ప్రపంచాభివృద్ధిలో పలువురు మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అపురూప విజయాలు సాధిస్తూ...తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మార్గంలో మరింతమంది అడుగులు వేసేలా స్ఫూర్తినిస్తున్నారు. ఈక్రమంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తోన్న మహిళల్లో వందమందిని ఎంపిక చేసి ఏటా ఓ జాబితాను విడుదల చేస్తోంది బీబీసీ. అలా ఈ ఏడాది కూడా వివిధ రంగాల్లో తమదైన రీతిలో దూసుకుపోతోన్న 100 మంది అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీలురైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో నలుగురు భారతీయ నారీమణులు చోటు దక్కించుకోవడం విశేషం.
వారి స్ఫూర్తికి సలామ్ కొడుతూ..!
బీబీసీ 2013 నుంచి ఏటా ఆయా రంగాల్లో సత్తా చాటుతూ, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి ఓ జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా వారు సాధించిన విజయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ‘ప్రపంచ గతిని మార్చిన మహిళలు’ అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. గత 12 నెలల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, తమ పనులతో ఇతరులను విస్తృతంగా ప్రభావితం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను గుర్తించి ఈ జాబితాను రూపొందించింది బీబీసీ. ఫిన్‌ల్యాండ్ ప్రధాని సనామారిన్, అవతార్-మార్వెల్ చిత్రాల నటి మిషెల్లీ యేవో, కరోనాను అరికట్టేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైరస్ వ్యా్క్సిన్ పరిశోధక బృందానికి నాయకత్వం వహిస్తోన్న సారా గిల్బర్ట్...తదితర ప్రముఖులు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈ అసాధారణ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఇతరుల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈక్రమంలో అలాంటి వారికి నివాళి అర్పిస్తూ 100 మంది మహిళా మణుల జాబితాలో మొదటి స్థానాన్ని ‘Unsung Hero’ పేరుతో ఖాళీగా ఉంచారు. ఇక ఈ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు సైతం చోటు దక్కించుకున్నారు.
బిల్కిస్ బానో
గత ఏడాది భారత ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన శాంతియుత పోరాటంలో పాల్గొన్నారు 82 ఏళ్ల బిల్కిస్ బానో. డిసెంబర్ నుంచి మార్చి వరకు వంద రోజులకు పైగా జరిగిన ఈ పోరాటంలో చివరి రోజు వరకు తన పోరాట స్ఫూర్తిని చాటారీ ఓల్డ్ వుమన్. గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా ఆమె చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటల కారణంగా దేశంలో చాలా చోట్ల షహీన్‌బాగ్ తరహా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ‘షహీన్‌బాగ్ దాదీ’ అని అందరూ ముద్దుగా పిలుచుకునే బానో చూపించిన తెగువని ప్రశంసిస్తూ ప్రఖ్యాత ‘టైమ్’ పత్రిక ముఖచిత్రంపై ఆమె ఫొటోని ముద్రించడం విశేషం.
మానసీ జోషి!
ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఒక చిన్న గడ్డి పరకని తన ప్రతిభతో నిరూపించింది పారా అథ్లెట్ మానసీ జోషి. ఓ రోడ్డు ప్రమాదంలో ఎడమకాలిని కోల్పోయినా కృత్రిమ కాలుతోనే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మొదలు పెట్టిందీ యంగ్ సెన్సేషన్. పీవీ సింధులాగే పుల్లెల గోపీచంద్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న ఆమె అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. ఇక గతేడాది స్విట్జర్లాండ్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్‌లో పసిడి పండించి మువ్వెన్నెల జెండా మురిసిపోయేలా చేసింది మానసి. ఈక్రమంలో ఈ యువ బ్యాడ్మింటన్ ప్లేయర్ పట్టుదల, ఆత్మవిశ్వాసాలను భవిష్యత్ తరాలు కూడా అందిపుచ్చుకోవాలంటూ బార్బీ సంస్థ మానసి బార్బీ బొమ్మను విడుదల చేయడం విశేషం. అంతకుముందు టైమ్ పత్రిక ముఖచిత్రంపై కూడా దర్శనమిచ్చిందీ టీనేజ్ సెన్సేషన్.
రిధిమా పాండే!
‘ఇండియన్ గ్రెటా థన్‌బెర్గ్’గా గుర్తింపు పొందిన 11 ఏళ్ల రిధిమా పాండే చిన్న వయసు నుంచే పర్యావరణ సమస్యలపై పోరాటం చేస్తోంది. ఈక్రమంలో 2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదలకు భారత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లీగల్ కేసు దాఖలు చేసిందీ నేచర్ గర్ల్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో కోరింది రిధిమ. గత ఏడాది గ్రెటా థన్‌బెర్గ్, ఇతర బాలలతో కలిసి పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ఐదు దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో కేసు కూడా వేసిందీ లిటిల్ నేచర్ లవర్.
ఇసైవణి
గానా... చెన్నైలోని మురికి వాడల్లో పాడుకునే ఈ పాటలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదట్లో కేవలం చావులకు మాత్రమే పాడే ఈ పాటలు ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ పొందాయి. అయితే ఇందులో పురుషుల స్వరాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటి గానా పాటల ప్రపంచంలో పురుషులకు దీటుగా నిలిచింది చెన్నైకి చెందిన ఇసైవణి. సంప్రదాయపు అడ్డుగోడలని తొలగిస్తూ, అద్భుతమైన ప్రదర్శనలిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ‘2020లో ప్రపంచం చాలా మారిపోయింది. అయితే మహిళలకు మాత్రం ప్రపంచం రోజూ మారుతూనే ఉంది. మహిళలు సిద్ధాంతాలను మారుస్తున్నారు. పురుషాధిక్య ప్రపంచాన్ని మారుస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇది నిరాటంకంగా కొనసాగుతుంది’ అంటూ తనలాంటి వారికి స్ఫూర్తినిస్తోందీ ట్యాలెంటెడ్ సింగర్.