ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ వ్యవస్థాపకుడికి భార్య ఆమె.. దేశంలోనే సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె స్థానం ఎప్పటికీ పదిలమే! అయినా ఓ సామాన్య మహిళలాగే సాదాసీదాగా ఉండడమంటేనే ఆమెకు ఇష్టం. డబ్బు, హోదా ఉన్నాయన్న అహంకారం, గర్వం ఇసుమంతైనా ఆమెలో కనిపించవు.
అది ఎంత పెద్ద సందర్భమైనా, మహామహులు పాల్గొనే కార్యక్రమమైనా.. సంప్రదాయ చీరకట్టులో, అదీ చాలా సింపుల్‌గానే వెళ్లడానికి ఇష్టపడతారామె.
ఇలా ఎంత చెప్పినా తరగని సద్గుణ సంపదను, నిలువెల్లా నిరాడంబరతను నింపుకొన్న ఆమెకు సమాజ సేవ చేయడమంటే మిక్కిలి మక్కువ. సందర్భం వచ్చినప్పుడల్లా అవసరార్థులకు కోట్ల రూపాయల్ని విరాళంగా అందించడానికి ఆమె ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే అందరిచేతా సేవా మూర్తిగా మన్ననలందుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధా మూర్తి.
తమ సంస్థ తరఫున పేదలకు ఇళ్లు కట్టించడం దగ్గర్నుంచి.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునేదాకా అడుగడుగునా ఆమె సేవా హస్తం ఉంటుందనడం అతిశయోక్తి కాదు. మరి, ఇలాంటి సేవా మూర్తి ఓ దేవాలయం ఆవరణలో కూరగాయలు అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా? తాజాగా అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. అది చూసిన వారంతా ‘సుధామూర్తి.. కూరగాయలు అమ్మడమేంటి?’ అని ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు నిజమేంటో తెలుసుకొని ఆమె సింప్లిసిటీకి అందరూ మరోసారి సలామ్ కొట్టారు. ఈ ఒక్క సందర్భమనే కాదు.. ఈ సేవా మూర్తి జీవితంలో అందరికీ ఆదర్శప్రాయమైన కోణాలు ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో!
సుధా మూర్తి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గానే కాకుండా.. సందర్భం వచ్చినప్పుడల్లా అవసరార్థులను ఆదుకుంటూ తనలోని దాతృత్వాన్ని చాటుతుంటారామె. అందుకే ఆమెకు సంబంధించిన ప్రతి వార్తా ఇంటర్నెట్లో సెన్సేషనే! ఆమె ప్రతి ఫొటో సోషల్ మీడియాలో వైరలే! సుధా మూర్తికి సంబంధించిన అలాంటి ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక దేవాలయం ఆవరణలో చుట్టూ కాయగూరలు, మధ్యలో ఆమె కూర్చున్నట్లుగా ఉన్న ఆ ఫొటో- ‘తనలోని అహంకారాన్ని త్యజించడానికి ఏడాదికో రోజు సుధా మూర్తి ఇలా కాయగూరలు అమ్ముతారు’ అన్న క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ అయింది. ఇది చూసిన చాలామంది ‘సుధా మూర్తి ఏంటి.. కాయగూరలు అమ్మడమేంటి?!’ అని ఆశ్చర్యపోయారు. కానీ అందులో నిజానిజాలేంటో ఆ తర్వాత తెలుసుకొని ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.
అది నా అదృష్టం!
తాను కాయగూరల మధ్యలో కూర్చున్న మాట వాస్తవమేనని, కానీ వాటిని అమ్మట్లేదంటూ తాజాగా దాని వెనకున్న స్టోరీని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మిసెస్ మూర్తి. నిజానికి ఆ ఫొటో ఇప్పటిది కాదు.. గతంలో తన ఇంటికి దగ్గర్లోని రాఘవేంద్ర మఠంలో భగవంతుడి సేవలో నిమగ్నమైనప్పుడు తీసింది అంటూ చెప్పుకొచ్చారామె.
