Photo: Instagram
అమ్మతనం.. ఈ లోకంలో అన్నింటికంటే అమూల్యమైనది. స్వయంగా అనుభవిస్తే తప్ప అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఆస్వాదించలేం. అంతేకాదు.. బాధ్యత, ఓపిక, మనల్ని మనం ప్రేమించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్పుతుందీ అద్భుతమైన భావన. ఇలాగే అమ్మతనం తననీ ఓ మంచి మనిషిని చేసిందంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చిన ఈ సూపర్ మామ్.. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఫిట్‌గా మారి ఈ ఏడాది కోర్టులోకి అడుగుపెట్టింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తల్లయ్యాకా మహిళలు తమ కెరీర్లో దూసుకుపోగల సమర్థులు అని నిరూపించింది. ఇలా తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీకి అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్ఫూర్తి అంటూ తాజాగా ఓ సుదీర్ఘ లేఖ రాసింది సానియా. అమ్మతనం తనకు అందించిన అనుభవాలు, ప్రసవానంతరం బరువు తగ్గడం, సెరెనా తనలో ప్రేరణ నింపిన విధానం, వర్క్-లైఫ్ బ్యాలన్స్.. ఇలా ఎన్నెన్నో విషయాలు రంగరించి రాసిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరలవడమే కాదు.. ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది.
అమ్మయ్యాక అటు కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే.. ఇటు కెరీర్‌నూ కొనసాగిస్తోన్న మహిళామణులెందరో ఉన్నారు. నిజానికి అలా వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేయడం చాలా కష్టమంటోంది సానియా. ప్రసవానంతరం ఒక దశలో తాను తిరిగి కెరీర్‌ని కొనసాగిస్తానో, లేదోనన్న సందిగ్ధంలో పడిపోయానని, ఆటపై ఉన్న మక్కువే తనను మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టేలా చేసిందంటోంది. అమ్మతనం, ప్రసవానంతర ఫిట్నెస్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు ప్రస్తావించిన ఈ టెన్నిస్ మామ్.. మరోసారి తన మనసులోని భావోద్వేగాలను లేఖ రూపంలో అక్షరీకరించింది. దాని సారాంశమే ఇది!
ఆమే నాకు స్ఫూర్తి!
‘ప్రియమైన అమ్మలందరికీ,
మహిళలు అటు అమ్మగా బాధ్యతల్ని స్వీకరించడం, ఇటు తమ కెరీర్ లక్ష్యాలను నెరవేర్చుకోవడం గురించి మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడుకొనే ఉంటాం. ఇదే విషయం గురించి మరోసారి నా అనుభవాలు మీ అందరితో పంచుకోవడానికే ఇప్పుడిలా లేఖ ద్వారా మీ అందరి ముందుకొచ్చా. ముఖ్యంగా నేను ఈ లేఖ రాయడానికి సెరెనా విలియమ్స్, అమ్మయ్యాక ఆమె సాధించిన విజయాలే నాకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇలా ఇటు కుటుంబాన్ని, అటు కెరీర్‌ని బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతోన్న తల్లులందరికీ నా ఈ మాటల్ని అంకితం చేస్తున్నా.
మహిళలంటే వంటింటికే పరిమితం కావాలన్న మూసధోరణులు మన సమాజంలో ఉన్నాయి. అయినా వాటన్నింటినీ దాటుకొని తాము కన్న కలల్ని, లక్ష్యాల్ని నెరవేర్చుకునే వారిని ఈ సమాజం ఆశ్చర్యంగా చూస్తోంది. ఇక ఆటల విషయానికొస్తే.. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ‘తమకో కూతురుంది.. ఆమెను తన అభిరుచులకు తగ్గట్లుగా ఒక గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దాల’న్న ఆలోచన చాలామందిలో రావట్లేదు. ఇదిలా ఉంటే.. గర్భం ధరించాక చాలామంది మహిళల్లో.. ‘తల్లయ్యాక తాను కెరీర్‌ని కొనసాగించాలా? వద్దా?’ అనే ఒక రకమైన అనిశ్చితి కనిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ విషయంలో చాలా మార్పులొస్తున్నాయని చెప్పచ్చు. కొంతమంది టెన్నిస్ క్రీడాకారిణులు అమ్మయ్యాక కూడా తమ ఆటలో రాణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో నేనూ ఉన్నానని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. ఈ విషయంలో సెరెనా విలియమ్స్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. ‘బీయింగ్ సెరెనా’ డాక్యుమెంటరీ చూశాక.. ఆమె వ్యక్తిత్వం, పోరాడే తత్వం, ఆటపై తనకున్న తపన, విజయం సాధించాలన్న ఆమె సంకల్పం, వర్క్-లైఫ్ బ్యాలన్స్.. ఇవన్నీ నాలో స్ఫూర్తి నింపాయి. ఇలా ఓవైపు తన కెరీర్లో దూసుకుపోతూనే అమ్మగానూ సక్సెసైంది సెరెనా.
