హైదరాబాద్, దిల్లీ, ముంబై... లాంటి మహా నగరాలను ఒకసారి గమనిస్తే వేలాది మంది వీధి బాలలు రోడ్డుపై కనిపిస్తుంటారు. రోడ్డుపై వెళ్లే వారిని డబ్బులు యాచిస్తూ పొట్ట నింపుకొనే ఆ పిల్లలను చూస్తే చాలామందికి జాలి వేయకమానదు. అందులో కొందరు అనాథ పిల్లలున్నప్పటికీ.. తెలిసీ తెలియని వయసులో క్షణికావేశంతోనూ, కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారే ఎక్కువ! ఈక్రమంలో అలా తప్పిపోయిన చిన్నారులు, బాలలను తిరిగి వారి ఇంటికి చేర్చుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్. విధి నిర్వహణలో భాగంగా పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం నింపుతున్నారామె. ఇలా తాను చేస్తోన్న మంచి పనితో అటు అందరి మన్ననలు అందుకుంటూనే.. ఇటు తాజాగా అరుదైన పదోన్నతి కూడా పొందారు. మరి, ఆ మహిళా కాప్ ఎవరు? తప్పిపోయిన పిల్లల్ని ఎలా వెతికి పట్టుకొని వారి ఇంటికి చేర్చుతున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం రండి..
3నెలల్లో 76 మంది చిన్నారులు!
తప్పిపోయిన చిన్నారులను తల్లి ఒడికి చేర్చే ఉద్దేశంతో ఆగస్టులో దిల్లీ పోలీసు శాఖ ఓ కొత్త విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 50 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను 12నెలల వ్యవధిలో వెతికి పట్టుకొని వారిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే పోలీసులకు అవుట్ టర్న్ ప్రమోషన్లు(సీనియార్టీతో సంబంధం లేకుండా) ఇవ్వడంతో పాటు ప్రోత్సాహక పురస్కారాలు ప్రదానం చేస్తోంది. ఈనేపథ్యంలో దిల్లీలోని సమాయ్పూర్ బద్లీ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోన్న సీమా ధాకా కేవలం 3 నెలల్లోనే 76 మంది చిన్నారులను వెతికి పట్టుకున్నారు. తద్వారా సీనియార్టీతో సంబంధం లేకుండా పదోన్నతి అందుకోవడంతో పాటు పలు ప్రోత్సాహక పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నారామె. ఈ క్రమంలో అవుట్ టర్న్ ప్రమోషన్ పొందిన తొలి పోలీసుగా సీమా ధాకా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.
వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది!
విధి నిర్వహణలో తన అంకిత భావానికి గుర్తుగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన సీమా పలు ప్రోత్సాహక పురస్కారాలను కూడా అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ‘అసాధారణ్ కార్య పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇక సీమా ఛేదించిన 76 మిస్సింగ్ కేసుల్లో 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు 56 మంది ఉండగా, 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు 15 మంది ఉండడం గమనార్హం. కేవలం మూడు నెల్లలోనే ఎంతో మంది చిన్నారుల జాడ కనుక్కుని వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీమా కేవలం దిల్లీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో తప్పిపోయిన బాలల జాడ కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో పశ్చిమబంగకు చెందిన ఇద్దరు; పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు; గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బిహార్ తదితర ప్రాంతాల్లో తప్పిపోయిన బాలబాలికలను కూడా కాపాడి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
వారి ఆవేదనను అర్థం చేసుకున్నాను!
2006 జులై 3న దిల్లీ పోలీసు విభాగంలో చేరారు సీమా ధాకా. 2012వరకు అక్కడే పనిచేశారు. 2014లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన ఆమె ఆ తర్వాత అక్కడి ఔటర్ డిస్ట్రిక్ట్, రోహిణీ, ఔటర్ నార్త్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఆమె భర్త కూడా రోహిణీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. విధి నిర్వహణలో కచ్చితత్వం పాటించే సీమ గత మూడు నెలలుగా ఒక్కరోజు కూడా వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) తీసుకోలేదు. పైగా పిల్లలను వెతికే పనిలో పడి స్టేషన్ నుంచి ఏ అర్ధరాత్రి రెండింటికో, మూడింటికో ఇంటికి చేరుకునే వారు. ‘నాకు ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. అమ్మానాన్నల నుంచి విడిపోయిన పిల్లలు, పిల్లలను దూరం చేసుకున్న తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే తప్పిపోయిన చిన్నారులను ఎలాగైనా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనుకున్నాను. ఈ మూడు నెలల్లో దిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగ లాంటి రాష్ట్రాలు తిరిగి 76 మిస్సింగ్ కేసులను ఛేదించాను..’
