Photo: Instagram
నాటి కాలంలో రాజ్యాలనేలే కొందరు రాజుల భార్యలు, పురాణేతిహాసాల్లో కొందరు రాణులు తమ దేశ రక్షణ కోసం కత్తి పట్టి కదన రంగంలోకి దూకడం, తమ పోరాట పటిమను చాటుకోవడం మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకొనే ఉంటాం. అలాంటి వీర వనితల్లాగే శత్రువుల నుంచి తానూ తన దేశాన్ని కాపాడుకుంటానంటున్నారు అర్మేనియా ప్రథమ మహిళ అన్నా హకోబ్యాన్. ఆ దేశ ప్రధాని నికోల్ పషిన్యాన్ భార్య అయిన ఆమె.. ప్రస్తుతం ఆపదలో ఉన్న తన దేశాన్ని రక్షించుకునేందుకు తానే స్వయంగా మిలిటరీలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నట్లు ఇటీవలే ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారామె. తమ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు స్వయంగా తానే యుద్ధ రంగంలోకి దూకబోతోన్న ఈ అర్మేనియా ఫస్ట్ లేడీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..
సాధారణంగా కొన్ని దేశాల్లో అధ్యక్షుడి భార్యకు ‘ప్రథమ మహిళ’ గౌరవం దక్కుతుంది. కానీ అర్మేనియాలో ప్రధాని నికోల్ పషిన్యాన్ భార్య అన్నా హకోబ్యాన్ ఆ దేశ ప్రథమ మహిళగా కొనసాగుతున్నారు. అయితే ఇంతటి అత్యున్నత హోదాలో ఉన్న ఆమె.. ఇప్పుడు తన దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి స్వయంగా తానే తుపాకీ పట్టి శత్రువులతో యుద్ధం చేసేందుకు రడీ అవుతున్నారు. ఈ మేరకు మిలిటరీలో శిక్షణ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు అన్నా.
దేశ ఆత్మగౌరవమే ప్రథమ కర్తవ్యంగా..!
ప్రస్తుతం అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో జరుగుతోన్న యుద్ధంలో ఇప్పటికే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో తానే స్వయంగా యుద్ధరంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు అన్నా. ఇందుకోసం ప్రస్తుతం మిలిటరీలో శిక్షణ తీసుకుంటోన్న ఆమె.. ‘నేను, నాతో పాటు మరో 12 మంది మిలిటరీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించాం. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో మా మాతృభూమి సరిహద్దుల్ని కాపాడుకోవడానికి శత్రువుతో పోరాటం చేసేందుకు సంసిద్ధమవుతున్నాం. దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని శత్రువులకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’ అంటూ ఓవైపు మిలిటరీలో శిక్షణ తీసుకుంటూనే.. మరోవైపు శత్రు దేశానికి సవాలు విసురుతున్నారు అన్నా. ఇలా ఈ ఫస్ట్ లేడీ మిలిటరీ శిక్షణ తీసుకోవడం ఇది రెండోసారి. గత నెలలో మరికొంతమంది మహిళలతో కలిసి ఏడు రోజుల పాటు యుద్ధానికి సంబంధించిన మెలకువలు నేర్చుకున్నారామె. ఈ క్రమంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎలా ఉపయోగించాలో శిక్షణ తీసుకున్నారు అన్నా. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ సూపర్ ఉమన్.. అర్మేనియా ప్రజలు మిలిటరీకి సేవలందించాల్సిన సమయం ఆసన్నమైందని, తమ దేశాన్ని రక్షించుకునే సత్తా తమకుందని ప్రపంచానికి చాటుకోవాలంటూ పలు పోస్టుల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపుతుంటారు.
జర్నలిస్ట్‌గా తనదైన ముద్ర..!
1978, ఫిబ్రవరి 1న జన్మించిన అన్నా.. అక్కడి యేరెవాన్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆపై జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం అక్కడి అతిపెద్ద వార్తా సంస్థ ‘అర్మేనియన్ టైమ్స్’లో ఛీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018లో అప్పటి దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ‘అర్మేనియన్ విప్లవం’లో అన్నా కీలక పాత్ర పోషించారు. ఇక తదనంతర పరిణామాలతో అదే ఏడాది తన భర్త నికోల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో భర్తకు వెన్నుదన్నుగా ఉంటూనే.. మరోవైపు తన దేశంలో పిడియాట్రిక్ ఆంకాలజీ, హెమటాలజీ.. వంటి వైద్య విభాగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అంతేకాదు.. 2018లో ‘ఉమెన్స్ వరల్డ్ అమెరికన్ మ్యాగజీన్’ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ‘అత్యంత అందమైన ప్రథమ మహిళ’గా గుర్తింపు పొందారీ బ్యూటిఫుల్ ఫస్ట్ లేడీ.