అమ్మతనంలోని కమ్మదనం అదే!
ఇలాంటి అమ్మతనాన్ని నేను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా. నిజానికి దీని గురించి చెప్పడం కంటే అనుభవిస్తేనే ఇందులోని మాధుర్యం పూర్తిగా మనకు అవగతమవుతుంది. ఈ దశ మనలో చాలా మార్పుల్ని తీసుకొస్తుంది. మనల్ని మనం గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, మన శరీరాన్ని మనం ఆరాధించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలాంటివన్నీ ఇజాన్ పుట్టాకే నాకు అర్థమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మతనం నన్ను మరింత మంచి మనిషిగా మార్చింది.
అయితే ఇలా అమ్మయ్యాక పెరిగిన బరువు తిరిగి తగ్గడం, తిరిగి పూర్వస్థితికి రావడమంటే సవాలుతో కూడుకున్నదే! ఎందుకంటే గర్భం ధరించాక, ప్రసవానంతరం మన శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో చెప్పలేం. నేను నా ప్రెగ్నెన్సీ సమయంలో 23 కిలోలు పెరిగాను. ఆ సమయంలో నేను మళ్లీ ఫిట్‌గా మారతానని, టెన్నిస్ కోర్టులోకి అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ ఎంతో కష్టపడి తిరిగి పూర్వ స్థితికి చేరుకున్నా. ఈ క్రమంలో ఎన్నో తీవ్ర కసరత్తులు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ 26 కిలోలు తగ్గా. ఇదంతా ఆటపై నాకున్న మక్కువతోనే సాధ్యమైందని కచ్చితంగా చెప్పగలను.
ఆత్మవిశ్వాసం నింపిన విజయం!
ఇలా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం హోబర్ట్ ఇంటర్నేషనల్ డబుల్స్ టైటిల్ గెలుచుకోవడంతో దక్కింది. ఆ క్షణం నా మనసంతా ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా రాణించగలనని నన్ను నేను మానసికంగా సంసిద్ధం చేసుకునేందుకు దోహదం చేసింది. అయితే ఇలా మనం ముందుకెళ్లే క్రమంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. అటు మన వృత్తిని, ఇటు కుటుంబాన్ని సమానంగా ప్రేమించడం వల్ల ఆ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే ఓర్పు మనకు అలవడుతుంది. తద్వారా మహిళలుగా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇదే విషయాన్ని రుజువు చేసింది సెరెనా. టెన్నిస్ కోర్టు లోపల, వెలుపల ఆమె ప్రదర్శించిన శక్తిసామర్థ్యాలు మనందరికీ స్ఫూర్తిదాయకం! కష్టపడే తత్వం, తపన ఉంటే అమ్మయ్యాక కూడా కెరీర్లో దూసుకుపోవచ్చని ఈ ప్రపంచానికి చాటి చెప్పిందామె.
ఇట్లు,
మీ సానియా.
ఇలా సానియా రాసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత, సాక్షి ధోని, దియా మీర్జా, మహిరా ఖాన్, నీతీ మోహన్.. తదితర సెలబ్రిటీలు స్పందిస్తూ ‘సానియా.. నువ్వు నిజమైన ఛాంపియన్వి!’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరితో పాటు నెటిజన్లూ ఈ టెన్నిస్ మామ్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.