Photo: Twitter
ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ప్రపంచమంతా ఆసక్తి చూపుతున్న ఈ ఎన్నికల్లో రిపబ్లిక్, డెమొక్రటిక్ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లిక్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్... 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవి కోసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పోటీ పడుతున్నారు డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్. ఇప్పటికే క్యాలిఫోర్నియా సెనేటర్‌గా పాలనా దక్షత చాటుకున్న ఈ ఇండియన్ అమెరికన్.. ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ట్రంప్‌కు పోటీగా ప్రసంగాలు, ఉపన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు కమల. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు సంబంధించి నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారామె. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ‘మీ ప్రశ్నలు- నా సమాధానాలు’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కమలకు, నెటిజన్లకు మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
ఎన్నికల ప్రచార సమయంలో మానసికంగా దృఢంగా ఉండేందుకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
చాలా చేస్తాను. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం, వర్కవుట్లు చేస్తాను. పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడుతాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. దీంతో కొద్ది సేపు కిచెన్‌లో గడుపుతాను. అంతేకాదు.. డగ్(కమలా హ్యారిస్ భర్త)కు వంట ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను.
భారతీయ వంటకాల్లో మీకు ఏవంటే ఇష్టం?
దక్షిణ భారతదేశంలో అయితే సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఇక ఉత్తర భారత వంటకాల విషయానికొస్తే.. ఎలాంటి టిక్కా అయినా నాకు నచ్చుతుంది.
మహిళలకు మీరెలాంటి సలహాలు ఇస్తారు?
జీవితంలో ముందుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోకూడదు. ప్రతికూల ఆలోచనలు, నిరుత్సాహ పరిచే మాటలను అసలు పట్టించుకోకండి. నేను కూడా ‘ఇది నీ పనికాదు... ఇది సమయం కాదు’ లాంటి నెగెటివ్ మాటలు, ప్రతికూల సలహాలను ఎన్నో సార్లు విన్నాను. కానీ నేను వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. నేను చెప్పేది ఒకటే... ఈ కాదు(NO) అనే పదాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోనే తినేస్తాను. మీరు కూడా అదే చేయండి. ఎందుకంటే అదే మనకు మంచి బ్రేక్‌ఫాస్ట్.
మీకెలాంటి పాటలంటే ఇష్టం?
మేరీ జేన్ బ్లిజ్ పాడిన ‘Work That’ పాట అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ఆ పాట వినండి. కచ్చితంగా నచ్చుతుంది.
నేను ఒక్లహామా నుంచి మీకు ఓటు వేస్తున్నాను. ఇలా నా ఒక్క ఓటు మొత్తం ఎన్నికల ఫలితాలను మారుస్తుందా?
ఒకటి రెండు ఓట్లు మొత్తం ఎన్నికల ఫలితాలనే మార్చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఎన్నికల్లో మీ నిర్ణయం మనస్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్ జీవితంపై ప్రభావం చూపిస్తాయి.
రానున్న తరాలకు స్థిరమైన, పర్యావరణ హితమైన భవిష్యత్‌ను ఎలా అందిస్తారు?
మీ భవిష్యత్ కోసం జో బైడెన్, నేను ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. పలు రంగాల్లో ఉద్యోగాలు సృష్టించడంతో పాటు 2050 నాటికి జీరో ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకున్నాం.