‘మా ఇంటికి దగ్గర్లోని రాఘవేంద్ర మఠంలో ఏటా మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఇందులో భాగంగా భక్తులకు పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ భోజనాల ప్రిపరేషన్లో భాగంగానే కావాల్సిన కాయగూరల్ని ఎంచుకోవడానికి ఇలా మధ్యలో కూర్చున్నా. చిన్నప్పుడు మా బామ్మతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనేదాన్ని. అలా ఏటా ఈ కార్యక్రమంలో భాగమవడం నాకు అలవాటైంది. ఇందులో ఏదో తెలియని సంతృప్తి దాగుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. భగవంతుడి ముందు అందరూ సమానమే.. నిజానికి ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం.
ఇక ఈ వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు రోజూ ఉదయం 6.30 గంటలకు దేవాలయానికి చేరుకుంటా. 10 గంటల వరకు అక్కడే ఉండి ఆపై అటు నుంచి అటే ఆఫీస్‌కి వెళ్లిపోతా. 5 గంటల కల్లా ఆఫీసు పనులు ముగించుకొని 5.30 గంటల కల్లా మళ్లీ మఠానికి చేరుకుంటా. రాత్రి 10.30 గంటల దాకా దైవ సన్నిధిలో గడిపి ఆ తర్వాత ఇంటికొచ్చేస్తా. ప్రతి ఏటా ఈ రొటీన్‌నే ఫాలో అవుతున్నా. ఈ వేడుకలు నా మనసుకు ఎంతగానో హత్తుకుంటాయి..’ అంటూ తనలోని భక్తి భావాన్ని చాటుకున్నారు సుధ. ఇలా తన ఫొటో వెనకున్న అసలు కథేంటో తెలుసుకొని ఆమె దైవభక్తికి, భగవంతుడి ముందు అందరూ సమానమేనని ఆమె నమ్మే సూత్రానికి పలువురు ఫిదా అయిపోతున్నారు.
|
సేవ వైపు అలా అడుగులు పడ్డాయి!

చిన్నతనం నుంచీ భగవంతుడి సేవలో తరించిపోయిన సుధ.. మానవ సేవలోనూ అంతటి సంతృప్తి దాగుందంటారు. ఈ విషయం తన కూతురి ద్వారానే తనకు అవగతమైందంటున్నారామె. ‘ప్రజలకు సేవ చేయడంలో నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే అనిపిస్తుంది. నిజానికి ఈ విషయం నా కూతురే నాకు తెలియజేసింది.
‘నీకు జీవితంలో ఎన్నో విషయాలు తెలుసు.. నువ్వెంతో అనుభవజ్ఞురాలివి. అయితే అంతిమంగా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావ్? నీ జీవితానికంటూ సార్థకత ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నావ్?’ అని నా కూతురు నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నే నన్ను ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు బాటలు పరిచేలా చేసింది. ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో తరించేలా చేస్తోంది..’ అంటూ సేవా పథం వైపు తాను వేసిన అడుగుల గురించి చెబుతారు మిసెస్ మూర్తి.
1996లో తాను స్థాపించిన ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్’ ద్వారా తన సేవా కార్యక్రమాలను రోజురోజుకీ విస్తరింపజేస్తున్నారామె. ఆ సంస్థలో ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, పరిశుభ్రత, కళలు, సంప్రదాయం.. వంటి అంశాలను ప్రోత్సహిస్తూ.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతోందీ సంస్థ. విద్యలో భాగంగా ఇప్పటివరకు పలు పాఠశాలల్లో 70 వేల గ్రంథాలయాలను నెలకొల్పారు మిసెస్ మూర్తి. అలాగే బెంగళూరు సిటీని స్వచ్ఛత బాట పట్టించేందుకు కొన్ని వందల టాయిలెట్లను ఏర్పాటు చేయించారు. ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనైతే వీటి సంఖ్య 16 వేలకు పైమాటే! ఇక ఎక్కడ వరదలొచ్చినా సహాయం చేయడానికి అందరికంటే ముందు వరుసలో ఉంటారు సుధ. ఈ క్రమంలోనే వరదల్లో సర్వం కోల్పోయిన వారికి తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు సుమారు 2,300 ఇళ్లు కట్టించి అందజేశారు.
|
ఆలిగా.. ఇల్లాలిగా!

