకున్న ఈ పనికి మా ఇంట్లో వాళ్ల నుంచి విముఖత వ్యక్తమైంది. అయినా ఈ పని ప్రారంభించినప్పటి నుంచే మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. కానీ స్నేహితులు మాత్రం మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. మీరెంతో మంచి పని చేస్తున్నారంటూ మాకు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాదు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు కూడా అందిస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది..’ అంటున్నారీ సోల్జర్స్. మహిళా సాధికారతలో భాగంగా గత కొంత కాలంగా అక్కడి సైన్యంలో మహిళలకు విభిన్న పాత్రలు పోషించే అవకాశం కల్పించడం గమనార్హం.
మహిళలుగా సమాజం చేయకూడదంటోన్న పనిచేస్తూ.. కట్టుబాట్లను అధిగమించడమే కాదు.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో నిజమైన కరోనా యోధులుగా అందరి మన్ననలు అందుకుంటున్నారీ మహిళా జవాన్లు. మరి, ‘ఆ నలుగురి’కి మనమూ సెల్యూట్ చేద్దాం..!