గతేడాది చివరిలో వూహాన్ వేదికగా ఊపిరి పోసుకుంది కరోనా వైరస్. క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ఇండియాలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని చాలామంది అనుకున్నారు. అయితే కేరళకు చెందిన ఓ ప్రజాప్రతినిధురాలు మాత్రం రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించారు. కేరళలో మొదటి పాజిటివ్ కేసు నమోదు కాగానే మరింత అప్రమత్తమై కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించారు. ‘టెస్టింగ్... ట్రేసింగ్... ఐసోలేట్’ పాలసీని పక్కాగా అమలు చేసి వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు అరికట్టారు. ఆమే కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. తన పక్కా ప్రణాళికలతో ప్రాణాంతక వైరస్‌ను నిరోధించిన ఆమె సేవలకు గుర్తింపుగా ప్రముఖ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘వోగ్ ఇండియా’ శైలజకు ఘనమైన గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ గా గౌరవిస్తూ తమ తాజా ఎడిషన్ కవర్ పేజీపై ఆమె ముఖ చిత్రాన్ని ప్రచురించింది.
ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన కరోనా కల్లోలం ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ ఇప్పుడు ‘సెకండ్ వేవ్’ అంటూ అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఈ వైరస్‌ను ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. వీరితో పాటు పారిశుధ్య సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ వ్యతిరేక పోరులో భాగమవుతున్నారు. ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్‌పై పోరాడుతున్న కరోనా వారియర్ల సేవలకు గుర్తింపుగా ‘వుమెన్ ఆఫ్ 2020’ పేరుతో తాజాగా ఓ ఎడిషన్‌ను ప్రచురించింది ‘వోగ్ ఇండియా’. ఇందులో భాగంగా కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’గా గౌరవిస్తూ ఆమె ముఖ చిత్రాన్ని ఆ ఎడిషన్ కవర్ పేజీపై ప్రచురించింది. అనంతరం ఈ కవర్ పేజీని తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ డిస్ప్లే పిక్చర్‌గా మార్చింది.
పక్కా ప్రణాళికతో పరీక్షలు!
ఇండియాకు సంబంధించి భూతల స్వర్గంగా పేరు గాంచిన కేరళలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. జనవరి 30న వూహాన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేరళతో పాటు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అంతకుముందే వైరస్ వ్యాప్తిపై సమీక్ష జరుపుతున్న శైలజ మరింత అప్రమత్తమయ్యారు. అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ‘టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేట్’ సూత్రాన్ని పక్కాగా అమలు చేశారు. విమానాశ్రయాల్లో పకడ్బందీగా కరోనా పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి వచ్చేవారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్వారంటైన్ నిబంధనలను కట్టుదిట్టం చేశారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఐసోలేషన్ వార్డులకు తరలించారు. సోషల్ డిస్టెన్స్, మాస్కుల వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు.
ఆమె కృషి ప్రశంసనీయం!
కరోనాను కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ ప్రజాప్రతినిధిగా ప్రజల ప్రాణాలకు భరోసానిచ్చారు శైలజ. అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి 10 గంటల వరకు కార్యాలయంలోనే ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షలు నిర్వహించారామె. ముందుచూపుతో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో చాలా వరకు విజయం సాధించారు. కేరళ ప్రభుత్వం సమర్థంగా కరోనాను ఎదుర్కొనడంలో శైలజదే కీలక పాత్ర అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఆమె కృషిని ప్రశంసిస్తూ ఆర్టికల్స్ ప్రచురించాయి.
వైరస్‌కు భయపడేంత సమయం లేదు!