‘ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ పాత్ర తప్పకుండా ఉంటుంద’న్న మాటలు సుధా మూర్తి విషయంలో అక్షర సత్యం. తన భర్త నారాయణ మూర్తి ‘ఇన్ఫోసిస్ సంస్థ’ ఆలోచనతో వచ్చినప్పుడు ఆయనపై ఉన్న నమ్మకంతో మారు మాట్లాడకుండా ముంబయికి మకాం మార్చారామె. అంతేకాదు.. ఆ సమయంలో తన భర్త చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తాను దాచుకున్న పది వేల రూపాయలు పెట్టుబడిగా అందించి గృహలక్ష్మి అనిపించుకున్నారు. అంతేకాదు.. మూడేళ్ల పాటు ఇంటి ఖర్చులు, అవసరాలన్నీ తానే చూసుకుంటానని, మీరు మాత్రం సంస్థ అభివృద్ధి పైనే పూర్తి ధ్యాస పెట్టాలంటూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు మిసెస్ మూర్తి.
అంతేకాదు.. 1960ల్లో పురుషాధిపత్యం రాజ్యమేలుతోన్న తరుణంలోనే ఇంజినీరింగ్ విద్యనభ్యసించి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారామె. ఇలా తన చదువును వృథా కానీయకుండా.. ఇంటి ఆర్థిక అవసరాల కోసం వాల్చంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో సీనియర్ సిస్టమ్ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. మరోవైపు ఇంటి పనుల్నీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగారామె. అంతటితో ఆగకుండా ఇన్ఫోసిస్ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రోగ్రామర్‌గా కూడా మారారు సుధ. ఇలా భర్తకు చేదోడువాదోడుగా నిలిచే భార్యగా, ఇంటిని నడిపించే ఇల్లాలిగా.. రెండు విధాలుగా సక్సెసయ్యారు మిసెస్ మూర్తి.
|
నిరాడంబరత ఆమె రక్తంలోనే ఉంది!

పుట్టుకతోనే సింప్లిసిటీని పుణికిపుచ్చుకున్నారేమో అనిపిస్తుంది సుధా మూర్తిని చూస్తే! కాలేజీలో చదివే రోజుల నుంచే సంప్రదాయ చీరకట్టుకే విలువనిస్తూ వస్తోన్న సుధ.. నేటికీ అదే ఆహార్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత ఎదిగినా మనం పాటించే విలువలే మనమేంటో చెబుతాయన్నట్లుగా.. తాను ప్రస్తుతం కోట్లకు పడగెత్తినా, దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచినా.. సాదాసీదాగా ఉండడానికే ప్రాధాన్యమిస్తారామె. ఏ సందర్భమైనా, మహామహులు పాల్గొనే వేడుకైనా చక్కటి చీరకట్టు, నుదుటన బొట్టు, మెడలో నల్లపూసలు, సిగ.. ఇలా భారతీయత తొణికిసలాడే ఆహార్యం ఆమెకే సాధ్యమేమో అనిపించక మానదు!
‘కాశీలో పుణ్యస్నానం ఆచరించి.. మనకు నచ్చిన వస్తువులు వదిలేయడం సంప్రదాయం. అలా నా విషయంలో నేను షాపింగ్‌ని వదిలేశా.. అందులోనూ ముఖ్యంగా చీరల్ని! అలా అప్పట్నుంచి ఇప్పటిదాకా చీరలు కొనలేదు. కేవలం మరీ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా.. చీరకట్టులోనే నాకు ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది. అందుకే ఇతరుల మాటలు, మన గురించి వారు ఏం ఆలోచిస్తున్నారన్న విషయాల గురించి నేను పట్టించుకోను.. నాకు కంఫర్టబుల్‌గా ఉండే వాటినే ఎంచుకుంటా..’ అంటూ తన సింప్లిసిటీని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న తన నైజాన్ని చాటుతున్నారు సుధ.
|
365 రోజులు.. 265 సినిమాలు!

