Photo Credit: Shiv Nadar Foundation
రంగమేదైనా మహిళలు తమ పూర్తి స్థాయి ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అందులో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రత్యేకించి వ్యాపార రంగంలో తమదైన మెలకులను ప్రదర్శిస్తున్నారు కొందరు అతివలు. ప్రతికూల పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొని గ్రేట్ బిజినెస్ వుమన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తూ అత్యంత సంపన్నమైన మహిళలుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత సంపన్న మహిళలందరినీ ఒక చోట చేర్చుతూ కోటక్ వెల్త్-హురన్ ఇండియా సంయుక్తంగా ఓ జాబితా రూపొందించింది. ‘కోటక్ వెల్త్ హురున్-లీడింగ్ వెల్దీ వుమెన్ 2020’ పేరుతో మొత్తం 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో హెచ్‌సీఎల్ ఛైర్పర్సన్ రోష్నీ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ!
ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల సంపదను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. నివేదిక రూపొందించేటప్పుడు వ్యాపారవేత్తలతో పాటు వృత్తి నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ‘మన దేశంలో సంపద సృష్టికి సంబంధించి గత రెండు దశాబ్దాల్లో మహిళల పాత్ర ఎంతో విస్తృతమైంది. అలా 2020 కోటక్ వెల్త్- హురున్ ఇండియా సంపన్న మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. ఎంతోమంది మహిళలు ఈ జాబితాను చూసి స్ఫూర్తి పొందుతారు. వారు కూడా మరింతగా ఎదగడానికి, సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తారు’ అని ఈ జాబితా రూపకల్పనలో పాలుపంచుకున్న వారు చెప్పుకొచ్చారు. మరి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కొంతమంది మహిళామణులెవరో తెలుసుకుందాం రండి.
రోష్నీ నాడార్
కొన్ని నెలల క్రితమే తన తండ్రి శివ్‌నాడార్ నుంచి హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు రోష్నీ నాడార్. టెక్నాలజీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తోన్న ఆమె రూ.54, 850 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. కెరీర్ ప్రారంభంలో లండన్‌లోని స్కై న్యూస్ ఛానల్, సీఎన్‌బీసీ, సీఎన్ఎన్ తదితర ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లలో న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారామె. ఆ తర్వాత హెచ్‌సీఎల్‌లో ఓ సాధారణ ఉద్యోగినిలా చేరి ఏడాదిలోనే సీఈఓ/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జులైలో కంపెనీ ఛైర్‌పర్సన్‌గా పూర్తిస్థాయి పగ్గాలు స్వీకరించారు.
కిరణ్ మజుందార్‌షా
భారత్‌లో బయో టెక్నాలజీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కిరణ్ మజుందార్‌షా. 70 దశకంలో చిన్న సంస్థగా ప్రారంభమైన బయోకాన్ నేడు భారత్‌లోనే అతి పెద్ద బయో ఫార్మా కంపెనీగా రూపుదిద్దుకుందంటే.. అందుకు కిరణ్ వ్యాపార దక్షత, పట్టుదలే కారణం. ప్రస్తుతం ఆ సంస్థ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె రూ.36,600 కోట్లతో ఈ జాబితాలో రెండో స్థానం సొంతం చేసుకున్నారు.
లీనా గాంధీ తివారీ
ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ USV ఛైర్‌పర్సన్‌గా ఉన్న లీనా గాంధీ తివారీ రూ.21, 340 కోట్లతో ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నారు. డయాబెటిక్, కార్డియోవాస్క్యులర్ సమస్యలకు సంబంధించి ఈ కంపెనీ తయారుచేస్తున్న మెడిసిన్స్కు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది.
నీలిమా మోటపర్తి
దివీస్ ల్యాబొరేటరీస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నీలిమా మోటపర్తి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. రూ. 18,620 కోట్లతో ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్లానింగ్ అండ్ ఫైనాన్సింగ్‌లో ఎంతో అనుభవమున్న ఆమె 2012లో చీఫ్ కంట్రోలర్‌గా దివీస్ ల్యాబొరేటరీస్ లో అడుగుపెట్టారు.
రాధా వెంబు
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ‘జోహో’లో అత్యధిక శాతం వాటాలు కలిగి ఉన్న రాధా వెంబు ఈ జాబితాలో ఐదో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.11, 590 కోట్ల సంపద ఉందని కోటక్ వెల్త్ - హురున్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె 1997లో ‘జోహా’ కంపెనీలో జాయిన్ అయ్యారు.
వీరితో పాటు అరిస్టా క్లౌడ్ నెట్వర్క్స్ కంపెనీ సీఈవో జయశ్రీ ఉల్లాల్(రూ.10,220 కోట్లు), హీరో ఫిన్ కార్ప్ ఎండీ రేణుముంజల్ (రూ.8,690 కోట్లు), అలెంబిక్ ఫార్మా కంపెనీ సీఈవో మల్లిక చిరాయు అమిన్ (రూ.7, 570 కోట్లు), థెర్మాక్స్ కంపెనీ ఛైర్ పర్సన్ మెహెర్ పుదుంజీ, అను అఘా (రూ.5, 850 కోట్లు), నైకా సీఈవో ఫల్గుణీ నాయర్ (రూ.5, 410 కోట్లు) టాప్-10లో నిలిచారు.
‘తెలుగు’ మహిళల సత్తా!
కోటక్ ఇండియా- హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. అందులో 10 మంది హైదరాబాద్‌కు చెందిన వారే కావడం విశేషం. దివీస్ ల్యాబొరేటరీస్ డైరెక్టర్ నీలిమా మోటపర్తి రూ.18, 620 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. మరి ఆమెతో పాటు ఈ జాబితాలో స్థానం పొందిన తెలుగు మహిళలెవరంటే...

మహిమా దాట్ల
సంస్థ: బయోలాజికల్ ఇ.లిమిటెడ్
సంపద: రూ.4, 100 కోట్లు
శోభనా కామినేని
సంస్థ: అపోలో హాస్పిటల్స్
సంపద: రూ.1470 కోట్లు
సంగీతా రెడ్డి
సంస్థ: అపోలో హాస్పిటల్స్
సంపద: 1400 కోట్లు
వనజాదేవి
సంస్థ: కావేరీ సీడ్ కంపెనీ
సంపద: రూ.850 కోట్లు
పద్మజా గంగిరెడ్డి
సంస్థ : స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్
సంపద: 690 కోట్లు
నవీనా నెక్కంటి
సంస్థ : దేవీ సీ ఫుడ్స్
సంపద: రూ.640 కోట్లు
రమాదేవి
సంస్థ : దేవీ సీ ఫుడ్స్
సంపద : రూ.640 కోట్లు
స్వర్ణలత గాలివీటి
సంస్థ: పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్
సంపద : రూ.580 కోట్లు
శాలినీ భూపాల్-ఇందిరా కృష్ణా రెడ్డి
సంస్థ: తాజ్ జీవీకే హోటల్స్
సంపద: రూ.490 కోట్లు
ఉమాదేవి చిగురుపాటి
సంస్థ: గ్రాన్యూల్స్ ఇండియా
సంపద: రూ.420 కోట్లు
నారా భువనేశ్వరి
సంస్థ: హెరిటేజ్ ఫుడ్స్
సంపద: రూ.400 కోట్లు
అంజనా రెడ్డి
సంస్థ: యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్
సంపద: రూ.300 కోట్లు