Photo: Twitter
రోజుల తరబడి కొనసాగిన కౌంటింగ్... అభ్యర్థుల మధ్య పరస్పర విమర్శలు... గంటగంటకూ చేతులు మారుతున్న ఆధిపత్యం... పోటీదారుల్లో ఆందోళన... అభిమానుల్లో ఆగ్రహ జ్వాలలు... వెరసి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల ఫలితాల కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకు కారణం ‘కమలాదేవి హ్యారిస్’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ మూలాలున్న ఆమె త్వరలోనే అగ్రరాజ్య ఉపాధ్యక్ష పీఠం అధిష్టించేందుకు రంగం సిద్ధమైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. ఈ సందర్భంగా కమల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..
నువ్వు కూడా అధ్యక్షురాలివి కావొచ్చు!
అమెరికా చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా కానీ ఉపాధ్యక్షులుగా కానీ గెలిచిన దాఖలాలు లేవు. ట్రంప్‌కు పోటీగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా మొదట కమల ఎంపికయ్యారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారపర్వంలో దూసుకెళుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో అనూహ్యంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారామె. అయితే పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ తన పోరాటం కొనసాగుతుందని ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలింగ్ పూర్తయ్యి, ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా... కమల ఇటీవల తన మేనకోడలిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముచ్చటించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఆ నాలుగేళ్ల చిన్నారి ‘నాకు అమెరికా అధ్యక్షురాలు కావాలని ఉంది’ అడుగుతుంది. దానికి కమల ‘నువ్వు కూడా అధ్యక్షురాలివి కావొచ్చు. కానీ దానికి చాలా కష్టపడాలి. 35 సంవత్సరాలు నిండాలి’ అని ఆ చిన్నారికి స్ఫూర్తిదాయక మాటలు చెబుతారు. ఆ స్ఫూర్తిని తనలో తాను చాలా ఏళ్లుగా నింపుకొంటూ వస్తున్నారు కమల. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం, అంతులేని ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను పుణికిపుచ్చుకున్న కమల తన తల్లి చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇవే ఆమెని అగ్రరాజ్య ఉపాధ్యక్ష పీఠానికి దగ్గరి చేశాయని చెప్పచ్చు.
ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి!
కమలాదేవి హ్యారిస్.. అన్న పేరే చెబుతుంది ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి అని. ఆమె తల్లి శ్యామలా గోపాలన్. చెన్నైకి చెందిన ఆమె చదువు నిమిత్తం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకా దేశానికి చెందిన ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. ‘చిన్నప్పుడు చెన్నై బీచ్‌లో తాతగారితో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే’ అంటూ తన భారతీయ మూలాలను అప్పుడప్పుడూ నెమరు వేసుకుంటారు కమల.
నాయకత్వానికి అదే ఆరంభం!
హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి కమల ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆమె చిన్నారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ఇక 2017లో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
శ్యామల కూతురిగానే నాకు గౌరవం!
కమలకు ఏడేళ్ల వయసున్నప్పుడే వారి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో సింగిల్ పేరెంట్‌గానే ఇద్దరు కూతుళ్ల బాధ్యతలను స్వీకరించారు తల్లి శ్యామలా గోపాలన్. ఈ క్రమంలో ఓ మహిళగా తాను సాధించిన విజయాలన్నింటికీ అమ్మే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కమల.
‘నాకు ఏడేళ్లుండగా మా అమ్మానాన్న విడిపోయారు. కానీ మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. పనంటే ప్రాణం. అమ్మ రీసెర్చ్‌లో ఉండగా అనుకోకుండా ఉమ్మనీరు బయటకు రావడంతో డెలివరీ చేసి నన్ను తీశారట. నాన్న దూరమయ్యాక... అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. పరిశోధనలు, పౌరహక్కులు అంటూ... మాలో చైతన్యాన్ని నింపిన అమ్మ మరోపక్క తన మూలాలను, సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరిచిపోలేదు. ఓ మధ్యతరగతి భారతీయ కుటుంబానికి ప్రతీకగా ఉండేది మా ఇల్లు. దుస్తులు, ఆహారం అన్నీ భారతీయ పద్ధతిలోనే ఉండేవి. ఇడ్లీ, వడ, సాంబార్ అంటే ఇప్పటికీ నాకెంతో ఇష్టం!