సుధా మూర్తి అంటే తన నిరాడంబరత, సేవా గుణమే గుర్తొస్తాయి. ఇలా తను నిరంతరాయంగా సేవలోనే తరించినా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకుంటారామె. ఈ క్రమంలోనే తనకు నచ్చిన అంశాలపై దృష్టి పెడతానని ఓ సందర్భంలో పంచుకున్నారు సుధ. ‘ఓ సోషల్ వర్కర్‌గా, రచయిత్రిగానే నేను మీకు తెలుసు. కానీ నా గురించి మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేనో పెద్ద సినిమా లవర్ని! నా హోమ్ థియేటర్లో 500లకు పైగా సినిమా డీవీడీలుంటాయి. సినిమా అంటే చాలామంది కథ, హీరో, హీరోయిన్.. వీటినే గమనిస్తారు. కానీ నేను అలా కాదు. వాటితో పాటు డైరెక్షన్, ఎడిటింగ్.. వంటి అన్ని కోణాల్ని పరిశీలిస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తా. నిజానికి నేను సినిమా జర్నలిస్ట్‌ని కావాల్సింది! సినిమాలంటే నాకు అంత పిచ్చి మరి! సంవత్సరం మొత్తమ్మీద 265 సినిమాలు చూస్తా..’ అంటూ సినిమాలపై తన మక్కువను పంచుకున్నారామె. అంతేకాదు.. ఎవరైనా సరే.. తమ వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత ఆసక్తుల పైనా దృష్టి పెట్టాలని చెప్పకనే చెప్పారీ సూపర్ ఉమన్.
|
పుస్తకాల పురుగు!
మిసెస్ మూర్తికి పుస్తకాలంటే ఎనలేని మక్కువ. అదే తనను గొప్ప రచయిత్రిగా మలిచిందంటారామె. పిల్లల పుస్తకాల దగ్గర్నుంచి షార్ట్ స్టోరీస్, సాంకేతిక పుస్తకాలు, ట్రావెలాగ్స్, నవలలు, నాన్-ఫిక్షన్ పుస్తకాలెన్నో రచించిన సుధ.. అత్యుత్తమ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరింట్లో అయితే పుస్తకాలు ఉండవో వారే అసలైన పేదవారు అంటారామె.
‘మా పెళ్లైన కొత్తలో తెలిసిన వారు డిన్నర్‌కి పిలిచారు. అయితే వెళ్లడానికి ముందే నా భర్త నాతో.. ‘వాళ్లు చాలా ధనవంతులు.. వారి ఇల్లు చాలా అందంగా ఉంటుంది..’ అని చెప్పారు. వాళ్లు నాకు ఓ చీరను కూడా బహుమతిగా ఇచ్చారనుకోండి. అయితే తిరిగి ఇంటికొచ్చాక ‘వాళ్లు ధనవంతులన్నారు.. కానీ వాళ్లు చాలా బీదవారు.. ఎందుకంటే వారింట్లో ఒక్క పుస్తకం కూడా లేదు..’ అని నా భర్తకు చెప్పాను.. అంతెందుకు ఇప్పటికీ ఏదైనా ప్రత్యేక సందర్భమొస్తే పుస్తకాలే గిఫ్ట్‌గా ఇస్తుంటా..’ అంటూ పుస్తకాలపై తనకున్న ఇష్టాన్ని ఒక్క ఉదాహరణతో చెప్పేశారు సుధ. అంతేకాదు.. దాదాపు 20 వేలకు పైగా పుస్తకాలతో తన ఇంట్లో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసుకున్నారీ బుక్ లవర్.
|
ఓ కూతురిగా, భార్యగా, ఇల్లాలిగా, మానవతావాదిగా.. ఇలా ప్రతి దశలోనూ తనకు తానే సాటిగా ఎదిగారు సుధా మూర్తి. నిలువెత్తు నిరాడంబరతకు, సేవా దృక్పథానికి ఆమె మారు పేరు. అన్నిటికీ మించి బహుముఖ పాత్రల్లో ఆమె ప్రదర్శించే కార్య దక్షతను స్ఫూర్తిగా తీసుకొని విజయ శిఖరాలు అధిరోహించిన మహిళామణులెందరో! అందుకే ఆమె జీవితం ఎంతోమంది అతివలకు ఆదర్శప్రాయం..!
సెల్యూట్ మేడమ్!