23 ఏళ్ల రమ్య డిగ్రీ పూర్తయ్యాక ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే తనకొచ్చే జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలనుకుంటోంది. కానీ పొదుపు పథకాలు ఏమున్నాయి? అందులో ఏది మంచిది? ఎంత మొత్తం పొదుపు చేయాలి? తన జీతాన్ని అన్ని ఖర్చులకు ఎలా సమన్వయం చేసుకోవాలి? వంటి విషయాల్లో ఆమెకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఏం చేయాలన్న సందిగ్ధంలో పడిపోయింది.
లాక్డౌన్ కారణంగా అన్షు ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇంటి దగ్గరే ఓ ఫుడ్ బిజినెస్ పెట్టుకుందామని నిర్ణయించుకుంది. అయితే అందుకోసం బిజినెస్ లోన్ తీసుకోవడమెలా? అందులో మహిళల కోసం ఏమైనా రాయితీలు ఉంటాయా? ఇతర ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? ఇలా ఆమె మనసులో ఎన్నో సందేహాలున్నాయి.
నిజానికి వీళ్లే కాదు.. చాలామంది ఆడవాళ్లకు ఆర్థిక విషయాల్లో పూర్తి అవగాహన లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఇంటి ఆర్థిక అవసరాల్ని మగవాళ్లే చూసుకోవడం ఒక కారణమైతే; ఆర్థిక విషయాల గురించి ఆడవాళ్లకేం తెలుస్తుందని సమాజం వారిని చిన్న చూపు చూడడం మరో కారణం. సమాజంలో అలుముకున్న ఇలాంటి వ్యతిరేక ధోరణిని మార్చాలనుకున్నారు చెన్నైకి చెందిన నిసరీ మహేశ్. ఆడవాళ్లకూ ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక ఆన్ లైన్ ఆర్థిక వేదికను నెలకొల్పారామె. ప్రస్తుతం కరోనా నేపథ్యంలోనూ ఆన్లైన్లోనే తన సేవల్ని కొనసాగిస్తూ మహిళలందరినీ ఆర్థికంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు.
చెన్నైకి చెందిన నిసరీ మహేశ్.. ఐఐఎం బెంగళూరులో చదివింది. బ్యాంకింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో తనకు 18 ఏళ్ళ అనుభవం ఉంది. వివిధ ఆర్ధిక అంశాల గురించి కాలమిస్టుగా పలు పత్రికల్లో వ్యాసాలు కూడా రాసింది. ఈ అనుభవాన్ని మహిళలను ఆర్థికంగా అక్షరాస్యుల్ని చేయడానికి ఉపయోగించాలనుకున్నారామె. ‘ఆడవాళ్లు ఆర్థిక విషయాల్లో బలహీనులు.. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం వారికి అంతగా తెలియదు..’ అన్న మాటల్ని ఆమె సహించలేకపోయారు. అందుకే ఎలాగైనా సరే మహిళలకూ ఆర్థిక విషయాల్లో అవగాహన పెంచాలని కంకణం కట్టుకున్నారు.
ఆ ధ్యేయంతోనే...
ఈ క్రమంలోనే- ‘హర్ మనీ టాక్స్’ అనే ఆన్ లైన్ వేదికను ప్రారంభించారు. వివిధ ఆర్ధిక అంశాలపై అవగాహన కలిగించడంతో పాటు, మహిళలను ఆర్థిక సంస్థలు, నిపుణులతో అనుసంధానించి వారి ఆర్థిక సందేహాలు తీర్చడం ఈ వేదిక ముఖ్యోద్దేశం. అలాగే మహిళలకు ప్రభుత్వం కల్పిస్తోన్న ఆర్థిక ప్రయోజనాలు, డబ్బు నిర్వహణ చిట్కాలు, బీమా, పెట్టుబడులు, ట్యాక్సులు.. వంటి ఎన్నో అంశాలకు సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఈ వేదిక ద్వారా అందిస్తారు. దీని ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం, వ్యాపారవేత్తలుగా విజయం సాధించిన మహిళల కథనాలను ఈ వేదికగా పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపడం.. వంటివి చేస్తున్నారీ బిజినెస్ ఉమన్. తనతో పాటు తన బృంద సభ్యులు కూడా ఇందులో భాగమవుతున్నారు. ఓ బ్యాంకర్‌గా, వ్యాపారవేత్తగా రాణించిన నిసరికి రచనలోనూ మంచి పట్టుంది. ఈ క్రమంలోనే పలు ఆర్థిక విషయాలపై వ్యాసాలు కూడా రాస్తుంటారామె.
అదే వీటికి ఊపిరి!
మన దేశంలో చాలామంది ఆడవారికి చిన్న చిన్న ఆర్థిక విషయాల గురించి కూడా సరైన అవగాహన లేదని.. అందుకే అలాంటి వారిలో ఆర్థిక అవగాహన పెంచే ముఖ్యోద్దేశంతోనే ఈ వేదికను ప్రారంభించినట్లు చెబుతారు నిసరి. ‘మన దేశంలో చాలామంది మహిళలకు పెట్టుబడులు, ఆరోగ్య బీమా, పొదుపు పథకాలు, రుణాలు.. వంటి విషయాల్లో సరైన అవగాహన లేదు. కానీ ప్రతి మహిళా వాటి గురించి కనీస అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. దేనికెంత ఖర్చు పెట్టాలన్న నిర్ణయాధికారం వారికి రావాలి. నాలో కలిగిన ఈ ఆలోచనే ఈ స్టార్టప్ కి ఊపిరి పోసింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆర్థిక విషయాల్లో మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం ఆన్లైన్లోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. నా ఈ చిన్ని ప్రయత్నం మహిళల్ని ఆర్థికంగా బలవంతుల్ని చేయడంలో సహాయపడుతుందన్న నమ్మకం నాకుంది..’ అంటారు నిసరి.