రెండు నదులు దాటి అక్కడకు వెళ్తే!
‘ఈ క్రమంలో తప్పిపోయిన కొందరు చిన్నారుల హృదయ విదారక గాథలు నా మనసుని బాగా కదిలించాయి. ఇందులో భాగంగా 2018లో ఒక మహిళ తన కుమారుడు తప్పిపోయాడని ఫిర్యాదు చేసింది. నేను ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అంటే 2020లో ఆ పిల్లాడి ఆచూకీ తెలుసుకోగలిగాను. కానీ పిల్లాడు దొరికాడన్న సమాచారం ఇద్దామంటే ఆ మహిళ తన చిరునామా, మొబైల్ నంబర్‌ను మార్చేసింది. దీంతో ఆమెను గుర్తించడం మాకు చాలా కష్టమైంది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి ఆ తల్లి వివరాలు సంపాదించాం. వరదల్లో ఎంతో సాహసం చేసి 2 నదులను దాటి ఆమె ఉన్న గ్రామానికి చేరుకున్నాం. కానీ ఆ బాబు మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. కారణం కనుక్కుంటే... ఆ మహిళ రెండో వివాహం చేసుకుందని, తన పిన తండ్రి సరిగ్గా చూసుకోకపోగా రోజూ కొడుతున్నాడని ఆ బాలుడు చెప్పే సరికి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దీంతో ఆ తల్లిదండ్రులకు సరైన కౌన్సెలింగ్ ఇచ్చాం. బాలుడికి సర్దిచెప్పి వారి దగ్గరికి చేర్చాను..’ అని ఈ సందర్భంగా తన అనుభవాలను గుర్తుకుతెచ్చుకున్నారీ మహిళా కాప్.
సెల్యూట్ మేడమ్!
ఇలా తన విధుల్లో కొనసాగుతోన్న క్రమంలోనే కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు సీమ. మూడు వారాల పాటు చికిత్స తీసుకుని వైరస్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత వెంటనే విధుల్లోకి చేరారు. సీమతో పాటు మరికొందరు పోలీసుల సహకారంతో దిల్లీలో ఆగస్టు 7 నుంచి ఇప్పటివరకు 1,440 మంది పిల్లల ఆచూకీని కనిపెట్టినట్లు దిల్లీ పోలీసు ఉన్నాతాధికారులు చెబుతున్నారు. ఇదంతా సీమా ధాకా శ్రమతోనే సాధ్యమైందని వారు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ ట్విట్టర్ వేదికగా ఈ సూపర్ పోలీస్‌ను ప్రశంసించారు. ‘మూడు నెలల్లోనే 76 మంది పిల్లలను వెతికి పట్టుకొని తిరిగి వారిని వారి కుటుంబాల చెంతకు చేర్చి అరుదైన పదోన్నతి పొందారు సీమ. ఈ ఘనత సాధించిన మొదటి పోలీస్‌గా నిలిచారామె. మా అభినందనలకు ఆమె అన్ని విధాలా అర్హురాలు’ అంటూ ఆ ట్వీట్‌ను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ట్యాగ్ చేశారు. ఇక ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశంసించారు. ‘ఆమె ఛేదించిన మిస్సింగ్ కేసుల్లో చాలావరకు కుటుంబాల నుంచి ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయి, అదృశ్యమైన పిల్లలు ఉన్నారు. అలాంటి చిన్నారుల ఆచూకీని గుర్తించి వారిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మీకు సెల్యూట్ మేడమ్!’ అని అభినందించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, ఎంపీ గౌతమ్ గంభీర్, నటి రిచా చద్దా, ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ లాంటి సెలబ్రిటీలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సోషల్ మీడియా వేదికగా సీమపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నెటిజన్లు కూడా ఆమె పోస్టులను షేర్ చేస్తూ అభినందనలు చెబుతున్నారు.
మరి, విధి నిర్వహణలో అంకిత భావం చాటుతూ తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు చేరుస్తోన్న ఈ సూపర్ పోలీస్‌కు మనమూ సెల్యూట్ చేద్దాం!
హ్యాట్సాఫ్ మేడమ్!