తమిళనాడులోని తన పుట్టింటికి తీసుకెళ్లి నాకు మావయ్య, అత్తయ్య, పిన్ని వీళ్లందరినీ పరిచయం చేసింది అమ్మ. నేను ఇప్పటికీ మా పిన్నిని ‘చిత్తీ’ అనే పిలుస్తాను. తమిళంలో ‘చిత్తీ’ అంటే ‘పిన్ని’ అని అర్థం. వీలు చిక్కినప్పుడల్లా తన ల్యాబ్‌కి నన్నూ, చెల్లిని తీసుకెళ్లేది. అక్కడ టెస్ట్ట్యూబ్లని శుభ్రం చేయడం నా పని. ఎప్పుడైనా అమ్మకు పనిపడి దూరప్రాంతం వెళ్లాల్సి వస్తే... నన్నో డేకేర్ సెంటర్లో పెట్టేది. అమ్మతో మా అక్కాచెల్లెళ్లని చూసిన వాళ్లంతా ‘శ్యామల అండ్ ద గర్ల్స్’ అని మురిపెంగా పిలిచేవారు. అమ్మే నాకు స్ఫూర్తి. తనే నా రియల్ హీరో. ఈ పదవులు, గౌరవాల కంటే శ్యామలా గోపాలన్ కూతురిగా చెప్పుకోవడమే నాకు అసలైన గౌరవం’ అంటూ కమల ఎన్నికల సమయంలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అయితే క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న శ్యామల దురదృష్టవశాత్తూ అదే క్యాన్సర్‌కి గురికావడం విచారకరం. 2009లో శ్యామల చనిపోయాక... తల్లి కోరిక మేరకు, ఆమె చితాభస్మాన్ని బంగాళాఖాతంలో కలపడానికి వచ్చారు కమల.
సవతి పిల్లలతో సరదాగా!
కమలా హ్యారిస్ డోగ్లాస్ ఎమ్హోప్ను 2014లో వివాహం చేసుకున్నారు. స్నేహితులు ఏర్పాటుచేసిన బ్లైండ్ డేట్లో మొదటిసారిగా కలుసుకున్న వారిద్దరూ ఏడాది తరువాత పెళ్లి చేసుకున్నారు. 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసిన సందర్భంలో కీలకంగా వ్యవహరించిన కమల చెల్లెలు మహాలక్ష్మి దగ్గరుండి ఈ పెళ్లి చేయడం విశేషం. తనకున్న బాధ్యతల దృష్ట్యా ఎప్పుడూ బిజీగా సమయం గడిపే కమలకు తన సవతి పిల్లలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఇక డోగ్లాస్ పిల్లలు కూడా ఆమెను సవతి తల్లిగా చూడడానికి ఇష్టపడరు. అందుకే మామ్, కమల పదాలను కలుపుతూ ‘మామల’ అని కమలను పిలుస్తారు. ఇక డోగ్లాస్ మొదటి భార్యతోనూ ఆమెకు సత్సంబంధాలే ఉన్నాయి.
|
వంట చేయడమంటే చాలా ఇష్టం!
రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే కమల వంట చేయడాన్ని చాలా అమితంగా ఇష్టపడతారు. తేలిగ్గా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే ఆమె ఎక్కువగా ‘రైజిన్ బ్రాన్’ ని బాదం పాలతో కలిపి తీసుకుంటారు. అదీ వంటగదిలో నిల్చొనే తినేస్తారు. ‘ఆదివారం కుటుంబ సభ్యులకు డిన్నర్ వండిపెట్టినపుడు ఇల్లాలిగా ఎంతో సంతృప్తి ఉంటుంది. వంట చేస్తున్నానంటే, నా జీవితం నా నియంత్రణలోనే ఉందన్న ధీమా వస్తుంది’ అని చెప్పే కమల పిల్లల కోసం తరచూ కొత్త వంటకాలు ప్రయత్నిస్తారు. ఇంట్లో వంటల పుస్తకాలు చదువుతుంటారు. ఇక భారతీయ వంటకాల్లో ఇడ్లీ సాంబార్, పన్నీర్ టిక్కా అంటే చాలా ఇష్టమని చెబుతారు కమల.
|
మీ మనసు మాటే వినండి!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల చేసిన కొన్ని ప్రసంగాలు, ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రంప్ విధానాలపై విశ్లేషణాత్మక విమర్శలు చేస్తూనే మహిళా సాధికారతకు సంబంధించి ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ‘జీవితంలో ముందు కెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోకూడదు. ప్రతికూల ఆలోచనలు, నిరుత్సాహపరిచే మాటలను అసలు పట్టించుకోకండి. నేను కూడా ‘ఇది నీ పని కాదు.. ఇది సమయం కాదు’ లాంటి నెగెటివ్ మాటలు, ప్రతికూల సలహాలను ఎన్నోసార్లు విన్నాను. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. నా మనసు మాటే విన్నాను. అలాగే ముందుకు వెళ్లాను’ అంటూ ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపారు.
|
తొలి ఉపాధ్యక్షురాలినే ... చివరి మహిళను మాత్రం కాదు!
ఇక ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన వెంటనే జాతినుద్దేశించి మాట్లాడారు కమల. ‘మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్ర్తీని మాత్రం కాదు’ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారామె.
|
కమల అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో తమిళనాడులోని ఆమె పూర్వీకులు సంబరాలు చేసుకున్నారు. కమల చిత్రపటాలతో పాటు ప్లకార్డులు, హోర్డింగులు ఏర్పాటుచేసి ఆమెకు అభినందనలు తెలిపారు. ఇక దిల్లీలో ఉంటున్న ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ కమల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమె విజయం సాధించినప్పటి నుంచి తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అలియా భట్, కంగనా రనౌత్, కాజల్ అగర్వాల్, మసాబా గుప్తా, కమలహాసన్.. లాంటి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.