ఇక పబ్లిక్ సర్వీస్ డేను పురస్కరించుకుని జూన్ 23న ఐక్యరాజ్యసమితి వర్చువల్ గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శైలజపై ప్రశంసల వర్షం కురిపించింది. కొద్ది రోజుల క్రితం బ్రిటన్‌కు చెందిన ప్రాస్పెక్ట్ అనే ఓ పత్రిక ‘టాప్ 50 థింకర్స్’ పేరిట ఓ పోల్‌ను నిర్వహించింది. సుమారు 20 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో శైలజకు మొదటి స్థానం లభించింది. ఇక తమ దేశం నుంచి కరోనాను విజయవంతంగా తరిమికొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం విశేషం. తాజాగా శైలజ సేవలను గుర్తిస్తూ ‘వోగ్ ఇండియా’ తమ తాజా ఎడిషన్ కవర్ పేజీపై ఆమె ముఖ చిత్రాన్ని ప్రచురించింది. ‘జెసిండా ఆర్డర్న్ (న్యూజిలాండ్ ప్రధాని), ఏంజెలా మెర్కెల్ (జర్మనీ ఛాన్స్లర్), త్సాయి ఇంగ్-వెన్ (తైవాన్ అధ్యక్షురాలు) తదితరులు కరోనాను సాధ్యమైనంతవరకు కట్టడి చేయగలిగారు. తమ పాలనాదక్షతతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. కేరళకు చెందిన శైలజ కూడా ఈ ప్రశంసలకు పూర్తిగా అర్హురాలు. ఆమె ముందుచూపు కారణంగానే ఆ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది’ అని ‘వోగ్ ఇండియా’ ఆమె సేవలను ప్రశంసించింది. ఈ సందర్భంగా ‘కరోనాకు నేను భయపడను. అంత సమయం కూడా నా దగ్గర లేదు. వైరస్‌కు భయపడే కంటే దానిని అరికట్టేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాను’ అన్న శైలజ మాటలను మరోసారి గుర్తు చేసిందీ ఫ్యాషన్ మ్యాగజైన్.
నాకు వైద్యం తెలియదు!
కరోనా నియంత్రణకు సంబంధించి అందరి ప్రశంసలు అందుకుంటున్న 63 ఏళ్ల శైలజ వైద్యురాలేమీ కాదు. అంతేకాదు.. ఆమె మంత్రి పదవిని చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. కేరళలోని కన్నూర్ జిల్లా కూతుపరంబాలో జన్మించిన శైలజ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత కన్నూరులోని శివపురం హైస్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేశారు. కళాశాలలో చదువుతున్నప్పుడే సీపీఐ(ఎం) భావజాలం పట్ల ఆకర్షితురాలైన ఆమె ఆ పార్టీ విద్యార్థి విభాగంలో చేరారు. 2004లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన ఆమె కూతుపరంబా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల క్రితం కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ చాలామంది ఆమెను శైలజా టీచరనే పిలుస్తారు. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ కూడా ‘శైలజ టీచర్’ పేరుతోనే కనిపిస్తుంది.
గతంలోనూ!
కరోనా కన్నా ముందు 2018లో నిఫా వైరస్ కేరళను కుదిపేసింది. అయితే ఆ సమయంలో చురుగ్గా స్పందించిన శైలజ అప్పటికప్పుడు 40 వేలమంది వలంటీర్లను ప్రజారోగ్య విభాగంలోకి తీసుకున్నారు. వైద్యులు, అధికారులతో కలిసి పనిచేసి నిఫా వైరస్‌ను సాధ్యమైనంతవరకు నియంత్రించగలిగారు. ఆ సమయంలో ఆమె చేసిన కృషిని దేశమంతా అభినందించింది. ఈ క్రమంలో కేరళలో నిఫా వైరస్ విజృంభణ మీద మలయాళంలో ‘వైరస్’ అనే సినిమా వచ్చింది. ఇందులో శైలజను పోలిన పాత్రను వెండితెరపై కూడా చూపించడం విశేషం. ఆ పాత్రను ప్రముఖ నటి రేవతి పోషించారు.
ఇక గతేడాది కేరళలో సంభవించిన వరదల్లో ప్రాణనష్టం సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు శైలజ.
కంగ్రాట్స్ కామ్రేడ్!
ఈ సందర్భంగా ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ గా ‘వోగ్ ఇండియా’ కవర్ పేజీపై దర్శనమిచ్చిన శైలజకు సహచర మంత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె కవర్ పేజీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కేరళ ఆర్థిక శాఖామంత్రి శైలజ ముఖ చిత్రమున్న కవర్ పేజీని ట్విట్టర్లో షేర్ చేస్తూ‘ కంగ్రాట్స్ కామ్రేడ్’ అని అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ కవర్పేజీనే తన ఫేస్బుక్ అకౌంట్ డీపీ (డిస్ప్లే పిక్చర్)గా మార్చుకున్నాడు.