Photo: Screengrab
కౌన్ బనేగా కరోడ్ పతి... సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి ఆశలు, ఆశయాలను సాకారం చేస్తున్న ప్రముఖ టీవీ షో. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ బుల్లితెర కార్యక్రమానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీ, క్రేజ్‌తో ఇప్పటికే ఎంతోమంది తమ కలలను నిజం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న 12వ సీజన్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ కోటి రూపాయలు గెలుచుకుని తన భర్త కలను సాకారం చేశారు.. వార్తల్లో మహిళగా నిలిచారు. మరి, ఇంతకీ ఎవరామె? తన భర్త కల ఏంటి? దానిని ఆమె ఎలా నెరవేర్చారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
రెండో కోటీశ్వరురాలిగా!
ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతోన్న ఈ పాపులర్ రియాలిటీ షో ఇప్పటికే 11 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో సెప్టెంబర్ 28 నుంచి కేబీసీ సీజన్-12 ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలతో షో చరిత్రలో మొదటిసారిగా ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహించడం గమనార్హం. ఈక్రమంలో ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ గేమ్ షోలో కోటి రూపాయలు గెలుచుకోవడం అంటే మామూలు విషయమేమీ కాదు. అందుకు ట్యాలెంట్‌తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఇటీవల దిల్లీకి చెందిన నజియా నసీమ్ కోటి రూపాయలు గెలుచుకుని ఈ సీజన్లో కోటీశ్వరురాలిగా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. తాజాగా జమ్ముకశ్మీర్ చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు.
మోహిత స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా. తండ్రి ఓ కంపెనీలో ఉద్యోగి, కాగా తల్లి గృహిణి. దిల్లీలో పెరిగిన మోహిత అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె.. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని బడి బ్రాహ్మణలో సబ్‌డివిజన్ పోలీసు అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహిత భర్త రూషల్ గార్గ్ కూడా ఐఎఫ్ఎస్ అధికారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో తన భర్త కారణంగానే కేబీసీకి వచ్చానంటున్నారు మోహిత. ఆయన ప్రోద్బలం, సహకారంతోనే కోటి రూపాయలు గెలుచుకున్నానంటున్నారు. ఈ సందర్భంగా తన భర్త, కేబీసీ షో గురించి పలు విషయాలు, తన అనుభవాలను అందరితో షేర్ చేసుకున్నారామె.
నా భర్త 20 ఏళ్ల కల ఇది!
‘నా భర్తకు కేబీసీ అంటే చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలని గత 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. జూనియర్ కేబీసీలో కూడా ట్రై చేశారు. కోటి రూపాయలు గెలుచుకోకున్నా కనీసం హాట్‌సీట్ వరకైనా చేరుకోవాలన్న ఆయన ఆకాంక్షను నిజం చేసేందుకే నేను ఈ షోలో పాల్గొన్నాను. ఆయన సలహా మేరకు ఈ పోటీలకు రిజిస్టర్ చేసుకున్నాను. అదృష్టవశాత్తూ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఆడిషన్స్‌లో ఎంపికయ్యాను. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నప్పుడే అన్ని రకాల సబ్జెక్టులను పూర్తిగా చదివేశాను. ఇక ఈ షోలో పాల్గొనడానికి ముందు ఐదు రోజుల పాటు ఓ హోటల్లో క్వారంటైన్లో గడిపాను. అక్కడ అన్ని సబ్జెక్టులను మరోసారి పునఃశ్చరణ చేసుకున్నాను. ప్రధానంగా జాగ్రఫీకి సంబంధించిన అంశాలపై బాగా పట్టు సాధించాను.’
కాసేపు కలలాగా అనిపించింది!
‘పోటీలో పాల్గొనే ముందు కొంచెం ఒత్తిడికి గురయ్యాను. ఒకవేళ సరిగా సమాధానాలు చెప్పకపోతే ‘ఈవిడ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయింది?’ అని చాలామంది అనుకుంటారు. దీంతో మదిలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. అయితే ఈ ఒత్తిడి కారణంగా మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని గ్రహించాను. సమయం దొరికినప్పుడల్లా నా భర్త, కుటుంబ సభ్యులతో కలివిడిగా మాట్లాడి ఒత్తిడిని అధిగమించాను. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా అన్ని రౌండ్లను పూర్తి చేసి హాట్ సీట్ వరకు చేరుకున్నాను. ఇక కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కొనే ముందు చాలా టెన్షన్‌కు గురయ్యాను. ఆ సమయంలో మనసులోనే కొన్ని మంత్రాలు చదువుకున్నాను. ఈక్రమంలో ‘జర్మన్ కెమిస్ట్ జార్జ్ ఫ్రెడ్రిచ్ హెన్నింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఏ పేలుడు పదార్థానికి పేటెంట్ రైట్ తీసుకున్నాడు?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పమని అమితాబ్ నన్ను అడిగారు. దీనికి బిగ్ బీ ఇచ్చిన ఆప్షన్స్... ఎ) HMX బి)RDX సి)TNT డి)PETN. ఈ కోటి రూపాయల సమాధానం చెప్పడానికి నేను ‘AskTheExpert’ సహాయం తీసుకుని RDX అని సమాధానాన్ని లాక్ చేయమని అమితాబ్‌ను కోరాను. ఆ తర్వాత కొద్ది సేపు ఉత్కంఠకు గురిచేసిన బిగ్ బీ ‘ఏక్ కరోడ్’ అంటూ నా సమాధానం సరైనదేనన్నారు. ఆయన అలా చెప్పగానే సంతోషంతో నానోటి వెంట మాటలు రాలేదు. కాసేపు ఇదంతా ఒక కలలాగా అనిపించింది.’
అందుకు బాధపడడం లేదు!
‘నా భర్త 20 ఏళ్ల కలను నిజం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు టీవీల్లో రావడం చూసి నా కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, స్నేహితులు ఫోన్ల మీద ఫోన్లు చేసి అభినందనలు చెబుతున్నారు. ఇక నాకు అమితమైన ఆనందమిచ్చిన విషయం ఏమిటంటే... అమితాబ్ సర్ సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వడం. షోలో భాగంగా కంటెస్టెంట్లను పరిచయం చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఆయనను చూశాను. ఆ సమయంలో బిగ్ బీని అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఆయన అనుసరిస్తున్నారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం. ఇక 7 కోట్ల రూపాయల ప్రశ్నను వదులుకున్నందుకు నేనేమీ నిరాశపడడం లేదు. నేను డబ్బుల కోసం కేబీసీలో పాల్గొనలేదు. కేవలం నా భర్త కలను సాకారం చేసేందుకే ఈ పోటీలకు హాజరయ్యాను. మంచిగా ఆడితే మాలాంటి ఆఫీసర్లకు ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుంది. అనుకున్నట్లే నా గేమ్‌ను కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది’ అంటున్నారీ లేడీ సింగం.