Photo: www.instagram.com/aapli_aaji/
సాధారణంగా వయసు పైబడుతున్న బామ్మలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. లేదంటే ఇంట్లో తమ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఒంట్లో సత్తువ తగ్గిపోయిన వారు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది 70 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు వంట గదిలో గరిటె తిప్పుతూ యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిపోయారు. నేటి తరం మరచిపోతున్న సంప్రదాయ వంటకాలను మళ్లీ రుచి చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మరి, మహారాష్ర్టకు చెందిన ఆ ‘వంటల బామ్మ’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...
‘మన అవ్వ’ వంటకాలు!
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ‘సరోలా కసర్’ అనే ఊరు ఉంది. అక్కడే పొలం పనులు చూసుకుంటూ జీవిస్తున్నారు 70 ఏళ్ల సుమన్ ధమానే. ఒకరోజు ఆమె 17 ఏళ్ల మనవడు యష్ పాథక్ ‘పావ్ భాజీ’ చేసి పెట్టమని ఆమెను కోరాడు. ఎలా చేయాలో యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు కూడా చూపించాడు. వాటన్నింటినీ చూసిన సుమన్ తన మనవడితో ‘నేను వాళ్ల కంటే బాగా చేస్తాను చూడు..!’ అని చెప్పి రుచికరమైన పావ్ భాజీ చేసి పెట్టారీ బామ్మ. మనవడితో పాటు ఆ ఇంటి సభ్యులందరూ లొట్టలేసుకుని మరీ దానిని తిన్నారు. దీంతో యష్‌కు ఓ మంచి ఆలోచన వచ్చింది. తన అమ్మమ్మ చేసే రుచికరమైన వంటకాలను యూట్యూబ్ వేదికగా అందరితో పంచుకుందామనుకున్నాడు. దీనికి సుమన్ కూడా సరేననడంతో ఈ ఏడాది జనవరిలో ‘ఆప్లీ ఆజీ‘ (మన అవ్వ) పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.
మనవడి సహాయంతో !
సుమన్ పెద్దగా చదువుకోలేదు. గతంలో ఒక్కసారి కూడా కెమెరా ముందు నిల్చున్న అనుభవం లేదు. ఇక సాధారణంగా ఉండే నెట్వర్క్ సమస్యలు, టెక్నికల్ ఇబ్బందులు, అనుకోకుండా వచ్చినా కరోనా వైరస్ ఆమెకు మరిన్ని అడ్డంకులను సృష్టించాయి. ఈ సమయంలో ఇంటర్ చదువుతోన్న తన మనవడు యష్ సహాయంతో మెల్లమెల్లగా ఇంటర్నెట్పై అవగాహన పెంచుకున్నారామె. వంటకాలకు సంబంధించిన కొన్ని ఇంగ్లిష్ పదాలను కూడా నేర్చుకున్నారు. అలా మనవడి సహాయంతో మార్చి 25న మొదటిసారిగా కాకర కాయ కూర వండి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నవ్వుతూ గరిటె తిప్పుతూ, ఆ వంట ఎలా చేయాలో వివరిస్తూ రూపొందించిన ఈ కుకింగ్ వీడియోకు బోలెడన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆ వెంటనే మరాఠీల సంప్రదాయ మిఠాయిలను తయారుచేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దానికీ లక్షల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత పల్లీల చట్నీ, ఆకుకూరలతో చేసే విభిన్న వంటకాలు, వంకాయతో చేసే వెరైటీలు... ఇలా ఆమె వంటల ప్రస్థానం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.
ఆ వంటకాలను మళ్లీ రుచి చూపిస్తోంది!
మహారాష్ర్ట ప్రజలు మరచిపోయిన సంప్రదాయ వంటకాలను మళ్లీ రుచి చూపిస్తోన్న సుమన్ వీడియోలు చూసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈక్రమంలో నాలుగు నెలల్లోనే ‘ఆప్లీ ఆజీ’ యూట్యూబ్ ఛానల్‌ను 6 లక్షల మంది సబ్‌స్ర్కైబ్ చేసుకోవడం విశేషం. పావ్ భాజీ, బేసన్ లడ్డూ, సాబూదానా కిచిడీ, మసాలే బాత్, బటాటా వడ, పానీ పూరీ, రగ్డా... ఇలా ఇప్పటివరకు మొత్తం 150 వీడియోలు తన యూట్యూబ్‌లో షేర్ చేశారీ ఓల్డ్ ఉమన్. ఈ వీడియోలన్నింటికీ కలిపి సుమారు 5.7కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఆమె వంటలకున్న క్రేజ్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆ నాలుగు రోజులు మెతుకు కూడా ముట్టలేదు!
ఈ వంటల బామ్మ అప్లోడ్ చేసే వంటకాలకు బోలెడన్నీ వ్యూస్, లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఇక ఆమె వీడియోలు చాలా బాగున్నాయని, మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయాలని సబ్‌స్ర్కైబర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సుమన్‌కు ఇంగ్లిష్ అంతగా రాకపోవడంతో మనవడు యష్ ఆ కామెంట్లను చదివి ఆమెకు వినిపిస్తుంటాడు. ఇక తన వంటల వీడియోలతో యూట్యూబ్ నుంచి ఆదాయం అందుకోవడంతో పాటు ‘యూట్యూబ్ క్రియేటర్ అవార్డు’ కూడా గెలుచుకున్నారీ ఓల్డ్ వుమన్. అత్యధిక ప్రజాదరణ ఉన్న యూట్యూబర్లకు గౌరవ సూచకంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అక్టోబర్ 17న ‘ఆప్లీ ఆజీ’ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో నాలుగు రోజుల పాటు తన ఛానల్‌పై నిషేధం విధించడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సుమన్.. ఆ నాలుగు రోజుల పాటు కనీసం మెతుకు కూడా ముట్టలేదట. అయితే ఎట్టకేలకు సమస్యలన్నీ తొలగిపోయి అక్టోబర్ 21న ఛానల్ పునఃప్రారంభం కావడంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
వాటికి కూడా భారీ డిమాండ్!
‘ఆప్లీ ఆజీ’ యూట్యూబ్ ఛానల్లో భాగంగా సుమన్ వంట చేస్తూ వాడే మసాలాలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. అవి మాకెక్కడ దొరకడం లేదంటూ...మీరు పంపితే కొంటామంటూ చాలామంది ఆమెను అడుగుతున్నారు. దీంతో వారి అభ్యర్థన మేరకు మసాలాలు, పప్పు దినుసుల విక్రయాన్ని కూడా ప్రారంభించారీ వంటల బామ్మ.